పరమత సహనం విరాజిల్లిన నేల పై…
క్రీ.శ మొదటి శతాబ్దానికి ముందే భారతదేశం మిశ్రమ సంస్కృతి కలిగి ఉంది.గౌతమ బుద్దుని బోధనలు,సహానం,సూఫీ విలువలు,ఇబాదత్ ఖనా,భక్తి ఉద్యమంలోని ఉదాత్త భావాలు ఆనాటి వ్యక్తుల ఆలోచనలు భారతదేశ వైవిధ్యతను తెలియజేస్తాయి.స్వామి వివేకానంద,మౌలానా ఆజాద్,ఆల్తాఫ్ హుస్సేన్ అలీ లు ఈ దేశాన్ని,మిశ్రమ సంస్కృతి గల దేశం గా తెలియజేసారు. ఆనాటి నుండి ఆ సంస్కృతిని ఆ గౌరవాన్ని ఈ దేశ ప్రజలు కాపాడుకుంటూ వస్తూనే ఉన్నారు. సకల కులాలకు,సర్వ మతాలకు, భిన్న సంస్కృతులకు,ఆచారాలకు, సాంప్రదాయాలకు,నిలయమైన భారతదేశాన్ని లౌకిక దేశంగా రాజ్యాంగ నిర్మాతలు నిర్మించారు. ఈ దేశంలో మెజారిటీగా హిందువులు ఉన్నారు.మైనార్టీలుగా ముస్లింలు క్రైస్తవులు బౌద్ధులు, జైనులు, పారశీకులు ఉన్నారు. సహజంగా మెజార్టీ వర్గం ఉన్నచోట మైనార్టీలు వివక్షతలకు గురయ్యే అవకాశం ఉంటుంది.కాబట్టి అణగారిన,బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగంలో రక్షణలు పొందుపరిచారు.భారత రాజ్యాంగంలో 14,15,16,19 నిబంధనలో ఈ దేశ పౌరులకు సమానత్వ భావనను కల్పించబడింది.ఏ పౌరునికి కూడా,పుట్టుక, జన్మస్థలం, రంగు,మతం ఆధారంగా హక్కులు నిరాకరించరాదని స్పష్టంగా పేర్కొనబడింది. ప్రాథమిక హక్కుల లో భాగంగా ఈ దేశ పౌరులకు ఆర్టికల్ 25 నుండి 30 వరకు మత స్వాతంత్ర్యపు హక్కులను కూడా కల్పించడం జరిగింది.కాని నేడు ఆ హక్కుల ను కాలరాస్తూ పాలకులు పాలన కొనసాగిస్తున్నారు.హక్కులు అడిగిన చోట రక్షణలు కోరవలసి వస్తుంది.ఈ దేశంలో మైనారిటీ లు,దళితులు ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడబడుతున్నారు.
స్వాతంత్రోద్యమ కాలంలో భారతీయ సోదరభావాన్ని తుంగలో తొక్కిన బ్రిటిష్ ప్రభుత్వానికి పరోక్షంగా సహకరించి,జాతీయ వాదులు గా, ముద్ర వేసుకొని నేడు ఆ ఛాయలో పాలకులు గా చెలామణి అవుతున్నారు నేటి పాలకులు.మోది,అమిత్ షా లు పాలకులు గా చెలామణి అవుతున్న ప్రభుత్వం లో సంస్కృతి పేరుమీద, నాగరికత పేరు మీద దాడులు పతాక స్థాయికి చేరుకున్నాయి.భిన్న సంస్కృతులకు నిలయమైన భారతదేశం వైరుధ్యాలతో నడుస్తున్నది.పవిత్రత పేరుతో,శుద్ధి పేరుతో ఈ దేశ ప్రజల మానసిక భావనల పై బలవంతపు మత ద్వేషాలను నింపుతున్నారు.హిందూ ముస్లిం పేరుతో చరిత్ర ను విభజించి చారిత్రక అవశేషాలను కనుమరుగు చేస్తున్నారు. గో రక్షణ పేరుతో మైనారిటీ లపై చేసే దాడులు వారి విక్రృత చేష్టలకు నిదర్శనంగా కనబడుతున్నాయి. గో మాంసం ఎక్కువగా ప్రపంచంలో ఎగుమతి చేస్తున్న దేశాలలో భారతదేశం అగ్ర స్థానంలో ఉంది.వాటిని ఎగుమతి చేసే వ్యాపారం నిర్వహించే వారు సనాతన సాంప్రదాయాలకు విలువనిచ్చే సంఘ్ పరివార్, అనుబంధ సంస్థలైన బిజేపి కి సంబంధించిన ప్రతినిధులు వారి కుటుంబ సభ్యులే ముందున్నారు.అలాగే కుటుంబ సభ్యులు గా అల్లుల్లుగా, కోడళ్ళు గా బిజేపి లో అగ్ర శ్రేణి నాయకులు గా చెలామణి అవుతున్న వారు భాగస్వామ్యం చేసుకున్నారు.స్వదేశీయత సిద్దాంత లక్ష్యాలను కలిగి విదేశీ విద్య, సాంప్రదాయాలు అని వాటి మీద నిరంతరం దాడి చేసే వీరి తనయుల విద్యాభ్యాసం అంతా క్రైస్తవ విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్నాయి.
