Take a fresh look at your lifestyle.

రద్దు తప్ప మరో మాట లేదు: రైతులు, రద్దు చేయడం సాధ్యం కాదు: కేంద్రం

  • తమతమ వాదనలకే కట్టుబడ్డ ఇరు వర్గాలు
  • చర్చల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన
  • రాజధానిలో రైతుల ఆందోళన యథాతథం
  • 15న మరో మారు చర్చలు జరపాలని కేంద్రం నిర్ణయం

వివాదాస్పద సాగు చట్టాలపై కేంద్ర మంత్రులు, రైతు సంఘాల ప్రతినిధుల మధ్య శుక్రవారం జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఈనెల 15న మరోసారి సమావేశం కావాలని మాత్రం నిర్ణయించారు. విజ్ఞాన్‌ ‌భవన్‌లో సుమారు గంటసేపు చర్చలు జరిగినప్పటికీ ఇరువర్గాలు తమ వాదనకే కట్టుబడ్డాయి. సాగు చట్టాలను రద్దు చేయాలని రైతు ప్రతినిధులు ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేశారు. చట్టాలను వెనక్కితీసుకుంటేనే తాము నిరసనలకు స్వస్తి చెప్పి ఇళ్లకు వెళ్తామని చెప్పారు. మరోవైపు, ప్రభుత్వం కూడా తమ వైఖరి మరోమారు స్పష్టం చేసింది. వివాదాస్పద క్లాజులకే చర్చలు పరిమితం చేద్దామని, చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకునేది లేదని తెగేసి చెప్పింది. ఎనిమిదో రౌండు చర్చల్లో 41 మంది సభ్యుల రైతుల ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ ‌తోమర్‌, ‌రైల్వే మంత్రి పీయూష్‌ ‌గోయెల్‌, ‌వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్‌ ‌ప్రకాష్‌ ‌ప్రభుత్వం తరఫున హాజరయ్యారు. చర్చల్లో ప్రభుత్వం తమ వాదన వినిపిస్తూ, వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు పెద్దఎత్తున రైతు సంస్కరణ చట్టాలను స్వాగతిస్తున్నారని, యావత్‌ ‌దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే యూనియన్లు ఆలోచించాలని కోరింది. గంటసేపు సమావేశానంతరం తమలో తాము సంప్రదించుకున్న ముగ్గురు మంత్రులు సమావేశ హాలు నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇందుకు ప్రతిగా ’జీతేంగే యా మరేంగే’ నినాదాలున్న పేపర్లు పట్టుకుని రైతు నేతలు మౌనం పాటించారు. కాగా, చర్చలు అసంపూర్తిగా ముగిసినప్పటికీ జనవరి 15న జరిగే తదుపరి చర్చలకు హాజరవుతాయని రైతు నేతలు ప్రకటించారు.

కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన నిరసిస్తున్న రైతుల సంఘాలతో శుక్రవారం జరిగిన ఎనిమిదో విడత చర్చలు శుక్రవారం ఎటూ తేలకుండా ముగియడంతో ఆందోళన కొనసాగుతుందని రైతు సంఘాల నేతలు ప్రకటించారు. అయితే చట్టాలు వెనక్కి తీసుకోవడం తప్ప మరే ప్రతిపాదనకైనా తాము సిద్ధమేనని కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసింది. కొత్త వ్యవసాయ చట్టాలను రైతులను అర్థం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేసింది. అటు రైతు సంఘాల నేతలు, కేంద్రం పట్టువీడకపోవడంతో చర్చలు ఎటూ తేలకుండానే ముగిశాయి. ఈ నెల 15న మరోసారి సమావేశం కానున్నట్లు కేంద్రమంత్రి తోమర్‌ ‌తెలిపారు. సమావేశం జరుగుతుండగా.. విజ్ఞాన్‌ ‌భవన్‌ ‌రైతులు ’మరణమో లేదా విజయమో’, ’చట్టాలు రద్దయితేనే ఇంటికి’ నినాదాలతో ప్లకార్డులను ప్రదర్శించారు. ఇదిలా ఉండగా.. కేంద్రం తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించకపోతే ఆందోళనలు ఉధృతం చేసేందుకు రైతు సిద్ధమవుతున్నారు.

ఈ నెల 11న రైతు సంఘాల సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో భవిష్యత్‌ ‌కార్యాచరణపై చర్చించనున్నారు. నూతన సాగుచట్టాలపై రైతు ప్రతినిధులు, కేంద్రం మంత్రుల బృందం మధ్య వాడివేడిగా చర్చలు జరిగాయని, చట్టాలను రద్దు చేయడం మినహా తాము ఏ కోరుకోవడం లేదని ప్రభుత్వానికి తేల్చి చెప్పామని ఆల్‌ ఇం‌డియా కిసాన్‌ ‌సభ ప్రధాన కార్యదర్శి హన్నన్‌ ‌మొల్లా తెలిపారు. అనంతరం డియాతో హన్నన్‌ ‌మొల్లా మాట్లాడుతూ, సాగు చట్టాలే రద్దే తమ ప్రధాన డిమాండ్‌ అని అన్నారు. దీనిపై తాము కోర్టులకు వెళ్లేది లేదన్నారు. ’చట్టాలను రద్దు చేయాల్సిందే. లేకుంటే మా పోరాటం కొనసాగిస్తాం. ముందుగా ప్లాన్‌ ‌చేసినట్టుగానే ఈనెల 26న రైతు పరేడ్‌తో ముందుకు వెళ్తాం’ అని ఆయన తెలిపారు. నూతన సాగుచట్టాలను రద్దు చేసేంత వరకూ రైతులు వెనక్కి తగ్గేది లేదని భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌ ‌నేత రాకేష్‌ ‌తికాయిత్‌ ‌తెలిపారు. కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని మాత్రమే తాము కోరుతున్నట్టు తికాయిత్‌ ‌స్పష్టం చేశారు.

Leave a Reply