- కర్నాటక రాష్ట్ర విభజన ఉండదు
- మంత్రి ఉమేశ్ కత్తి వ్యాఖ్యల్లో కొత్తే లేదు
- కర్నాటక సిఎం బసవరాజ్ బొమ్మై వెల్లడి
బెంగళూరు, జూన్ 24 : 2024 ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్టాల్రు ఏర్పడుతాయనే మంత్రి ఉమేష్ కత్తి వ్యాఖ్యలపై కర్నాటక సిఎం బసవరాజు బొమ్మై స్పందించారు. ఎట్టి పరిస్థితిలోను రాష్ట్ర విభజన ఉండదని తేల్చి చెప్పారు. రాష్ట్ర విభజన అంశం ఉమేష్ కత్తి కొత్తగా వ్యాఖ్యానించలేదని గతంలోను మాట్లాడారన్నారు. ఉమేష్ కత్తిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రతిపక్షనేత సిద్దరామయ్య డిమాండ్‌ను దాటవేశారు. మరోవైపు కర్నాటక మంత్రివర్గ విస్తరణ ఉంటుందనుకున్న వారి ఆశలు గల్లంతయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్ళిన రోజునే ముఖ్యమంత్రి బసవరాజ్‌బొమ్మైకు పిలుపు రావడంతో మంత్రివర్గ విస్తరణ అంశమే ఉంటుందని భావించిన ఆశావహుల సంతోషం ఆవిరి అయ్యింది.
గురువారం మధ్యాహ్నం కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రస్తుతానికి అధిష్టానం పెద్దలు ఎవరినీ కలువలేదని తేల్చి చెప్పారు. నామినేషన్ పక్రియ ముగిశాక ఎవరు అందుబాటులో ఉంటారనేది ఇంకా తెలియదన్నారు. అవకాశం ఉంటే అధిష్టానం పెద్దలతో పాటు కేంద్రమంత్రులతోను కలుస్తానన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా కేంద్ర మంత్రులు, ముఖ్యనేతలందరూ భాగస్వామ్యులవుతున్నారు. విస్తరణ అంశమై ఎవరితోను చర్చలు జరిపే అవకాశం లేదన్నారు.