- అలాగని అజాగ్రత్తగా ఉండరాదు ఎంత మందికైనా చికిత్సకు ప్రభుత్వం సిద్ధం
- ప్రైవేటు హాస్పిటళ్లలో డబ్బులు తగలెయ్యొద్దు
- కొరోనా బడ్జెట్‌కు అదనంగా వందకోట్లు
- సమస్య మనొక్కరిది కాదు..ఇది ప్రపంచమంతా ఉంది
- టీచింగ్ వైద్యులకు యూజిసి స్కేళ్లు
- ఆయుష్ వైద్యుల వయోపరిమితి 65 ఏళ్లకు పెంపు
- ఉన్నతస్థాయి సక్షలో సిఎం కెసిఆర్ కీలక నిర్ణయాలు
కొరోనా విషయంలో ప్రజలు భయాం దోళనకు గురికావాల్సిన అవసరం లేదని, అదే సందర్భంలో నిర్లక్ష్యంగా కూడా ఉండవద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. వైరస్ సోకిన వారు అధిక వ్యయం చేస్తూ ప్రైవేటు హాస్పిటళ్లలో చికిత్స పొందాల్సిన అవసరం లేదని, ఎంత మందికైనా సేవలు అందించడానికి ప్రభుత్వ వైద్యశాలలు, ప్రభుత్వ వైద్య సిబ్బంది సంసిద్ధంగా ఉందని సీఎం వెల్లడించారు. కొరోనా వ్యాప్తి నివారణలోనూ, చికిత్సలోనూ ఎంతో గొప్ప సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి ముఖ్యమంత్రి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కొరోనా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉందని, సిఎం కెసిఆర్ అన్నారు. కేవలం తెలంగాణలోనే లేదని,. తెలంగాణలో పుట్టలేదని కూడా అన్నారు.. జాతీయ సగటుతో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మరణాల రేటు తక్కువగా ఉన్నదన్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు చాలా ఎక్కువగా ఉన్నదన్న విషయం గుర్తించాలన్నారు. వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి శుక్రవారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రజలకు పలు సూచనలు చేశారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో గురువారం నాటికి హాస్పిటళ్లలో ఉండి చికిత్స పొందుతున్న వారు 3,692 మంది ఉన్నారు. వారిలో తీవ్రమైన ఇతర జబ్బులున్న 200 మంది తప్ప మిగతా వారంతా కోలుకుంటున్నారు. రాష్ట్రంలో గురువారం నాటికి 41,018 మందికి వైరస్ సోకింది. అందులో 27,295 మంది అంటే 67శాతం కోలుకుని ఇంటికి వెళ్లిపోయారు. మిగతా వారిలో ఎలాంటి లక్షణాలు లేని 9,636 మంది •ం క్వారంటైన్‌లో ఉన్నారు.
మిగతా వారు హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు. వారంతా వేగంగా కోలుకుంటున్నారు. లక్షణాలు లేనప్పటికీ కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం వైరస్ సోకిన వారందరి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన గైడెన్స్‌తో చికిత్స అందిస్తున్నట్లు గుర్తించారు. దేశంలో అన్ లాక్ పక్రియ నడుస్తున్నది. ప్రజలు పనుల కోసం బయటకు వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ విమానాలు కూడా నడపాలని నిర్ణయించింది. కొరోనాతో సహజీవనం చేయక తప్పని స్థితి వచ్చింది. అయితే కరోనా విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరీ అంత భయంకరమైన పరిస్థితి లేదు. అదే సమయంలో ప్రజలు నిర్లక్ష్యంగా కూడా ఉండవద్దు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. మాస్కులు ధరించాలి. శానిటైజర్లు వాడాలి. వీలైనంత వరకు ఇండ్లలోనే ఉండాలని సిఎం కెసిఆర్ సూచించారు. తెలంగాణలో కరోనా వ్యాప్తి నివారణకు, కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం సర్వసిద్ధంగా ఉంది. కరోనాను ఎదుర్కొనే విషయంలో కేంద్ర ప్రభుత్వమే మొదట గందరగోళంలో ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కావాల్సినవన్నీ చాలా వేగంగా సమకూర్చుకున్నాం. ఇప్పుడు వేటికీ కొరతలేదు. హైదరాబాద్ లోని గాంధి, టిమ్స్‌లోనే దాదాపు 3వేల బెడ్లు ఆక్సిజన్ సౌకర్యంతో సిద్ధంగా ఉన్నాయి. అలాగే ఆక్సిజన్ సౌకర్యమున్న 5 వేల బెడ్లను సిద్ధం రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ సౌకర్యం కలిగిన 5 వేల బెడ్లను సిద్ధం చేశామని, అన్ని ఆసుపత్రుల్లో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల బెడ్లను కేవలం కరోనా కోసమే ప్రత్యేకంగా కేటాయించినట్లు సీఎం కెసిఆర్ తెలిపారు. ఇన్ని బెడ్లు గతంలో ఎన్నడూ లేవు. 