Take a fresh look at your lifestyle.

మనదేశంలో రుద్రమదేవిలు ఎంతో మంది ఉన్నారు

There are a lot of Rudramadevi's in our country

మహిళ శక్తి స్వరూపిణి అని మన ప్రాచీన గ్రంథాలు ఉద్బోధిస్తున్నాయి. పురాణాల్లో ఆదిపరాశక్తి మొదలు సత్యభామవరకూ మహిళలు పురుషుల కన్నా ఎక్కువ ధీరత్వాన్ని ప్రదర్శించారు.శుంభు,నిశుంభులు, నరకాసురుడు వంటి రాక్షసులను అంతమొందించింది మహిళలే. స్వాతంత్య్రసమరంలో ఝాన్సీలక్ష్మీబాయ్‌, ‌రుద్రమదేవి,తెలంగాణ పోరాటంలో చాకలిఅయిలమ్మ వంటి ఎంతో మంది మహిళామణులు పురుషులతో సమానంగా,ఆ మాటకొస్తే పురుషుల కన్నా ఎక్కువగా శౌర్యాన్ని ప్రదర్శించారు. ఆధునికయుగంలో కూడా మహిళలు తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని పురుషుల కన్నా తాము ఎంతమాత్రం తక్కువ కాదని నిరూపిస్తున్నారు.మహిళల శారీరక దుర్బలత్వాన్ని కారణంగా చూపి సైన్యంలో కమాండర్‌ ‌పదవులకు వారిని నిషేధించడం తగదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రానున్న కాలంలో ఎన్నో ముఖ్యపరిణామాలకు దారి తీయవచ్చు.ఇప్పటికే మహిళలు తమ శక్తిసామర్థ్యాలను నిరూపించుకుంటూ పురుషులతో సమానంగా ఉద్యోగాలనూ,హోదాలను నిర్వహిస్తున్నారు. మహిళలకు పురుషులతో సమానంగా అన్ని బాధ్యతలను అప్పగించాలని తొమ్మిదేళ్ళ క్రితం ఢిల్లీహైకోర్టు ఆదేశించింది.దానిని అమలు చేయనందుకు ప్రభుత్వాలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ప్రస్తుత ఎన్‌డిఏ ప్రభుత్వమే కాదు,పూర్వపు యూపీఏ ప్రభుత్వం కూడా ఇలాంటి విషయాలలో చొరవ తీసుకోలేదు.అయితే,దేశచరిత్రలో తొలిసారిగా రాష్ట్రపతిపదవికి ఒక మహిళను ఎంపిక చేసిన ఘనత యూపీఏకూటమి ప్రభు త్వానిదే.కొన్నిరాష్ట్రాల కేబినెట్‌ ‌లలో అసలు మహిళలు ఉండటం లేదు.ఉదాహరణకు తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి మంత్రివర్గంలో మహిళామంత్రి లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత సబితాఇంద్రారెడ్డిని మంత్రిగా నియమించారు.

ఆమె కూడా కాంగ్రెస్‌ ‌టికెట్‌ ‌పై ఎన్నికై తెరాసలోకి పార్టీ ఫిరాయించిన తర్వాత మంత్రి పదవి దక్కింది. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ అన్ని పార్టీల నాయకులు ఎన్నికల ముందు హామీలు గుప్పిస్తుంటారు.అధికారంలోకి రాగానే ఆ విషయాన్ని విస్మరిస్తుంటారు. సైన్యంలో కమాండర్‌ ‌పదవికి మహిళలను ఎంపిక చేయడానికి అభ్యంతరం ఉండరాదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అన్ని పార్టీల వారికీ కనువిప్పు. మహిళలకు కీలక బాధ్యతలు అప్పజెప్పడానికి సైన్యం వెనుకడుగు వేస్తున్నా,ఆ ధోరణిని మార్చాల్సిన ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.సైన్యంలోకి తమను అనుమతించాలని స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి మహిళలు డిమాండు చేస్తూనే వున్నారు.1950లో వచ్చిన సైనికచట్టంలో మహిళల సేవలను పరిమితంగా వినియోగించుకోవచ్చని స్పష్టం చేసినా అది సాకారం కావడానికి నాలుగు దశాబ్దాలు పైన పట్టింది. అది కూడా కాంట్రాక్టు పద్ధతి నియామకాల్లోనే. శాశ్వతప్రాతిపదికపై మహిళలను నియమించాల్సి వచ్చేసరికి కేంద్రం వెనుకకు తగ్గింది.దాంతో మహిళసైనికోద్యోగులు ఢిల్లీహైకోర్టును ఆశ్రయించగా వారికి అనుకూలంగా ఢిల్లీహైకోర్టు తీర్పు ఇచ్చింది. దానిని సవాల్‌ ‌చేస్తూ కేంద్రం సుప్రీంకోర్టుకు వెళ్లడంతో తాజాగా సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. రాష్ట్ర పోలీసుశాఖలో మహిళలు ఎంతో చాకచక్యంగా, నేర్పు,ఓర్పులతో పని చేస్తున్నారు.హైదరాబాద్‌లో మహిళా ఉద్యోగినులపై దాడులను అరికట్టేందుకు రాష్డ్రప్రభుత్వం ఏర్పాటు చేసిన షీటీమ్స్ ‌బాగా పనిచేస్తున్నాయని ఇతర రాష్ట్రాలవారు కూడా ప్రశంసిస్తున్నారు.

సమానత్వానికి పూచీపడుతున్న రాజ్యాంగంలోని 14వ అధికరణకు భిన్నంగా వ్యవహరించడం తగదని తాజా తీర్పు ప్రభుత్వానికి స్పష్టం చేసింది.సైన్యంలో వున్నవారు ఎవరైనా తగిన శక్తిసామర్థ్యాలు కలిగివున్నారో లేదో, లక్ష్యాలను పరిపూర్తి చేయగలుగుతున్నారో లేదో చూడాలి.ఈ అంశాల్లో మహిళల పనితీరు సంతృప్తి కరంగా లేదనుకుంటే ఆ సమాచారాన్ని న్యాయస్థానం ముందుంచాలి. కానీ సైన్యం, ప్రభుత్వం చేసింది అది కాదు. కార్గిల్‌ ‌యుద్ధ సమయంలో పాకిస్థాన్‌ ‌సైన్యం దాడులకు దిగినప్పుడు మహిళా సైనికులు ఎక్కడా వెరు వలేదు. తక్షణ స్పందనలో పురుష సైనికులకు వారెక్కడా తీసిపోలేదు.సుశిక్షిత సైనికులు తమకు ఆదేశాలిచ్చే అధికా రిలో తగిన శక్తిసామర్థ్యాలున్నాయా లేదా,చిత్తశుద్ధి ఉందా లేదా అని చూస్తారు తప్ప ఆడా మగా అని చూడరు. పోలీసుశాఖలో పనిచేస్తున్న మహిళా అధికారులే ఇందుకు నిదర్శనం.
– ‘ప్రజాతంత్ర’ ఇంటర్నెట్‌ ‌డెస్క్

Leave A Reply

Your email address will not be published.