Take a fresh look at your lifestyle.

తల్లిపాలకు ప్రత్యామ్నాయం లేదు

నేటి నుండి తల్లిపాల వారోత్సవాలు
శిశువుకు తల్లిపాలను మించిన ఆహారం లేదు. ప్రోటీన్లు, విటమిన్లతో కూడిన తల్లిపాలను తాగిం చినప్పుడే బిడ్డ ఆరోగ్యంగా పెరగ గలుగుతుంది. తల్లి పాలలో కార్బోహైడ్రేట్స్ 7.1%, ‌ఫాట్స్ 4.5%, ‌ప్రోటీన్స్ 0.9%, ‌మినరల్స్ 0.2%, ‌డైజెస్టివ్‌ ఎం‌జైమ్స్, ‌హార్మోన్లు, విటమిన్లు, యాంటీ బాడీలు, లింఫోసైట్లు ఉంటాయి. అందుకే తల్లిపాలను తప్పని సరిగా తాగిం చాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేస్తోంది.తల్లి పాల విశిష్టతను తెలిపే రీతిలో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆగష్టు నెల మొదటి వారం రోజులు తల్లిపాల వారోత్సవాలుగా వాబా (వరల్డ్ అలైన్స్ ‌ఫర్‌ ‌బ్రెస్ట్ ‌ఫీడింగ్‌ ఎక్షన్‌ ) ‌సంస్థ పర్యవేక్షణలో డబ్ల్యు.హెచ్‌.ఓ , ‌యునిసెఫ్‌, ‌బి.పి.ఎన్‌.ఐ ‌వంటి అంతర్జాతీయ, జాతీయ సంస్థల అనుబంధంగా జరుపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. పుట్టిన పసి పిల్లలకు శక్తితో పాటు, శారీరక అనారోగ్య సమస్యలు, మానసిక పరమైన సమస్యలను తల్లి పాలు దరిచేర నియ్యవు. పిల్లలకు తల్లిపాలు ఇవ్వకుంటే భవిష్యత్తులో పలు విధాలైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.నిజానికి చనుబాలు పిల్లలకు ప్రత్యేక ఔషధంగా పనిచేస్తాయి.

తల్లిపాలను సరిగ్గా పిల్లలకు ఇవ్వగలిగితే ఏటా 8.23 లక్షల మంది పిల్లలను ఐదేళ్ల లోపు మరణించకుండా కాపాడు కోవచ్చు. పిల్లలకు చనుబాలు ఇవ్వకపోవడం వల్ల, రొమ్ముకేన్సర్లతో మరణిస్తున్న మహిళల సంఖ్య 20 వేల వరకు ఉంది అంటే ఈ సమస్య ఎంత ఎక్కువగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.కన్న బిడ్డకు తల్లిపాలు పట్టించడం చాలా అవసరం. తల్లి పాలు తాగడం వల్ల పుట్టిన బిడ్డ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కనుక బిడ్డకు కనీసం ఆరు నెలలు నిండే వరకైనా తల్లి పాలు తప్పనిసరిగా ఇవ్వాలని వైద్యులు సూచిస్తుంటారు. మార్గదర్శకాల ప్రకారం 6 నెలల తర్వాత చనుబాలు మరిచి పోయేలా చేసి మరో ప్రత్నామ్నాయ ఆహారం ఇవ్వడం ప్రారంభించాలి. బిడ్డకు అవసరమైన పోషకాలు తల్లిపాల ద్వారా లభించాక, ఇతర ఆహారాల ద్వారా పిల్లలకు పోషకాలను అందించాలి. తల్లి బిడ్డకు తన చను పాలు ఇవ్వడం వలన బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతుంది. అంతేకాకుండా తల్లికి కూడా మేలు జరుగుతుంది. తల్లిపాలు పట్టించడంవల్ల శిశుకు ఇన్‌ఫెక్షన్ల నుంచి, రక్షణ డయేరియా, వాంతుల సమస్య నుంచి రక్షణ లభిస్తుంది.

ప్రసవమయిన మొదటి రోజు నుండీ నాలుగు రోజుల వరకూ రొమ్ముల నుండీ చిక్కటి పసుపు పచ్చటి ద్రవం స్రవిస్తుంది. దీనిని కొలోస్ట్రమ్‌ ‌లేదా ‘‘ముర్రుపాలు’’ అంటారు. ఆ తర్వాతే తెల్లటి పాలు వస్తాయి. ఈ ముర్రుపాలు శిశువులకు చాలా ముఖ్యం. మొదటి ఆరు నెలలు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం ద్వారా బిడ్డకు జీర్ణకోశ సంబంధిత సమస్యలు ఉండవు. జీర్ణకోశ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. చాలా తేలికగా అరుగుదల జరుగుతుంది. బిడ్డకు మలబద్దక సమస్య ఉండదు. తల్లిపాల వలన ఆస్తమా, చెవి సంబందించిన వ్యాధులు రాకుండా కాపాడుతుంది. తల్లిపాల వలన…స్ధూలకాయం ఉండదని శాస్త్రవేత్తల పరిశోధన వలన తేలింది. తల్లిపాలు…పిల్లల దశలో లుకేమియా వ్యాధి రాకుండా, అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధి పెద్ద వయస్సులో రాకుండా కాపాడు తుంది. తల్లిపాలు- పిల్లల తెలివి తేటలను పెంచు తుంది.

తల్లికి రొమ్ము క్యాన్సర్‌, అం‌డాశయ క్యాన్సర్‌ ‌లాంటివి రాకుండా స్త్రీని కాపాడుతుంది. ఎంత ఎక్కువ కాలం తల్లి బిడ్డకు పాలు ఇస్తే అంత మంచిది. వ్యాధు లు నుండి అంతే ఎక్కువ కాపాడుతుంది. ఆవు లేక గేది పాలు తీసుకున్న పిల్లలు ఎక్కువ అలర్జీ సమస్యలకు గురి అవుతారు. తల్లిపాలను భారత దేశంలో కేవలం 37 శాతం మంది పిల్లలే ఆరునెలల వరకు తాగుతున్నారు. పిల్లలకు ఎంత తక్కువ పాళ్ళల్లో తల్లి పాలు అం దిస్తున్నారో అర్ధం అవుతోంది. కారణం తల్లిపాల గొప్ప తనం తెలియక పోవడం కావచ్చు, కొంతమంది వక్షోజాల అందం తగ్గుతుందనో, లేదా ఇచ్చే వెసులు బాటు లేకపోవడమో కానీ చాలామంది శిశువులకి తల్లిపాల రుచి అందడం లేదు. ప్రకృతి సహజంగా ప్రసాదించిన తల్లి పాలను ఉపయోగించుకోక పోవడం మానవజాతి పరిణామ క్రమంలో ఒక శాపం. వివిధ కారణాల వల్ల తల్లిపాలకు ప్రత్యమ్నాయం అనుసరిం చడం అత్యంత బాధాకరం.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

Leave a Reply