Take a fresh look at your lifestyle.

పోతిరెడ్డిపాడులో ఉల్లంఘనలు లేవు

  • కేటియించిన నీటినే సీమకు తరలిస్తున్నాం
  • ఎపి జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌

అమరావతి,మే 18: ఎపికి కేటాయించిన జలాలను మాత్రమే వాడుకునేలా పోతిరెడ్డిపాడును విస్తరిస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌ అన్నారు. ఎక్కడా ఎపి సర్కార్‌ ఉల్లంఘనలకు పాల్పడలేదన్నారు. దీనిపై కొందరు అనవసర వివాదం లేవనెత్తడం సరికాదన్నారు. తమకు కేటాయించిన నీటినే వాడుకుంటామని అన్నారు. ఇందులో ఎలాంటి ఉల్లంఘనలు లేవన్నారు. కర్ణాటక సర్కార్‌ ఆల్మట్టి డ్యాం ఎత్తును 519.6 టర్ల నుంచి 524.256 టర్లకు పెంచడంవల్ల అదనంగా 130 టీఎంసీలను నిల్వ చేసుకోగలుగుతుంది. దీనివల్ల కృష్ణా వరద ప్రవాహం జూరాలకు ఆలస్యంగా చేరుతుంది. వరద ప్రవాహం శ్రీశైలానికి చేరక ముందే జూరాల ప్రాజెక్టు కాలువ, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, ‌భీమా ఎత్తిపోతల ద్వారా తెలంగాణ సర్కార్‌ ‌నీటిని తరలిస్తుంది. రుతుపవనాల గమనంలో వచ్చిన మార్పుల వల్ల నదీ పరీవాహక ప్రాంతంలో వర్షపాతం ఏకరీతిగా కురవకపోవడం వల్ల కృష్ణా నదికి వరద రోజులు తగ్గాయి. వరద వచ్చిన రోజుల్లో గరిష్ఠంగా ఉంటోందని అభిప్రాయపడ్డారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల తాగు, సాగునీటి ఇబ్బందులను అధిగమించడం కోసం ఏపీ సర్కార్‌ ‌కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ తెలంగాణ ప్రభుత్వం బోర్డుకు లేఖ రాసింది. తెలంగాణ సర్కార్‌ ‌లేవనెత్తిన అనుమానాలను నివృత్తి చేసేలా కృష్ణా బోర్డుకు నివేదిక ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. కృష్ణా నదీ జలాల్లో ఉమ్మడి రాష్టాన్రికి కేటాయించిన 811 టీఎంసీల్లో ఆంధప్రదేశ్‌ ‌వాటా 512.. తెలంగాణ రాష్ట్ర వాటా 299 టీఎంసీలు..మా రాష్ట్రానికి హక్కుగా ఉన్న జలాలను వాడుకుంటే తప్పేంటని మంత్రి అనిల్‌ అన్నారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఇదే వివరిస్తామని అన్నారు. శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు. జలాశయంలో 881 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్‌ ‌రెగ్యులేటర్‌ ‌ప్రస్తుత పూర్తిసామర్థ్యం మేరకు 44వేల క్యూసెక్కులను శ్రీశైలం కుడిగట్టు కాలువ ,తెలుగుగంగ ప్రాజెక్టు, గాలేరు-నగరి సుజల స్రవంతి పథకంనకు తరలించవచ్చు.

కృష్ణా నదికి వరద రోజులు తగ్గిన నేపథ్యంలో శ్రీశైలంలో 881 అడుగుల స్థాయి లో నీటి మట్టం ఏడాదికి పది రోజులకు మించి ఉండదు. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 854 అడుగులు ఉంటే పోతిరెడ్డిపాడు హెడ్‌ ‌రెగ్యులేటర్‌ ‌ద్వారా కాలువలోకి ఏడు వేల క్యూసెక్కులు మాత్రమే చేరతాయి. నీటి మట్టం 841 అడుగులకు చేరితే పీహెచ్‌పీ ద్వారా చుక్క నీరు కూడా కాలువకు చేరదు. కానీ, శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 834 అడుగుల నుంచే ఎడమగట్టు కేంద్రం నుంచి తెలంగాణ సర్కార్‌ ‌విద్యుదుత్పత్తి చేపడుతోంది. కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల ద్వారా 800 అడుగుల నుంచి.. ఎస్సెల్బీసీ ద్వారా 824 అడుగుల నుంచే తెలంగాణ సర్కార్‌ ‌నీటిని తరలిస్తోంది. పర్యవసానంగా జలాశయంలో నీటి మట్టం రోజురోజుకూ తగ్గిపోతుంది. తెలంగాణ 800 అడుగుల నుంచి నీటిని తరలిస్తున్న నేపథ్యంలో.. రాయలసీమ, నెల్లూరు జిల్లాలో తాగు, సాగునీటి ఇబ్బందులను అధిగమించడానికే శ్రీశైలం జలాశయంలో 800 అడుగులనుంచి పీహెచ్‌పీకి దిగువన ఎస్సార్బీసీలోకి రోజుకు మూడు టీఎంసీలను ఎత్తిపోసే సామర్థ్యంతో ఎత్తిపోతల పథకాన్ని తాము చేపడితే తప్పేంటని బోర్డుకు వివరించాలని నిర్ణయించామన్నారు. కృష్ణా బోర్డు కేటాయించిన నీటిని మాత్రమే ఈ ఎత్తిపోతల ద్వారా తరలిస్తామని..అంతకంటే చుక్క నీటిని కూడా తరలించబోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్‌, ‌పులిచింతల ప్రాజెక్టులు నిండగా.. కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేస్తూనే ప్రకాశం బ్యారేజీ ద్వారా 801 టీఎంసీలను సముద్రంలోకి విడుదల చేశారు. కృష్ణా నదికి నాలుగేళ్లలో ఒకసారి ఈ స్థాయిలో వరద వస్తుంది. శ్రీశైలంలో నీటి మట్టం 881 అడుగుల స్థాయిలో ఉన్నప్పుడు పీహెచ్‌పీ ద్వారా ప్రస్తుత డిజైన్‌ ‌మేరకు 44 వేల క్యూసెక్కులే రాయల సీమ, నెల్లూరు జిల్లాలకు తరలించ వచ్చు. కానీ.. ఆ స్థాయిలో నీటి మట్టం ఏడాదికి పది రోజులు కూడా ఉండే అవకా శంలేదు. జలాశయంలో గరిష్ఠ స్థాయిలో నీటి మట్టం ఉన్న ప్పుడు.. సముద్రంలో కలిసే ఆ వరద జలాలను ఒడిసి పట్టి.. దుర్భిక్ష రాయలసీమలో బంజరు భూములకు మళ్లించడానికే పీహెచ్‌పీ దిగువన కాలువల సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచే పనులు చేపట్టాలని నిర్ణయించామని మంత్రి అన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!