ద్విజాతి సిద్దాంతం తో విడివడిన భారతదేశంలో బిజేపి సిద్దాంత కర్త ఐన లాల్ కృష్ణ అద్వానీ స్వయంగా మహ్మద్ అలీ జిన్నా సమాధిని సందర్శించారు.ఇది లౌకికతకు నిదర్శనం.అలాగే తమ పాలనా కాలంలో నిర్మితమైనదే అసలైన చరిత్ర అని,గొప్ప పాలనా దక్షత కలిగిన వారం అని ప్రకటించుకనే కుహానా నాయకులు స్వయంగా పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇంటికి వెళ్ళి వారి ఆతిధ్యాన్ని స్వీకరించి మరల ఇక్కడికి వచ్చి వారు మత ఛాందస వాదులు అని ముద్ర వేసి వారి పట్ల మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు.బుల్డోజర్ల సంస్కృతి పై ఆధారపడి పాలన చేస్తున్నారు.ఇదిలా దేశంలో ఉంటే తెలంగాణ లో కూడా ఈ విధానాలను కొనసాగించడానికి పడరాని పాట్లు పడుతున్నది తెలంగాణ బిజెపి.
హైదరబాద్ రాజ్యం ప్రత్యేక వైవిధ్యత కలిగి ఉన్నది.గంగా యమునా తెహాజీబ్ దీని ప్రత్యేక లక్షణం.ముస్లిం పాలనా కాలంలో జమీందారులుగా,జాగీర్దాలుగా చెలామణి అవుతూ ప్రజల చెమట చుక్కలను రక్తం గా మార్చి ప్రజలను పన్ను రూపంలో పీడించిన వారు నిరంకుశులకు తాబేదార్లుగా ఉన్నారు.తెలంగాణను పరిపాలన ను పరిపాలించిన రాజ వంశాలన్ని గత కాలపు నాగరికత మూలాలను కాపాడుకుంటూనే , తెలంగాణ అస్తిత్వం కోసం నిరంతరం పరితపించారు.స్ర్తీ కి అత్యున్నత గౌరవాన్ని కల్పించిన శాతవాహన,ఇక్ష్వాకు లు నడయాడిన నేల.బౌద్ద సహానం తొణికిసలాడుతుంది.ఆధిక్యత ఏ రూపంలో ఉన్న బరిగీసి కొట్లాడిన చరిత్ర తెలంగాణ కు ఉంది.అవసరమైనప్పుడుల్లా తెలంగాణ ప్రశ్నించే తత్వాన్ని సజీవంగా ఉంచగలిగారు.హిందూ- ముస్లింల సమైక్యతకు చిహ్నాలు ఎన్నో హైదరాబాద్ రాజ్యంలో కనిపిస్తాయి.బెనారస్ లాంటి విశ్వవిద్యాలయాలకు కూడా తన రాజ్యంచే నిధులు పంపించి దేశంలో విద్యాభివృద్దికి పాటుపడిన చరిత్ర నిజాం పాలకులది.నిజాం నిరంకుశుడై నప్పటికి హైదరాబాద్ రాజ్యంలో విద్యా, వైద్య సౌకర్యాలు కల్పించారు.పరమత సహనాన్ని పాటించారు. ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన హైదరాబాద్ లోని ముస్లింలను బిజెపి టార్గెట్ చేసుకొని తెలంగాణలో మేము అధికారంలోకొస్తే పాత బస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటున్నారు.ముస్లిం రిజర్వేషన్ లు ఎత్తివేస్తాం అట్టి రిజర్వేషన్లను ఎస్సీ ఎస్టీ బీసీలకు కల్పిస్తామని అమిత్ షా వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే సోదరభావంతో కలిసిమెలిసి జీవిస్తున్న హిందూ ముస్లింల మధ్య అశాంతి అలజడులు సృష్టించడానికి రాజకీయ పాచికలను ప్రయోగిస్తున్నారని స్పష్టమవుతుంది.బిజెపి తెలంగాణకు ఇప్పటివరకు ఏ సహకారం అందించింది.?ఇంకా ఏ విధమైన సహకారం అందిస్తారు.? తెలంగాణ అభివృద్ధి నమూనా ఏ విధంగా ఉండబోతుందో..! స్పష్టం చేయకుండా అధికారం అనే దాహంతో బిజెపి నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. కులం పేరుతో మతం పేరుతో వోట్ల రాజకీయాలు చేయడం ఈ దేశ భిన్నత్వంలో ఏకత్వమనే సిద్ధాంతానికి విరుద్ధం.
