Take a fresh look at your lifestyle.

దుబ్బాకలో బిజెపి ఎమ్మెల్యే ఉన్నా…అభివృద్ధి మాత్రం ఆపేది లేదు మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట, జూలై 28 (ప్రజాతంత్ర బ్యూరో): దుబ్బాకలో ఎమ్మెల్యే బిజెపిలో ఉన్నా.. తెలంగాణ ప్రజలు కాబట్టి అభివృద్ధి మాత్రం ఆపేది లేదనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. బుధవారం సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో మంత్రి హరీష్‌రావు పర్యటించారు. పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం బాలాజీ ఫంక్షన్‌ ‌హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీష్‌రావు, ఎంపి కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి, ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌ ‌రావు, ఎమ్మెల్సీ ఫారూఖ్‌ ‌హుస్సేన్‌, ‌జిల్లా అడిషనల్‌ ‌కలెక్టర్‌ ‌ముజమ్మీల్‌ ‌ఖాన్‌, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. ఇచ్చిన మాటకు కట్టుబడి 3 లక్షల మందికి రేషన్‌ ‌కార్డులు ఇస్తున్నామనీ, రాష్ట్రంలో 90.5 శాతం మందికి రేషన్‌ ‌బియ్యం అందుతున్నాయనీ, 2700 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో రేషన్‌ ‌బియ్యం పంచుతున్నామనీ, ప్రతి పేదవారికి రేషన్‌ ‌బియ్యం ఇస్తామన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు కేవలం తెలంగాణలోనే ఉందనీ, ప్రతి పేదింటి ఆడపిల్ల పెండ్లికి లక్ష రూపాయలు ఇస్తున్నామనీ, సంక్షేమానికి చిరునామా తెలంగాణ ప్రభుత్వం అన్నారు. అంతేకాకుండా, దేశానికి రోల్‌ ‌మోడల్‌ ‌తెలంగాణ ప్రభుత్వం అన్నారు.

అంబేద్కర్‌ ‌భవనం, జగ్జీవన్‌ ‌రామ్‌ ‌భవన నిర్మాణాలకు ఒక్కో భవనానికి 50 లక్షల చొప్పున రూ.1కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. వంద పడకల ఆసుపత్రి ప్రహరీ గోడ, సిఎం కేసీఆర్‌ ‌చదివిన స్కూల్‌ ‌ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ… దళిత బంధు పథకం కొత్తగా రాలేదు. 2021 అసెంబ్లీ బడ్జెట్‌లోనే ప్రవేశ పెట్టామన్నారు. దుబ్బాకలో ఇదే ఆర్థిక సంవత్సరంలో దళిత కుటుంబాలకు కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేస్తామన్నారు. వచ్చే రెండు సంవత్సరాలలో దళిత బంధు పథకం పూర్తి చేస్తామన్నారు. అసంపూర్తిగా ఉన్న పనులన్నీ పూర్తి చేస్తామనీ, దుబ్బాకలో శంఖుస్థాపన చేసిన నూతన బస్టాండ్‌కు మరిన్ని నిధులు అవసరమని దృష్టికి తెచ్చారని, అవసరమైన నిధులు సమకూరుస్తాననీ అన్నారు. రైతులు ఫామాయిల్‌ ‌తోటల సాగుపై దృష్టి పెట్టాలనీ, ఏడాదికి 60వేల కోట్ల రూపాయల ఫామాయిల్‌ ఇతర దేశాల నుంచి దిగుబడి చేసుకుంటున్నామనీ, ఆయిల్‌ ‌ఫామ్‌ ‌తోటలకు అన్ని విధాలా సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి కొత్త పుష్పలత కిషన్‌రెడ్డి, మునిసిపల్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌గన్నె వనిత, జడ్పిటిసి కడతల రవీందర్‌రెడ్డి, టిఆర్‌ఎస్‌ ‌నాయకులు రొట్టె రాజమౌళి, కోమటిరెడ్డి వెంకట్‌నర్సింహారెడ్డి(కేవీఎన్‌ఆర్‌) ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply