- వ్యక్తిని మర్డర్ చేసేందుకు దుండుగల యత్నం
- తప్పించుకున్న అరుణ్..ఇద్దరు దుండగుల పట్టివేత
కరీంనగర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20 : కరీంనగర్ జిల్లా మానకొండూరులో బుధవారం అర్ధరాత్రి జరిగిన కాల్పులు కలకలం రేపాయి. ఓ క్రిమినల్‌పై దాడి చేసేందుకు మరో క్రిమినల్ మూఠా రంగంలోకి దిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగేసరికి నిందితుల్లో కొందరు పరారయ్యారు. ఈ సంఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే.. రౌడీ షీటర్ అరుణ్ అనే అతన్ని హత్య చేసేందుకు గుర్తుతెలియని ఆరుగురు దుండగులు యత్నించారు. అతనిని గన్‌తో కాల్చే ప్రయత్నం చేయగా అరుణ్ వారినుంచి తప్పించుకున్నాడు. అయినప్పటికీ అతన్ని నిందుతులు వదిలిపెట్టలేదు.
అరుణ్ తలదాచుకున్న ఇంట్లోకి వెళ్లి గొడవకు ఎలాంటి సంబంధం లేని వారి ఇంట్లో సామాగ్రిని ధ్వంసం చేశారు. అరుణ్‌పై దాడి చేసిన వారిలో ఇద్దరిని పట్టుకొని స్థానికులు పోలీసులకు అప్పగించారు. అతన్ని చంపేందుకు వొచ్చిన దుండగల్లో ఒకరు తుపాకీతో బెదిరించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఆరుణ్ కూతురు వైష్ణవికి గాయాలు అయ్యాయి. గతంలో ఆరుణ్‌పై కరీంనగర్ పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటు నమోదు అయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మానకొండూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్లుగా తెలిపారు.