అంబేద్కర్ పోరు వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న భాగ్యరెడ్డి వర్మ లాంటి వ్యక్తులు, మహాత్మా గాంధీ జీ లాంటి వ్యక్తులతో కలిసి దళితుల అభ్యున్నతి కోసం ఆది హిందూ పేరుతో పోరాటం చేసిన హైదరాబాద్ నేడు అపరిపక్వత రాజకీయ ఆలోచనలు కలిగిన నాయకులు,ఈ ప్రాంత అస్తిత్వాన్ని కించపరుస్తూ పోరు వారసత్వం లేకుండా కేవలం విభజన విద్వేషాలకే పరిమితమై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. చీకటి రాజకీయాలు నడుపుతూ వివిధ పార్టీలలో అనేక హోదాలలో పదవులు అనుభవించి తెలంగాణ భూములను అప్పనంగా తమ కబంధ హస్తాలలో పెట్టుకొని తమ రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసం ఆత్మగౌరవం పేరిట నిందలు మోపి,తెలంగాణ అస్తిత్వం కోసం కావాలిసిన మీకు జవసత్వాలను నింపుతున్న తెలంగాణ ప్రజలను కించపరుస్తున్నారు.నిలువెల్లా మోసం చేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని నిఖార్సయిన ఉద్యమ కారుల నుంచి స్వాధీనం చేసుకొని ఎన్నికల్లో లబ్ధి పొంది రాజకీయ పబ్బం గడుపుకున్న చరిత్ర కలిగిన వారిని అంచనా వేసి…పోరాటాలకు విరామం తప్ప విరమణ లేదని తెలంగాణ ప్రజలు ఐక్య ఉద్యమాల ద్వారా నిరూపించారు.అలాంటి ఈ నేల మీద రాజకీయ నాయకులు తమ రాజకీయ విన్యాసాలు ప్రదర్శిస్తూ రాజకీయ పూటలు గడుపుతున్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మేధో వికాసం చెందిన ఈ ప్రాంతంలో అసమ్మతికి చోటు లేదంటూ అసమ్మతిని వ్యక్తపరిచిన ప్రొఫెసర్ సాయిబాబా,వరవరరావు లపై ఉక్కు పాదం మోపుతున్నారు.కోర్టు తీర్పులు అన్ని సానుకూలంగా మార్చుకొని నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారు.కేంద్రంలో ని అక్కడి నాయకత్వం నిరంతరం నిర్బంధాలు,ఇక్కడి నాయకత్వం రెచ్చగొట్టే వ్యాఖ్యలు వీటన్నింటిని తెలంగాణ ప్రజలు నిరంతరం గమనిస్తున్నారు.ఇక్కడి పాలనా తీరు బాగా లేదని ఇక్కడి పాలకులపై చేసే పోరాటం ఒకటి మాత్రమే కాదు.అంతకంటే సంస్కృతి పేరు మీద చేసే దాడి అత్యంత ప్రమాదకరమైనది.ఆరెస్సెస్ ,సంఘ్ పరివార్ శక్తుల భావ జాలం తెలంగాణ నేలకు తగినది కాదు.ఆ భావజాలాన్ని తుంచి వేయడంలో తగిన జాగరూకతతో వ్యవహరించి కుహానా రాజకీయ నాయకులకు ,మత ఛాందస వాదులకు చోటు దక్కనీయ కుండా ఈ తెలంగాణ ప్రాంతాన్ని, ప్రశ్నించే తత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పౌర సమాజం పై,ప్రజలపై ఉంది.
-పందుల సైదులు
తెలంగాణ విద్యావంతుల వేదిక
9441661192