Take a fresh look at your lifestyle.

మనసులోనే మర్మం ఉన్నది

‘‘తన కోపమే తన శత్రువు
తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ
తన సంతోషమే స్వర్గము
తన దు:ఖమే నరకమండ్రు మహిలో సుమతి..’’

మనవాళ్ళు ఎనాడో చెప్పిన జీవిత సత్యాన్ని ఇప్పుడు పరిశోధకులు నిజమని రుజువులు చూపుతున్నారు.
మనసు అనే మాటను నిర్వచించడం చాలా కష్టం. కానీ ఈ మనసు మనలను నడిపే దారం. మనసు చెప్పినట్టు నడచుకుంటూ ఉంటాము. అంటే …. మనకు ఒక పనిచెయ్యాలని ఉంటుంది. ఆటైమ్‌ ‌లో ఇది చేస్తే నీకు ఇలాంటి ఫలితం వస్తుంది అది చెయ్యకు మనసు చెపితే ఇక ఆ పని ఆపేస్తాము. అలాగే కొన్ని పనులు మనకు ఇష్టం ఉండదు కానీ చేస్తే నీకు ఫలానా లాభం అనే ఆలోచన మనసులోకి వస్తుంది. ఇష్టం లేకపోయినా చేసేస్తాం. కొన్ని మనసుకు నచ్చి చేస్తాం, కొన్ని నచ్చకపోయినా చేస్తాం. ఇలా మనసు మనను నడిపే దారం.
కేవలం ఎమోషనల్‌ ‌విషయాలో, మెటిరియలిస్టిక్‌ ‌పనులో మాత్రమే కాదు. ఇప్పుడు కొత్త పరిశోధనలు చెబుతున్న ఆసక్తికర విషయం ఏమిటంటే మన మనసు మన ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని. మనసు మనమెంత వరకు ఆరోగ్యంగా ఉండొచ్చనేది నిర్ణయిస్తుందట.

బయోలాజికల్‌ ‌క్లాక్‌
‌మనలో చాలా మందికి రోజూ పొద్దున్న ఒకే సమయానికి మెలకువ రావడం, రాత్రి ఒకే సమయానికి నిద్ర రావడం జరుగుతుంది. కొంత మందికి సరిగ్గా ఒకే సమయంలో రోజూ విరేచనం కూడా అవుతుంటుంది. ఇది శరీరానికి మనం చేసిన అలవాటు. ‘వయసు పెరగడం’ అనే విషయం కూడా అలా మనకు తెలియకుండా మన సబ్‌ ‌కాన్షియస్‌ ‌మెదడు మీద పనిచేసే అలారం వంటిదే అంటున్నాయి పరిశోధనలు. బయోలాజికల్‌ ‌క్లాక్‌ అనే పదం మనందరం వినే ఉంటాం. మన మనసుల్లో మనం ఎప్పుడో అనేసుకున్నాం అన్నట్టు 40ఏళ్ల వయసులో మధ్యవయసుకు చేరుకుంటాం కనుక ఏదో చిన్నదో పెద్దదో ఆరోగ్య సమస్యలు మొదలవుతుంటాయి అని. శరీరం ఆ ఆలోచనకు అనుగుణంగా 40 వ దశకం తర్వాత అనారోగ్యానికి సిధ్ధ పడిపోతుంది. అందుకే ఎక్కువ మందిలో బీపీ, షుగర్‌ ‌లు ఆ వయసులో మొదలై పోతాయి. 50,60 మధ్య అనారోగ్యాలు సాధారణం అని మనసుకు చెప్పి పెట్టేస్తాం మనకు మనమే. అందువల్ల ఇక అప్పుడూ తరచుగా డాక్టర్‌ ‌సంప్రదించడం సర్వసాధారణం అయిపోతుంది. ఇలా మన సబ్‌ ‌కాన్షియస్‌ ‌బ్రెయిన్‌ అదేనండి మన మనసు మనకు తెలియకుండానే బయోలాజికల్‌ ‌క్లాక్‌ ‌సెట్‌ ‌చేసి పెట్టేస్తుంది.

మనసే అంతా..
ఎక్కువ రోగాలకూ కారణమూ మనస్సే , విరుగుడు కూడా మనస్సే. ఇప్పటి వరకు అనుకున్నట్టు చాలా రకాల ఆరోగ్య సమస్యలకు శారీరక సమస్యలు కారణం కాదు, అది మనలోని ఆలోచనల నాణ్యత మీద ఆధారపడి ఉంటుందని నెమ్మదిగా నిరూపితం అవుతోంది. మనసు ఉల్లాసంగా ఉండే వారికి పెద్దగా అనారోగ్యం కలగదని కొత్త పరిశోధనలు చెబుతున్నాయి. మనసు బాలేని వారే ఎక్కువగా వ్యసనాల బారిన పడతారని అది రకరకాల అనారోగ్యాలకు కారణం అవుతుందనేది కాదనలేని సత్యం. ఇటీవలి కాలంలో అందుకే జీవన శైలి బాగు పరచుకొమ్మని డాక్టర్లు సలహ చెబుతున్నారు. ఇంతకు ముందు బీపీ, డయాబెటిస్‌ ‌వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలకు ఉప్పు తగ్గించాలి, తీపి తగ్గించాలి, బరువు తగ్గాలి అని చెప్పడం కంటే ముందు ఒత్తిడి తగ్గించుకోండి, ఉల్లాసంగా ఉండండి అనే సలహాలే ఎక్కువగా చెప్పటం గమనార్హం.