1500 వెంటిలేటర్లు సిద్దంగా ఉన్నాయి. లక్షల సంఖ్యలో పిపిఇ కిట్లు, ఎన్ 95 మాస్కులు సిద్ధంగా ఉన్నాయి. మందులు, ఇతర పరికరాల కొరత లేదు. ప్రభుత్వ వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది ఎంతో గొప్పగా సేవలు అందిస్తున్నారు. అవగాహన లేకుండా ఎవరో చేసే చిల్లర మల్లర విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆత్మస్థైర్యంతో ముందుకు పోవాలి. ప్రజలకు మెరుగైన వైద్యం సమర్థవంతంగా అందించే విషయంపైనే వైద్య సిబ్బంది ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి. ప్రజలు హైరానా పడి అధిక వ్యయం చేస్తూ ప్రైవేటు హాస్పిటళ్లకు పోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసిఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం మంచి చికిత్స అందుతున్నది. ఎవరికి లక్షణాలు కనిపించినా వెంటనే సపంలోని ఆసుపత్రులకు వెళ్లి, వైద్యుల సలహా తీసుకుని చికిత్స పొందాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పి.హెచ్.సి. స్థాయి నుంచి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా విషయంలో కావాల్సిన వైద్యం అందించడానికి ఏర్పాట్లున్నాయి. కాబట్టి వీటిని ప్రజలు వినియోగించు కోవాలన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు, వైరస్ సోకిన వారికి మంచి వైద్యం అందించడానిక ప్రభుత్వం ఎంత ఖర్చయినా పెట్టడానికి సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు. కొరోనా వ్యాప్తి నివారణ చర్యలు, మెరుగైన వైద్యం అందించే విషయంలో అత్యవసర పనులు నిర్వహించుకోవడానికి వీలుగా జనరల్ బ్జడెట్‌కు అదనంగా రూ.100 కోట్లు కేటాయించారు. ఆరోగ్య మంత్రి, సిఎస్ తక్షణ నిర్ణయాలు తీసుకుని అమలు చేయడానికి వీలుగా ఈ నిధులను అందుబాటులో పెడతారని సీఎం కేసీఆర్ చెప్పారు.
వైద్య కళాశాలల్లో అధ్యాపకులకు యూజీసీ స్కేల్
వైద్య కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులకు యుజిసి స్కేల్ అమలు చేయాలని సీఎం నిర్ణయించారు. కొత్తగా నియామకమైన నర్సులకు కూడా పాత వారితో సమానంగా వేతనాలు చెల్లించాలని, ఆయుష్ విభాగాల్లో పనిచేస్తున్న అధ్యాపకుల పదవీ విరమణ వయో పరిమితిని 65 ఏళ్లకు పెంచాలని నిర్ణయించారు. ఔటో సోర్సింగ్ ఉద్యోగులతో పాటు వైద్యఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వారిలో ఏ ఒక్కరినీ మినహాయించకుండా ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వం అందించే పదిశాతం అదనపు వేతనం కోవిడ్ ఇన్సింటివ్ కొనసాగించాలని ఆదేశించారు. పోలీసుశాఖ సిబ్బంది, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పనిచేసే పారిశుధ్య సిబ్బందికి ఇన్సెంటివ్‌లు కొనసాగించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో పిజి పూర్తి చేసిన 1200 మంది వైద్యులను ప్రభుత్వ సర్వీసులోకి తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. పి.హెచ్.సి.లలో ఖాళీగా ఉన్న 200 మంది డాక్టర్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. కరోనా సోకిన వారికి అందించే వైద్యంలో భాగంగా వేసే రెయ్ డిస్ట్రి, టో సిలిజుమాబ్ ఇంజక్షన్లు, ఫావి పిరావిర్ టాబెట్లను పెద్ద మెత్తంలో సిద్ధంగా పెట్టుకోవాలని సూచించారు. కావాల్సిన వారికి ఉచితంగానే అందివ్వాలని, ఎట్టి పరిస్థితుల్లో కొరత రానీయవద్దని చెప్పారు. ప్రైవేటు హాస్పిటళ్లు బెడ్ల అందుబాటు విషయంలో పారదర్శకంగా వ్యవహరిం చాలని అన్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. ప్రతీ హాస్పిటల్ తమ వద్ద ఎన్ని బెడ్లు ఉన్నాయి? అందులో ఎన్ని ఖాళీగా ఉన్నాయి అనే విషయాలను బహిరంగ పరచడంతో పాటు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముర్తాజా రిజ్వి, ఆరోగ్యశాఖ వివిధ విభాగాధిపతులు కరుణాకర్ రెడ్డి, రమేశ్ రెడ్డి, శ్రీనివాస్, గంగాధర్, చంద్రశేఖర్ రెడ్డి, సిఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.