Take a fresh look at your lifestyle.

విద్యార్థులు, అడ్వకేట్లు, జర్నలిస్టులతో తమది పేగుబంధం

  • బిజెపిది వాట్సాప్‌ ‌యూనివర్సిటీ అని ఎద్దేవా
  • తెలంగాణ వికాస సమితి సదస్సులో మంత్రి కెటిఆర్‌

తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పడు టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి మనీ పవర్‌ ‌లేదు.. మజిల్‌ ‌పవర్‌ ‌లేదు.. మీడియా పవర్‌ ‌లేదు.. మూడు ప్రబలమైన రాజకీయ శక్తులను ఎదుర్కొని కేసీఆర్‌ ‌ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. తెలంగాణ తేకుంటే రాళ్లతో కొట్టమని అన్న దమ్మున్న లీడర్‌ ‌కెసిఆర్‌ అని ఆన్న విషయాన్ని గుర్తు చేశారు. విద్యార్థుల పోరాటాల గురించి ఎంత చెప్పినా తక్కువే అని కేటీఆర్‌ అన్నారు. విద్యార్థి నాయకులతో పాటు మిగతా వారందరూ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. విద్యార్థులతో తమకున్నది మామూలు అనుబంధం, రాజకీయ సంబంధం కాదు.. విద్యార్థులు, అడ్వకేట్లు, జర్నలిస్టు మిత్రులతో తమది పేగుబంధం అని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి అండగా నిలబడింది విద్యార్థులు, జర్నలిస్టులే అని కేటీఆర్‌ ‌తెలిపారు. బేగంపేట్‌ ‌హరిత ప్లాజాలో తెలంగాణ జీవితం – సామరస్య విలువలపై తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు.

ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ‌హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్‌, ‌రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్‌ శ్రీ‌ధర్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ‌మాట్లాడుతూ.. గత పదిరోజులుగా ఉద్యమ సహచరులను కలుస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఏప్రిల్‌ 27 ‌నాటికి టీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు అవుతోంది అని తెలిపారు. 1999 -2000 కాలంలో కేసీఆర్‌ ‌పెద్ద ఇమేజ్‌ ఉన్న నాయకుడు కాదు. అప్పుడు ఆయన వయసు 45 ఏండ్లు. సరిగ్గా ఇప్పుడు ఆ వయసు నాది. నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్‌ ‌నడుం బిగించారు. చెన్నారెడ్డి లాంటి వారే అనుకున్నది సాధించలేదు అని ఎందరో నిరుత్సాహ పరిచారు. అప్పుడు కొద్ది మంది మాత్రమే కేసీఆర్‌ ‌వెంట నడిచారు. కేసీఆర్‌ ‌మాటల్లో మేధోసంపత్తి బాగా ఉంటుంది. నాడు కేసీఆర్‌కు అంగబలం లేదు.. అర్థబలం లేదు.. కానీ ఆయన తన మేధోసంపత్తితోనే తెలంగాణను సాధించారు. మనీ పవర్‌ ‌లేదు. మజిల్‌ ‌పవర్‌ ‌లేదు. మీడియా పవర్‌ ‌లేదు. అయినప్పటికీ ముందుకు సాగి తెలంగాణ సాధించారు. జయశంకర్‌ ‌సార్‌ ‌లాంటి బుద్ధిజీవులు తెలంగాణ రాష్ట్ర కాంక్షను సజీవంగా ఉంచారు. ప్రజల్లో ఒక విశ్వాసం నింపడానికి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మూడు పదవులను వదిలేశారు.

తెలంగాణ ఉద్యమం నుంచి పక్కకు జరిగితే రాళ్లతో కొట్టి చంపండి అని కేసీఆర్‌ ‌చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఆనాడు పదవులను త్యాగం చేసి తెలంగాణ ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. కేసీఆర్‌ ‌దీక్షతో కేంద్రం దిగి వచ్చి తెలంగాణను ప్రకటించింది అని గుర్తు చేశారు. మూడు ప్రబలమైన రాజకీయ శక్తులను ఎదుర్కొని కేసీఆర్‌ ‌ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోగలిగారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వివాదాలకు పోకుండా అభివృద్ధిపై దృష్టి సారించామన్నారు. తెలంగాణ కంటే ముందు ఏర్పడిన మూడు రాష్ట్రాలు ఇంకా సెటిల్‌ ‌కాలేదు. ఇప్పుడిప్పుడే ఆ రాష్ట్రాలు కుదుటపడుతున్నాయి. విభజన చట్టంలో సమస్యలు ఉన్నప్పటికీ మనం ఆరున్నరేళ్ల సమయంలోనే ఎంతో ప్రగతి సాధించామని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలకు ఉపాధ్యాయుల మీద ప్రేమ పొంగిపొర్లుతోందన్నారు. కాంగ్రెస్‌, ‌బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చిన ఘనత ఉంటే చెప్పాలని కోరుతున్నాను అని కేటీఆర్‌ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ తమ అర్హతలకు అనుగుణంగా ప్రమోషన్లు కల్పిస్తున్నామని చెప్పారు.

