Take a fresh look at your lifestyle.

చంద్రబాబు వలలో పడిన వైసీపీ

ఆంధ్రప్రదేశ్‌ ‌శాసనమండలిలో బుధవారం సంభవించిన పరిణామాలు ప్రజాస్వామ్యానికి తలవంపులు తెచ్చేవిగా ఉన్నాయి. పార్లమెంటరీ చరిత్రలో బడ్జెట్‌ ‌ను ఆమోదించకుండా శాసనమండలి సమావేశాలు వాయిదా పడటం ఇదే మొదటి సారి. ఇందుకు ఇరువర్గాలదీ బాధ్యత ఉంది. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీలో అనుభవం గల నాయకులు ఉన్నా వారిని యువతరం పక్కకు తప్పించి తెలుగుదేశం సభ్యులపై దూషణలకు దిగడం వల్ల పరిస్థితిని ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వాటంగా ఉపయోగించుకున్నారు.ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమయ్యేట్టు ఆయన వైసీపీ సభ్యులను బాగా రెచ్చగొట్టారు. బడ్జెట్‌ ఆమోదం కోసం ఏర్పాటు చేసిన సమావేశాల్లో సిఆర్‌ ‌డిఏ, మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించకుండా ఉండాల్సింది. అంతేకాక, తెలుగుదేశం పన్నిన వలలో వైసీపీ సభ్యులు పడ్డారు. చంద్రబాబునాయుడు కోరుకున్నట్టే జరిగింది. వైసీపీ నాయకులే అన్నట్టు ఆ రెండు బిల్లుల ఆమోదానికి ఇంకా వ్యవధి ఉంది. ప్రస్తుతం కరోనా లాక్‌ ‌డౌన్‌ ‌పరిస్థితుల వల్ల ఆర్థిక సమస్యలు వెంటాడుతున్న సమయంలో ముందుగా ఆర్థిక బిల్లును ఆమోదింపజేసుకోవల్సింది. అలాగే, శాసనమండలి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఇరు పక్షాల సభ్యులను పిలిపించి బడ్జెట్‌ ఆమోదానికి తగిన వ్యూహాన్ని అమలు జరిపి ఉండాల్సింది. వైసీపీలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వంటి సీనియర్లను పక్కకు నెట్టేసి యువతరానికి చెందిన మంత్రులు, సభ్యులు రాజధాని భూముల వ్యవహారం ప్రస్తావించడం వ్యూహాత్మక తప్పిదం. అందుకు వేరే సమయం ఉంది. సభలో బడ్జెట్‌ ‌కాకుండా ఇతర అంశాలను ప్రస్తావించినప్పుడు సభాధ్యక్ష పీఠంలో ఉన్న వారు సభను తాత్కాలికంగా వాయిదా వేసి ఇరువర్గాల నూ కూర్చో బెట్టి రాజీ చేసి ఉండాల్సింది. అలా చేయకపోవ డం వల్ల ఎవరికి తోచిన రీతిలో వారు గొంతెత్తుకుని ఒక్కరి మీద వారు పడ్డారు. ఇది సంప్రదాయం కాదు. ఎన్టీఆర్‌ ‌హయాం నుంచి తెలుగు దేశం పార్టీకీ, ముఖ్యంగా చంద్రబాబునాయుడుకు అత్యంత విశ్వాస పాత్రునిగా ఉంటున్న మాజీ స్పీకర్‌,. ‌మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తన సుదీర్ఘ అనుభవాన్ని సొంత పార్టీ కోసం వెచ్చించారు.

శాసనసభ నిర్వహణలో చంద్రబాబు అనుకూల ధోరణిని ప్రదర్శించినందువల్లనే తాను ఏరి కోరి పదవులు ఇచ్చిన ఎన్టీఆర్‌ ‌సైతం ఆయనను దూరంగా పెట్టారు. అంటే పార్టీ వ్యవస్థాపకునికే మైక్‌ ఇవ్వని స్పీకర్‌ ‌గా ఆయనను ఇప్పటికీ ప్రత్యర్ధులు విమర్శిస్తుంటారు. చంద్రబాబు సుదీర్ఘ అనుభవం రాష్ట్రానికి కాకుండా, కొద్ది మందికే ఉపయోగపడిందన్న సుప్రసిద్ద జర్నలిస్టు, దివంగత సంపాదకుడు కెఎన్‌ ‌వై పతంజలి ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్య అక్షర సత్యం. ఇప్పుడు కూడా కొద్ది మంది కోసమే రాజధాని భూముల వ్యవహారంపై అమితమైన ఆస క్తి చూపుతున్నారు. నలభై ప్లస్‌ ఇం‌డస్ట్రీగా పదే పదే చెప్పుకునే చంద్రబాబు ఆర్థిక బిల్లు ఎగువ సభలో ఆగిపోయినందుకు బాధ పడకుండా ఇందుకు వైసీపీదే బాధ్యత అంటూ ఆరోపించారు. పరోక్షంగా రాజధాని భూముల ప్రస్తావన చేస్తూ తెలుగుదేశం సభ్యులు చరిత్రాత్మక పాత్ర పోషించారంటూ వారిని అభినందించారు. ఇది అత్యంత విచారకరం. చంద్రబాబుకు స్వీయ పార్టీ ప్రయోజనాలే ముఖ్యమన్న ఆరోపణ అసత్యం కాదని రుజువైంది. అలాగే, రాజకీయాల్లో కొత్తగా ప్రవేశించిన నారా లోకేష్‌ ‌వ్యాఖ్యలూ, ట్వీట్ల ముది మాటల లా ఉన్నాయి. అర్భకునికి ఆకలెక్కువన్న సామెత చందంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు జుగుప్స కలిగిస్తున్నాయి. వైసీపీ ఎంపీ విజయసాయి లోకోష్‌ ‌తో ట్వీట్ల యుద్దానికి దిగడం తన స్థాయిని తగ్గించుకోవడమే, బుద్ధా వెంకన్న స్థాయికి చెందిన నాయకుని చేత సమాధానాలు ఇప్పించాలి కానీ, తాను జోక్యం చేసుకోకూడదు. ఇలాంటి వారిని కంట్రోల్‌ ‌చేయడం లో ముఖ్యమంత్రి జగన్‌ ‌విఫలమవుతున్నందువల్లే లోకేష్‌ , ‌బుద్ధా వెంకన్న వంటి నాయకుల చెల రేగి పోతున్నారు. ఇప్పటికైనా జగన్‌ ఈ ‌పరిస్థితిని గ్రహించాలి. చంద్రబాబుకు అవకాశం ఇవ్వకుండా వ్యూహాలు పన్నేందుకు ప్రశాంత్‌ ‌కిషోర్‌ ‌వంటి వారి సలహాలు తీసుకోవాలి. చంద్రబాబు సీనియర్‌ ‌నాయకునిగా మంచి సలహాలు ఇవ్వకుండా రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ తన గౌరవాన్ని తగ్గించుకుంటున్నారు. అచ్చెన్న నాయుడు, జేసీ ప్రభాకర రెడ్డిల అరెస్టును రాజకీయాలతో ముడిపెట్టి ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల ఆయన ఇమేజ్‌ ‌దెబ్బతింది. ఇప్పుడు ఆర్థిక బిల్లును అడ్డుకున్న మాజీ సిఎంగా చరిత్రలో నిలవబోతున్నారు.
– స్వామి

Leave a Reply