Take a fresh look at your lifestyle.

సిగరెట్‌ ‌పొగలో 7000లకు పైగా రసాయనాలు

ఐరాస శాఖ ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 7.9 బిలియన్ల ప్రపంచ జనాభాలో 1.3 బిలియన్ల ప్రజలు పొగాకు దురలవాటుకు బానిసలైనారని తేలింది. పొగాకు దురవాటు కలిగిన జనాభాలో 80 శాతం పొగరాయుళ్లు అల్ప, మధ్యాదాయ దేశాలకు చెందిన వారే ఉండడం గమనించారు. అనాదిగా పొగాకు దురలవాటు ఒక అంటువ్యాధి (ఎపిడెమిక్‌)‌గా తరతరాలకు వారసత్వ సమస్యగా మారుతున్నది. పొగాకు వాడడంతో మిలియన్ల జనులు అనారోగ్యాల ఊబిలో చిక్కుకోవడమే కాకుండా ఏట 8 మిలియన్ల మరణాలు నమోదు అవుతుండడం, వీరిలో నేరుగా వాడే జనులు 7 మిలియన్లు, పరోక్షంగా (పాసివ్‌ ‌స్మోకింగ్‌) ‌ప్రభావితం అయిన వారు 1.2 మిలియన్లు ఉండడం విచారకరం.
పేదరికాన్ని పెంచుతున్న దురలవాటు:
పొగ దురలవాటులేని వారితో పోల్చితే పొగ పీల్చే అలవాటు కలిగిన వారిలో 40 శాతం వరకు టైప్‌-2 ‌మధుమేహ రుగ్మతకు లోనవుతున్నట్లు తేలింది. పేదరికం పెరగడానికి పొగాకు దురలవాటు ప్రధాన కారణం అవుతున్నది. 2015లో చేపట్టిన అధ్యయనం ప్రకారం పొగ అలవాటు ఉన్న ప్రతి 10 మందిలో 07గురు (68 శాతం) పూర్తిగా మానేసినట్లు తేలింది. పొగకు దురలవాటు దుష్ప్రభావాలను గుర్తించిన ఐరాస 2030 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల జాబితాలో కూడా పోగాకు దురలవాటును చేర్చడం జరిగింది. పొగాకు దురలవాటు నిర్మూలనకు 155 సభ్యదేశాలు నిషేధాలు, హెచ్చరికలు, ప్రకటనలు, సెగరెట్ల ధరలు పెంచడం లాంటి పలు కట్టడి చర్యలు తీసుకుంటూనే ఉన్నారు.
పొగాకు దుష్ప్రభావాలు:
పొగ తాగడంతో ప్రధానంగా నోరు, ఊపిరితిత్తులు ప్రభావితం అవుతాయి. సిగరెట్‌ ‌పొగలో ప్రమాదకర నికోటిన్‌, ‌కార్బన్‌ ‌మోనాక్సైడ్‌, ‌తారు, ఫినాల్స్, అమోనియా, ఫార్మాల్డిహైడ్‌, ‌కాన్సర్‌ ‌కారక రసాయనాలు, ప్రమాదకర సూక్ష్మ కణాలు లాంటివి అనేకం ఉంటాయి. పొగ ఊపిరితిత్తులకు చేరి మ్యూకస్‌ ‌కణజాలాన్ని నష్టపరిచి ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. పొగాకులోని నల్లని తారు లాంటి విష పదార్థం ఊపిరి తిత్రులను పాడు చేస్తుంది. పొగలోని కార్బన్‌ ‌మోనాక్సైడ్‌ ‌విషవాయువు రక్తాన్ని ప్రభావితం చేయడంతో ఆక్సీజన్‌ ‌సరఫరాలో అంతరాయం కలిగిస్తుంది. పొగ తాగే వారి రక్తంలో 10 రెట్లు అధికంగా కార్బన్‌ ‌మోనాక్సైడ్‌ ఉం‌డడం గమనించారు. పొగాకు దురలవాటుతో కాన్సర్‌, ‌శ్వాస ఇబ్బందులు, గుండె వ్యాధులు, మధుమేహం, అంటువ్యాధులు, దంత సమస్యలు, వినికిడి సమస్యలు, దృష్టి లోపాలు, కడుపులో పుండ్లు లాంటివి కలుగుతాయి.
శరీరంలోని రక్తం, మూత్రపిండాలు, గొంతు, కాలేయం, క్లోమం, పెద్ద పేగులు, ఊపిరితిత్తులు, నేత్రాలు, నాలుక, దంతాలు, చిగుర్లు, మూత్రాశయం, గర్భాశయం, పురీశనాళం లాంటి పలు అవయవ భాగాలు అనారోగ్యం పాలవుతాయి. పొగ తాగడంతో మానసిక స్థితి, ఊపిరితిత్తులు/నోటి కాన్సర్‌, ‌రక్తనాళాలు కుచించుకుపోవడం, ఆకలి మందగించడం, దగ్గు, కొలెస్టరాల్‌ ‌పెరిగి పోవడం, వ్యాధినిరోధకశక్తి క్షీణించడం, గర్భిణి/శిశువుల అనారోగ్యాలు, యెల్లా ఫివర్‌, ‌చర్మం ముడతలు, గుండె జబ్బులు, వంధత్వం లాంటి తీవ్ర అనారోగ్య లక్షణాలు కలుగుతాయి.
పొగాకు బాధిత భారతం:  భారతదేశవ్యాప్తంగా 138 కోట్ల జనాభాలో 12 కోట్లు ప్రజలు (09 శాతం) పొగాకు దురలవాటు బారిన పడుతూ, పేదరికాన్ని పెంచుకుంటున్నారు. పొగాకును ఔషధంగా, మత్తు మందుగానే కాకుండా వేడుకల్లో కూడా సరదాల కోసం వాడుతున్నారు. పొగాకు ఉత్పత్తుల్లో సిగరెట్‌, ‌బీడి, చుట్ట, జర్ధా, పైప్‌, ‌నోటిలో నమలడం, ముక్కు పొడి లేదా నసెం, పాన్‌ ‌మసాల, పొగరాని సిగరెట్లు, ఈ-సిగరెట్లు, హుక్కా, క్రెటెక్స్ ‌లాంటి పలు రూపాల్లో వాడడం చూస్తున్నాం. సిగరెట్‌ ‌పొగలో నికోటిన్‌తో పాటు 7000లకు పైగా రసాయనాలు, అందులో అనేక ప్రమాదకరమైనవి ఉన్నట్లు గమనించారు. పొగాకులో నికోటిన్‌ అనబడే ప్రమాదకర దురలవాటు కలిగించే విష రసాయనం ఉంటుంది. భారత ప్రభుత్వం బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, విద్యాలయాలు, వైద్యశాలలు లాంటి పలు ప్రదేశాల్లో పొగ తాగడాన్ని నిషేధించింది. ధూమపానం ప్రాణాపాయమని, పేదరికాన్ని పెంచే దురలవాటని గమనించి పొగాకు వినియోగానికి చరమగీతం పాడుదాం, దేశాభివృద్ధిలో పాలుపంచుకుందాం.

image.png

  డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
 కరీంనగర్‌ – 9949700037

Leave a Reply