కాస్త కళాపోషణ
పొద్దున్నే వాకింగ్‌ ‌వంటి వ్యాయామాల వల్ల మెదడులో జరిగే రసాయన చర్య రోజంతా శరీరాన్ని మనసును ఉల్లాసంగా ఉంచుతుంది. అయితే ఇలా వాకింగ్‌ ‌లేదా జాగింగ్‌ ‌చేసే సమయంలో ఇష్టమైన సంగీతాన్ని తోడు తీసుకెళ్లిన వారు మరింత త్వరగా బరువు తగ్గినట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. మనసును ఉల్లాసంగా ఉంచడంలో కళల పాత్ర చాలా ఉంటుంది. సాహిత్యాభిలాష, సంగీతమో, నాట్యమో, చిత్రకళో ఇలా ఏదో ఒక దానిలో ఆసక్తి కలిగిన వారు తప్పకుండా రోజులో కాస్త సమయం అన్ని మరచి ఆనందంగా ఉంటారు అనేది వాస్తవం. అందుకు కళాభినివేషం ఉన్న కళాకారుల జీవినప్రమాణం ఎక్కువగా ఉండడమే. కేవలం డబ్బు సంపాదన పట్ల మాత్రమే ఆసక్తి కలిగిన వారికంటే కాస్త కళాపోషణ కలిగిన వారి ఆయుర్థాయం ఎక్కువగా ఉండడం మనం చూడవచ్చు. కాబట్టి కాస్త కళాభిలాష మంచి అటు మనసుకు ఇటు ఆరోగ్యానికి మంచిది.

ఆలోచనే ఆరోగ్యం
మన ఆలోచనా విధానం నేరుగా మనలో అనారోగ్యానికి కారణం అవుతోందని తెలిస్తే ఆశ్చర్యం కలుగక మానదు. ఎటువంటి ఆలోచన ఎలాంటి జబ్బును కలిగిస్తుందో ఒక సారి చూద్దాం. కడుపులో గ్యాస్‌ ఇబ్బంది పెట్టడం చాలా మందిలో కనిపిస్తుంది. దీన్ని ఆయుర్వేదంలో అపాన వాయువు అంటారు. తీసుకునే ఆహారంలో లోపం కంటే కూడా మనసులోని ఒత్తిడి ముఖ్య కారణం అని అంటున్నారు నిపుణులు.ఆవేశ పూరిత ఆలోచన, కోపం వల్ల బీపి పెరిగిపోవడం మనకు తెలిసిందే. ఉప్పు ఎక్కువ తినటం కంటే కూడా కోపదారితనం మనకు ఎక్కువ చెరుపు చేస్తుంది. తన కోపమే తన శత్రువు అనే మాట అక్షర సత్యం.కొవ్వు పదార్థాలు అధికంగా తీసుకునే వారికంటే కూడా బద్ధకంగా రోజు వెల్లబుచ్చే వారిలోనే కొలెస్ట్రాల్‌ ‌సమస్యలు వస్తాయని అంటున్నారు. బద్ధకం తగ్గించుకొని చురుకుగా ఉండడం వల్ల కొలెస్ట్రాల్‌ ‌ను నివారించవచ్చు. తీపి ఎక్కువగా తినే వారిలో లేదా సరైన ఆహార అలవాట్లు లేని వారిలోనే మధుమేహ సమస్య ఎక్కువ అని ఇప్పటి వరకు అనుకున్నాం కానీ… చాలా స్వార్థపూరిత ఆలోచనలు చేసే వారిలో, వ్యక్తిత్వంలో మొండితనం ఎక్కువగా ఉన్న వారిలోనే మధుమేహం ప్రమాదం ఎక్కువ అని తేల్చేస్తున్నారు. కాబట్టి సరళమైన ఆలోచనా విధానం, ఇతరుల పట్ల కాస్త సానుభూతి కలిగి ఉంటే డయాబెటిస్‌ ‌సమస్యకు దూరంగా ఉండొచ్చని దీని సారాంశం.నిరాశా వాద దృక్పథం, ప్రతి విషయంలో నెగెటివ్‌ ఆలోచన, ఎప్పుడూ విచారంలో ఆశలేని బతుకు గడిపే వారిలోనే అస్తమా వంటి అలర్జీలు అధికం అని అంటున్నారు. వాయునాళాల్లో కలిగే సమస్య కంటే మనసులో పెంచి పోషిస్తున్న సమస్యలే అనారోగ్య కారణం అనేది వాస్తవం.దమనుల్లో రక్త ప్రసరణ సరిగ్గా జరగకుండా రక్తప్రసారానికి అడ్డంకులు ఏర్పడటానకి ప్రశాంత చిత్తం లోపించడమే కారణం అని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ప్రశాంత చిత్తంతో ఉంటే గుండె సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ఇలా అనేక రకాల అనారోగ్యాలకు మూలం మన మనసులోనే ఉందని పరిశోధనలు, వాటి ఆధారంగా జరిపిన అధ్యయనాలు తెలియ జేస్తున్నాయి.

