Take a fresh look at your lifestyle.

మానవత్వమున్న మనుషులూ ఉన్నారు..

ఎవరికి వారే అన్నట్లున్న నేటి సమాజం గూర్చి డాక్టర్‌ అం‌దెశ్రీ వ్రాసిన మాయమవుతున్నాడు మనిషన్నవాడన్న పాట నిన్నటి వరకు అక్షరాల నిజమనిపించింది. కాని, ఇంకా మనష్యుల్లో మానవత్వం దాగి ఉందన్న విషయం ఇటీవల కొరోనా కారణంగా కనిపిస్తున్నది. కొరోనా వైరస్‌కు నిరుపేద, ధనికులన్న భేదమేమీ లేదు. మంచివాడు, చెడ్డవాడన్న తారతమ్యమూ లేదు. ఒకసారి ఆ వైరస్‌ ‌సోకిందంటే  అటోఇటో తెలియని పరిస్థితి. దేశ వ్యాప్తంగా రోజూ వేల సంఖ్యల్లో పిట్టల్లా రాలుతున్నారు. నిన్నటివరకు మనతో మాట్లాడుతున్న వారు నేడు కనిపించకుండా పోతున్నారు. ఇల్లు, వళ్ళు గుల్ల చేసుకుని లక్షలాది రూపాయలు వెచ్చించినా చివరాకరుకు వైరస్‌ ‌పేషంటు బతికొచ్చేది అపనమ్మకమే. కాస్తోకూస్తో ఉన్నవాడైతే ఈ ఖర్చులను ఏదో విధంగా తట్టుకోగలడు. రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేదల పరిస్థితే మరీ అధ్వాన్నం . సగం కాలే కడుపుతో జీవనం సాగిస్తున్నవారికి పొరపాటున ఈ వైరస్‌ ‌సోకితే ఇక వారిని  ఆ దేవుడు కూడా ఆదుకోలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే పట్టెడన్నం దొరకని పరిస్థితిలో కొరోనా బాధితులయితే  వారిని పట్టించుకునే వారుండరు.

ఒకరినుండి ఒకరికి మొత్తం కుటుంబానికి కొరోనా అంటుకుంటే ఒకపూట తిండికూడా తినలేని పరిస్థితి. అందులో వారికి ఈ సమయంలో బలమైన ఆహారం లభించడంకూడా అసాధ్యం. హోం ఐసోలేషన్‌లో ఉండే ఇలాంటివారిని ఆదుకునేందుకు అనేక అపన్న హస్తాలు ముందుకు వస్తున్నాయంటే ఇంకా మనుషుల్లో  మానవత్వం దాగి ఉందనే అనుకోవాలి. క్వారంటెన్‌లో ఉన్నవాళ్ళు ఎవరైనా, ఒకే ఇంట్లో ఎంతమందిఉన్నా వారందరికి తమకున్నదానిలో ఉచితంగా భోజనం అందిస్తున్నారు కొందరు. తమ కుటుంబ సభ్యుల సహకారంతో ప్రతీరోజు మనిషికి సరిపడ ఫుడ్‌ ‌ప్యాకట్లు తయారుచేసి క్వారంటెయిన్‌లో ఉన్న వ్యక్తుల ఇండ్లకు వెళ్ళి అందిస్తున్నారు  మరికొందరు.  50 నుండి  వంద మందివరకైనా కొందరు స్వయంగా వంటచేసి అందిస్తుండగా, మరికొందరు తమ శక్తిమేరకు పది ఇరవై మందికి అందించి వారి ఆకలి తీరుస్తున్నారు. కుటుంబ సభ్యులంతా కొరోనాతో బాధపడుతున్న క్రమంలో కనీసం వంట చేసుకోవడానికి కూడా వీలులేని పరిస్థితి ఉన్నవారెవరైనా ఉంటే వారికి ఫుడ్‌ ‌ప్యాకెట్లు అందించేందుకు ఇంకొన్ని స్వచ్చంద సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే ఇలాంటి సంస్థలు పది నుండి పదిహేను వరకున్నాయి. మాన్య మిత్ర, ఆలేఖ్య, గుడ్ల దక్షిణామూర్తి ట్రస్టు, ఊర్వశి కపూర్‌, అనంత, అస్వ ఫౌండేషన్‌, ‌నిహారిక, ఫ్రీడం ఫర్‌ ‌కోవిద్‌ ‌పేషంట్స్ ఇలా అనేక సంస్థల ద్వారా కొరోనా బాదితులకు ఉచితంగా భోజనం అందజేస్తున్నారు. అయితే కొందరు ఒక పూట అందజేస్తుంటే, మరి కొందరు రెండు పూటల వారికి సరిపడా అహారాన్ని అందిస్తున్నవారున్నారు.

