- ఎపిలో పెట్టి అన్న జగన్‌తో కొట్లాడాలన్న విహెచ్
- షర్మిల కెసిఆర్ వదిలిన బాణమన్న రేవంత్
- ఒక్కోసారి ఒక్కొక్కరికి బాణంగా ఉపయోగపడుతుందన్న సీతక్క
- షర్మిల కొత్త పార్టీపై కాంగ్రెస్‌లో భిన్న స్వరాలు
పార్టీలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ, కాంగ్రెస్ పార్టీ అలాగే ఉంటుంది.. అది కాంగ్రెస్ పార్టీకి ఉన్న చరిత్ర అదని పేర్కొన్న షబ్బీర్ అలీ… దేశానికి స్వాతంత్య్ర ఇచ్చింది, తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీయే అన్నారు.. వైఎస్‌ను కాంగ్రెస్ నమ్మింది.. తాను కూడా ఆయనను నమ్మా.. ఆయన కేబినెట్లో పనిచేశానని గుర్తుచేసుకున్నారు. అయితే, ఆయన మరణంతో పార్టీకి నష్టం జరిగినమాట వాస్తం అన్నారు. షర్మిల పార్టీపై షబ్బీర్ అలీ ఈ వ్యాఖ్యలు చేశారు. తమకు ఏ పార్టీ కావాలో ప్రజలే నిర్ణయించుకుంటారని ఆయన పేర్కొన్నారు. వైఎస్ మరణంతో ఉమ్మడి ఆంధప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని షబ్బీర్ పేర్కొన్నారు. వైఎస్‌కు కుటుంబసభ్యులు వారసులు కారని, కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే వైఎస్‌కు నిజమైన వారసులని ఆయన తెలిపారు. ఇకపోతే సీఎం కేసీఆర్ మాట్లాడేదంతా ఓ డ్రామా అని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు.
ప్రజలకు అబద్దాలు చెప్పడంలో సీఎం కేసీఆర్ గిన్నిస్ రికార్డ్‌కు ఎక్కాలని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు ప్రజలు చెప్పుతోనే సమాధానం ఇవ్వాలని షబ్బీర్ అన్నారు. వొచ్చే ఎన్నికలలో కేసీఆర్‌కు ప్రజలు వోట్లతోనే సమాధానం చెప్పాలని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ఎంపీ సీటు ఇవ్వలేదని అన్న జగన్‌పై షర్మిల కోపం పెంచుకుందని మాజీ పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ హనుమంతరావు అన్నారు. అన్న వి•ద కోపంతో తెలంగాణలో షర్మిల పార్టీ పెడితే ఏం లాభమని ఆయన ప్రశ్నించారు. అన్నపై కోపం ఉంటే షర్మిల ఆంధ్రలో పార్టీ పెట్టుకోవాలని ఆయన సూచించారు. వైఎస్ షర్మిల.. జగన్ వి•ద స్ట్రెయిట్ ఫైట్ చేయాలని వీహెచ్ సూచించారు.
జగన్ అన్యాయం చేస్తే ఏపీలో యుద్ధం చేయాలన్నారు. తెలంగాణలో యుద్ధం చేస్తే ఉపయోగం ఉండదన్నారు. వ్యతిరేక వోటు చీలితే కేసీఆర్‌కు లాభం జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ నుంచి ఎవరూ షర్మిల పార్టీలో చేరరని స్పష్టం చేశారు. షర్మిల వెనుక ఎవరున్నారో త్వరలో బయటపడుతుందన్నారు. పార్టీలు పెట్టించడంలో బీజేపీ నాయకుడు అమిత్ షా దిట్ట అని అన్నారు. షర్మిల పార్టీలోకి కాంగ్రెస్‌కు చెందిన రెడ్డి సామాజిక వర్గం నేతలెవ్వరూ వెళ్లరనే భావిస్తున్నట్లు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టుపై షర్మిల ఏ సమాధానం చెబుతుందని వీహెచ్ నిలదీశారు.వైఎస్.షర్మిల కొత్త పార్టీపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి స్పందించారు. షర్మిల జగనన్న వదిలిన బాణం కాదని.. కేసీఆర్ మళ్లీ సీఎం కారు కాబట్టే.. కాంగ్రెస్‌ని దెబ్బతీయడానికి కేసీఆర్ వదిలిన బాణం అని అన్నారు. ప్రపంచ నలుమూలలా వైఎస్ అభిమానులు ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ సీఎంగా వైఎస్ జనరంజక పాలన అందించారని గుర్తుచేశారు.
రాష్ట్రం తెచ్చుకుంది తెలంగాణ బిడ్డలు రాజ్యం ఏలాలని.. అంతేకానీ రాజన్నబిడ్డలు రాజ్యం ఏలాలని కాదని వ్యాఖ్యానించారు. కృష్ణా జలాలపై షర్మిల వైఖరేంటో చెప్పాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్ షర్మిల ఒక్కోసారి ఒక్కొక్కరికి బాణంగా ఉపయోగ పడుతుందని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. షర్మిల కొత్త పార్టీపై స్పందించిన ఆమె ..ఇతర పార్టీల మేలు కోసం షర్మిల రాజన్న పేరును వినియోగించొద్దని సూచించారు. రాజీవ్ రాజ్యం అయినా, రాజన్న రాజ్యం అయినా కాంగ్రెస్‌తోనే సాధ్యమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వేర్వేరు కాదన్నారు. షర్మిల పార్టీ వెనుక ఎవరున్నారో త్వరలో బయట పడుతుందని సీతక్క అన్నారు. తమకున్న సమాచారం మేరకు ఆమెను నడిపిస్తున్న వారు ఎవరో తెలుసున్నారు. అయితే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను ఓడించిన ప్రజలు ఇప్పుడున పాలన చూసి జాగ్రత్త పడ్డారని, మళ్లీ కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వాలని చూస్తున్నారని అన్నారు.