మనసే మందిరం
దేహమే దేవాలయం, జీవుడే సనాతన దైవం. మాటే మంత్రం, మనసే బంధం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నైనా.మనలో కలిగే అనారోగ్యాలలో 50 శాతం ఆధ్యాత్మికత లోపించడం వల్ల కాగా 25 శాతం మానసిక కారణాలు, మరో 15శాతం సామాజిక, స్నేహ బాంధవ్యాల లోపం వల్ల కలుగుతున్నాయి. కేవలం 10శాతం మాత్రమే శారీరక కారణాలతో వచ్చే అనారోగ్యాలు.

నమ్మకమే జీవితం
కడుపు మాడ్చుకొని రుచిలేని బతుకు గడపడం కంటే కూడా పోషక విలువలు అధికంగా కలిగిన ఆహారం తీసుకుంటూ, మనసులో నెగెటివ్‌ ఆలోచనలు తగ్గించి కాస్త సహనుభూతి, దయ, ప్రేమ వంటి పాజిటివ్‌ ‌దృక్పథాలను పెంచుకుంటూ ఉంటే మంచిది. మనసు ప్రశాంత చిత్తంతో ఉండడానికి యోగా, ధ్యానం వంటివి సాధన చెయ్యడం వల్ల కూడా ఇలాంటి మానసిక స్థితిని సాధించవచ్చు. ముందు కావల్సింది వయసు పెరుగుతోంది అన్న భావన నుంచి బయట పడాలి. కొత్త విషయాల పట్ల ఆసక్తి పెంచుకోవాలి. ఏ వయసైనా సరే నేర్చుకునే మనసుంటే ఏదైనా కాస్త అటూ ఇటుగా నేర్చుకోవచ్చు. ఒక చక్కటి హాబీ జీవితాన్ని కొత్త కోణంలో చూపుతుంది. అందంగా కనిపించేట్టు తయారవడం వల్ల ఒక పాజిటివ్‌ ‌ఫీల్‌ ‌వస్తుంది. కనుక కచ్చితంగా మన మీద మనకు శ్రద్ధ ఉండి తీరాలి. అన్నింటికంటే ముందు ఆలోచనలో మార్పు అవసరం. వయసు పైబడుతోంది అనే ఆలోచనను దూరం పెట్టి అనుభవం గడించాం అనుకోవడం వల్ల మనసును యంగ్‌ ‌గా పెట్టుకోవచ్చు.

తీసుకునే ఆహారం మనకు శక్తిని ఇస్తుందని, అది శుచిగా, శుభ్రంగా మనకు ఆరోగ్యాన్ని అందించే అమృతం అనే నమ్మకంతో తినాలి. ఈ రోజుల్లో తిండిలో ఏముంది ఉత్త గడ్డి వంటి ఆలోచన రాకుండా క్వాలిటీ తిండి తినాలి. వయసు కాదు పెరిగేది ఆరోగ్యం అనే నమ్మకంతో ఉండాలి. వయసు మనసుకు రాకుండా చూసుకుంటే ఒంటి మీదకు రాకుండా అడ్డుకోవచ్చని అంటున్నారు నిపుణులు. జపాన్‌ ‌సైంటిస్టుల పరిశోధనల సారాంశాన్ని అనుసరించి – స్వార్ధం, ద్వేషం, శత్రుత్వం, ఆవేశం, అసూయ, మొండితనం, బద్ధకం, విచారం వంటి నెగెటివ్‌ ఆలోచనలకు స్వస్తి చెప్పి, – కారుణ్యం, త్యాగం, శాంతం, క్షమ, నిస్వార్ధం, స్నేహభావం, సేవాభావం, కృతజ్ఞత, హాస్య ప్రియత్వం, సంతోషం వంటి సానుకూల దృక్పథం అలవరచుకుంటే మన:శరీరాలను యవ్వనంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉంచుకుంటూ నిండు నూరేళ్లు బతికెయ్యచ్చు.
-భవాని

Leave a Reply