హైదరాబాద్‌ ‌కూకట్‌ ‌పల్లిలో గత 25 ఏండ్లుగా ఆకలి అన్నవారికి అన్నంపెడుతూ వస్తున్న  యోగా విజ్ఞానకేంద్రం ఇప్పుడు కొరోనా బాధితులకు అన్నపూర్ణగా మారింది. ఒక్క ఫోన్‌ ‌కాల్‌తో ఎంతమంది కొరోనా బాధితులకైనా ఆహారాన్ని అందిస్తోంది ఆ కేంద్రం. అయితే కేంద్రం సమీపంలో ఉన్నవారికి మాత్రమే స్వయంగా ఆహారాన్ని అందిస్తుండగా దూర ప్రాంతంలో ఉన్నవారు తమ తరఫున ఎవరినైనా పంపిస్తే వారికి ఆహారాన్ని ఇచ్చి పంపించే ఏర్పాట్లు చేశారు. హ్యుమానిటీ ఫౌండేషన్‌ ‌కూడా ఉచిత భోజనంతో పాటు మాస్క్  ‌లనుకూడా అందజేస్తోంది. అల్వాల్‌ ఇం‌దిరానగరల్‌లో బిజెవైఎం అధ్వర్యంలో బలమైన ఆహారం కోసం ఎవరు సంప్రదించినా వారి ఇంటికి వెళ్ళి ఆహారాన్ని అందిస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు, విశాఖ, విజయవాడ, గుంటూరు లాంటి పట్టణాల్లో  నారీ సేవ గ్లోబల్‌ ఉమెన్‌ ‌ఫోరం అధ్వర్యంలో మహిళలు  వందలాది మంది కోవిద్‌ ‌పేషంట్లకు ఉచిత ఆహారాన్ని అందిస్తున్నారు.  తాజాగా పోలీసు శాఖకూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతానికైతే సిటీ వరకు తమ సేవలను అందించే ఏర్పాట్లు చేసిన పోలీసు బృందం, త్వరలో తెలంగాణ వ్యాప్తంగా వైరస్‌ ‌సోకి ఐసోలేషన్‌లో ఉండి, ఆహారం స్వయంగా తయారు చేసుకోలేకపోతున్న వారెవరికైనా, ఎంతమందికైనా ఒకే ఒక్క ఫోన్‌కాల్‌తో అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. సేవా ఆహార్‌ ‌పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమానికి సత్యసాయి సేవా సంస్థ,  హోప్‌ ‌స్వచ్చంద సంస్థలు సహకారాన్ని అందజేస్తున్నాయి.

ప్రముఖ ఫుడ్‌ ‌డిస్ట్రిబ్యూటరీ సంస్థలు స్విగ్టీ, బిగ్‌ ‌బాస్కెట్‌ ‌లాంటి వాటి సహకారంతో కావాల్సిన వారి ఇంటికి ఫుడ్‌ను చేర్చేందుకు పోలీసులు రంగం సిద్ధం  చేశారు.  ఒక్క హైదరాబాద్‌ ‌సిటీలో కాకుండా రాష్ట్రంలోని వివిధ నగరాల్లో  ఉద్భవిస్తున్న అన్నపూర్ణలు అనేకులున్నాయి. కొన్నిచోట్ల ఫుడ్‌ ‌బ్యాంకును ఏర్పాటు చేసి  ఆహారాన్ని సేకరిస్తుండగా,  మరికొందరు కొరోనా వ్యాధిగ్రస్తులకు కావాల్సిన మాస్క్‌లు, మందులు, ప్లాస్మా తదితర విషయాల్లో తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందినవారైనా, రక్త సంబంధీకులైనా కొరోనాతో చనిపోతే కనీసం శవాన్ని తీసుకెళ్ళేందుకుకూడా ఇష్టపడని పరిస్థితిలో అనాథగా మారకుండా వారికి దహన సంస్కారాలు చేసేందుకు మరి కొన్ని సంస్థలు, మానవత్వం ఉన్న మనుషులు ముందుకు వస్తున్నారు.

Leave a Reply