- Advertisement -

30 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు జనవరిలో ప్రమోషన్లు ఇచ్చామన్నారు. కడుపునిండా పీఆర్సీ ఇస్తామని కేసీఆర్‌ ‌చెప్పింది వాస్తవం కాదా? అని అన్నారు. 2016లో కేంద్రం ఇచ్చిన పీఆర్సీ కేవలం 14 శాతం మాత్రమే అని స్పష్టం చేశారు. 14 శాతం పీఆర్సీ ఇచ్చినోడు వచ్చి 43 శాతం పీఆర్సీ ఇచ్చిన వారిని ప్రశ్నించే ముందు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయవాదులకు ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా అండగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌.. 100 ‌కోట్ల సంక్షేమ నిధి ఏర్పాటు చేశారు. జర్నలిస్టు మిత్రుల కోసం కూడా రూ. 100 కోట్ల సంక్షేమ నిధి ఏర్పాటు చేశామన్నారు. గుజరాత్‌లో 1000 మంది అక్రిడెట్‌ ‌జర్నలిస్టులు, తమిళనాడులో 2500 మంది ఉంటే తెలంగాణలో 19 వేల మంది అక్రిడెట్‌ ‌జర్నలిస్టులు ఉన్నారు. జర్నలిస్టుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది. ఇలాంటి పరిస్థితి బీజేపీ, కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాల్లో ఉందా? అని ప్రశ్నించారు. బీజేపీలో పని చేసే విద్యార్థులు రాష్ట్ర యూనివర్సిటీలలో చదువుతలేరు.. వారంతా వాట్సాప్‌ ‌యూనివర్సిటీలలో చదువుతున్నారని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.

అన్ని యూనివర్సిటీలకు వీసీలను నియమించాం. రాజకీయాలకు తావు లేకుండా ఉన్నత విద్యావంతులను వీసీలుగా నియమించి నిజాయితీ చాటుకున్నాం. హెచ్‌సీయూ వీసీ నియామకంలో రాజకీయం చేసింది బీజేపీ కాదా? అని ప్రశ్నించారు. బీజేపీ రాజకీయాల వల్ల రోహిత్‌ ‌వేముల ఆత్మహత్య చేసుకున్నాడు అని తెలిపారు. విద్యా రంగానికి సీఎం కేసీఆర్‌ అం‌డగా నిలబడ్డారు. అంగన్‌వాడీ పిల్లలకు బాలామృతం వంటి పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సన్నబియ్యంతో పెడుతున్నామని చెప్పారు. గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తు న్నామని తెలిపారు. గురుకుల విద్యార్థులు నీట్‌, ఐఐటీ, ఐఐఎంలో సీట్లు సాధిస్తున్నారు. ఇదంతా టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం వల్లే సాధ్యమైందని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు.

నేడు తెలంగాణ ఒక చారిత్రక సందర్భంలో ఉందని ప్రముఖ గాయకుడు దేశపతి శ్రీనివాస్‌ ‌పేర్కొన్నారు. విద్వేషాలతో కూడిన సమాజం పతనం వైపు పయనిస్తోందన్నారు. అస్సయిదుల హారతిని ఆరనియ్యొద్దన్నారు. సామాజిక ఐక్యతలోకి చెద పురుగులను రానియ్యవద్దన్నారు. నెత్తురు పారిన నేలపై నీరు పారాలన్నారు. ’అమిత్‌ ‌షా ప్రాంతీయ పార్టీలు దేశానికి చేటూ అంటున్నారు.. ప్రాంతీయ పార్టీ లేకుంటే తెలంగాణ వచ్చేదా? కాళేశ్వరం నిర్మాణం జరిగేదా? ప్రాంతీయ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర చేస్తున్నారు. తెలంగాణ సమాజం దాన్ని సహించదని దేశపతి శ్రీనివాస్‌ ‌పేర్కొన్నారు.

Leave a Reply