Take a fresh look at your lifestyle.

ఎన్నికలను ఆపడానికి కారణాలు లేవు

  • హైకోర్టు కూడా అలాంటి ఆదేశాలు ఇవ్వలేదు
  • రాజకీయ పార్టీలతో ఎస్‌ఇసి నీలం సాహ్ని సమిక్ష
  • కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్
  • అఖిలపక్షానికి టిడిపి,బిజెపి, జనసేన డుమ్మా

ఎపిలో నిలిచిపోయిన ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు కొత్తగా ఎస్‌ఇసిగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని ఆ మేరకు పావులు కదుపుతున్నారు. రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ నీలం సాహ్ని శుక్రవారం సమావేశం నిర్వహించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో పార్టీల సహకారంపై చర్చించారు. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతల అభిప్రాయాలను ఎస్‌ఈసీ తీసుకున్నారు. ఎన్నికల నిబంధనలు, ప్రచార నిబంధనలపై పార్టీలకు సూచనలిచ్చారు. సమావేశానికి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, పీసీసీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌మస్తాన్‌వలీ, సీపీఎం నేత వైవీరావు హాజరయ్యారు.

సమావేశానికి టీడీపీ, బీజేపీ, జనసేన హాజరుకాలేదు. సమావేశం అనంతరం ఎస్‌ఈసీ నీలం సాహ్ని మిడియాతో మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణపై గురువారం నోటిఫికేషన్‌ ‌జారీ చేశామన్నారు. నేడు నిర్వహించిన సమావేశంలో పార్టీల నేతల అభిప్రాయాలు తెలుసుకున్నామన్నారు. కోవిడ్‌ ‌వ్యాక్సినేషన్‌ ఉన్నందున ఎన్నికలు త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం కోరిందని తెలిపారు. గతేడాది మార్చిలో నిలిచిపోయిన దగ్గర నుంచి ఎన్నికల పక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ నెల 8న పోలింగ్‌, 9‌న రిజర్వ్‌డే, 10న కౌంటింగ్‌ ‌నిర్వహిస్తామని ఎస్‌ఈసీ వెల్లడించారు. గురువారం నుంచి ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందన్నారు. ఎన్నికల పక్రియ ఇప్పటికే మధ్యలో ఉందని.. గతంలోనే అభ్యర్థుల జాబితా పూర్తయ్యిందని పేర్కొన్నారు.

ఎన్నికలు ఆపేందుకు కారణాలు కనిపించలేదన్నారు. కోర్టుల నుంచి ఎన్నికల షెడ్యూల్‌ ‌విడుదల చేయకూడదని ఎక్కడా అభ్యంతరాలు లేవని తెలిపారు. ఫిర్యాదుల స్వీకరణకు ఎస్‌ఈసీ కార్యాలయంలో ప్రత్యేక కాల్‌ ‌సెంటర్‌ ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నిర్వహణకు సహకరించాలని పార్టీలను కోరామని ఎస్‌ఈసీ పేర్కొన్నారు. ఎన్నికలు ఆలస్యమైతే వ్యాక్సినేషన్‌పై ప్రభావం పడుతుందని ఎస్‌ఈసీ నీలం సాహ్ని తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, పరిషత్‌ ఎన్నికల నిర్వహణకు సహకరిస్తామని ఎస్‌ఈసీకి చెప్పామని తెలిపారు. టీడీపీ, బీజేపీ, జనసేన హాజరుకాకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రతిపక్షానికి కావాల్సిన వ్యక్తి పదవిలో లేనప్పుడు సమావేశానికి హాజరుకారా? అని ఆయన ప్రశ్నించారు. సమావేశాన్ని బహిష్కరిం చాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగబోతున్నాయి. తమకు ఎన్నికలు ముఖ్యం కాదు.. ప్రజలే ముఖ్యమని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు.

అఖిలపక్ష సమావేశంలో పాల్గొని అభిప్రాయాలు తెలిపామని సీపీఎం నేత వైవీ రావు వెల్లడించారు. సమావేశానంతరం ఆయన మిడియాతో మాట్లాడుతూ.. అక్రమాలు జరిగిన చోట ఎన్నికలు ఆపాలని గతంలో ఎస్‌ఈసీని కోరామన్నారు. నిష్పక్ష పాతంగా, అక్రమాలు లేకుండా ఎన్నికలు జరపాలని కోరామన్నారు. ఎన్నికలు సజావుగా జరగాలంటే ఆచరణ చాలా ముఖ్యమని చెప్పామన్నారు. ప్రజల్లో నమ్మకం, విశ్వాసం పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరామని వైవీ రావు పేర్కొన్నారు. ఇదిలావుంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై పంచాయతీ రాజ్‌ ‌కమిషనర్‌ ‌గిరిజాశంకర్‌ ‌సమిక్ష నిర్వహించారు. అన్ని జెడ్పీ సీఈఓలు, డీపీఓలు, జిల్లా ప్రత్యేక అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ‌ద్వారా మాట్లాడారు.

ఎన్నికల నిర్వహణపై మార్గదర్శకాలను వివరించారు. మరోవైపు ఎన్నికల పరిశీలకులతో ఎస్‌ఈసీ నీలంసాహ్ని వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. ప్రతి జిల్లాకు ఇద్దరు పరిశీలకులను నియమించారు. ఎన్నికల వ్యయ పరిశీలకులుగా ఐఎఫ్‌ఎస్‌ అధికారి, నిర్వహణ పరిశీలకులుగా ఐఏఎస్‌ అధికారి బాధ్యతలు నిర్వహిస్తారు. ఎన్నికల కోడ్‌ ‌నిర్వహణపై ఎస్‌ఈసీ నీలంసాహ్ని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమన్వయం చేసుకోవాలని ఎన్నికల పరిశీలకులకు ఎస్‌ఈసీ నీలంసాహ్ని సూచించారు.

Leave a Reply