ఆయన అవినీతి చిట్టా లెక్కలు తీస్తున్నాం
నా ఫోన్ మాయం చేసింది పోలీసులే
బలగం సినిమా బంధాలను చూపింది
కెసిఆర్ కుటుంబ విలువలు తెలుసుకోవాలి
రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10 : సీఎం కేసీఆర్‌కు మానవ సంబంధాలు కాదు.. మనీ సంబంధాలే ముఖ్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. గతంలో రేవంత్ రెడ్డిని తన బిడ్డ పెళ్లిని చూడకుండా చేసిండని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ విలువలు తెలుసుకోవాలని సూచించారు. బిజెపి నేతలతో కలసి ఆయన బలగం సినిమా చూశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రాష్ట్రంలో నిరుద్యోగం తప్ప ఇంకేమి లేదన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై లాఠీ చార్జ్ చేసిన మూర్ఖుడు, తెలంగాణ ప్రజలని దోచుకుంటున్న మూర్ఖుడు.. ప్రజలను అరిగోస పెడుతున్న మూర్కుడు కేసీఆర్ అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు బెయిల్ రావద్దు అని ఎలా అంటాడని బండి సంజయ్ ప్రశ్నించారు. పోలీసులే తన ఫోన్‌ను దొంగిలించారని ఆరోపించారు. ప్రశాంత్ వాట్సాప్ చేస్తే తాను సాయంత్రం 5 గంటలకు చూసుకున్న అంటున్నారు. కానీ ఎగ్జామ్ 11:30 కి అయిపోయింది కదా అన్నారు. వరంగల్ సీపీ రంగనాథ్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని..ఆయన విజయవాడ, ఖమ్మం, వరంగల్‌లో ఏమేమి దందాలు చేసాడో తెలుసన్నారు. అన్ని బయటకి తీసుకోస్తామన్నారు.
ఈ క్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్‌పై పరువు నష్టం దావా వేయనున్నట్లు బండి సంజయ్ తెలిపారు. మరోవైపు.. రంగనాథ్‌పై వొచ్చిన ఆరోపణలను వెలికి తీస్తానని ప్రకటించారు బండి సంజయ్. దానికి తగ్గట్లే.. బండి సంజయ్ కారులో ఆసక్తికరమైన డాక్యుమెంట్స్ కనిపించాయి. రంగనాథ్‌పై వొచ్చిన ఫిర్యాదులు, ఆరోపణలపై రిపోర్ట్ చేసుకున్నారు. రంగనాథ్‌పై ఉన్న ఆరోపణలను బండి సంజయ్ త్వరలో వి•డియా ద్వారా బయట పెట్టే అవకాశం ఉంది. రెండు రోజుల క్రితం బీజేపీ ఎంపీలు బండి సంజయ్ అరెస్ట్ పై లోక్ సభ స్పీకర్‌కు కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ రాజ్య సభ సభ్యుడు డాక్టర్.లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఎంపీలు సోయం బాపూరావు, జీవీఎల్ నర్సింహారావు పార్లమెంట్‌లోని స్పీకర్ చాంబర్‌లో స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఫిర్యాదు నోటును అందజేశారు.
మానవ సంబంధాలు తెలియని కేసీఆర్‌కు బలగం సినిమా అంకితమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్. ఏప్రిల్ 10వ తేదీ సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని దేవి ధియేటర్‌లో బలగం సినిమా చూశారు. బండి సంజయ్ తోపాటు ఇతర బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ధియేటర్ లో సినిమా చూశారు. ‘బలగం సినిమా అద్భుతంగా ఉంది. మా కరీంనగర్‌కి చెందిన వేణు డైరెక్షన్‌లో వొచ్చిన ఈ సినిమాలో మానవ సంబంధాలు, కుటుంబ బాధ్యతల గురించి చక్కగా చూపించారు. మన హిందు సనాతన ధర్మాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. మనిషి బతికున్నప్పుడు, చనిపోయాక ప్రాముఖ్యతను బాగా చూపంచారు. ప్రస్తుత సమాజంలో ఒకరు చనిపోతే దాన్ని 11 రోజులు పండుగలా చేసుకుంటున్నారు.. కానీ దాని ప్రాముఖ్యత ఎవరి తెలీదు. పిట్టకి పెడుతున్నారు కానీ కాకి ముట్టిందా లేదా అని పట్టించుకోట్లేదు’ అన్నారు బండి సంజయ్.