బ్రిటన్‌లో అందుబాటులోకి ఫైజర్ వ్యాక్సిన్
ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న కోవిడ్ వ్యాక్సీన్ ను బ్రిటన్ తమ దేశంలో పంపిణీకి శ్రీకారం చుట్టింది. తద్వారా ప్రపంచంలో తొలిసారి కొరోనా వ్యాక్సిన్ ఇవ్వడం మొదలుపెట్టిన దేశంగా బ్రిటన్ నిలిచింది. తొలి దశలో 50 హాస్పిటళ్లలో ఫైజర్ వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచారు. ముందుగా 80 ఏళ్లు పైబడిన వారు, హెల్త్ కేర్ వర్కర్లు, నర్సింగ్ హోం సిబ్బందికి బ్రిటన్ టీకాలు ఇస్తోంది. తొలి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న వ్యక్తిగా మార్గరేట్ కీనన్ అనే 90 ఏళ్ల వృద్ధురాలు రికార్డ్ క్రియేట్ సృష్టించారు. ప్రపంచంలోనే తొలి టీకాను తనకే ఇవ్వడం ఎంతో గర్వంగా భావిస్తున్నానని కీనన్ సంతోషం వ్యక్తం చేశారు. ఇంగ్లాండ్ కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 6.30 గంటలకు కొవెంట్రీ స్థానిక ఆస్పత్రిలో ఆమెకు టీకా తొలి డోస్ ఇచ్చారు. మూడు వారాల వ్యవధిలో కొరోనా వ్యాక్సిన్‌ను రెండు డోసులుగా ఇస్తారు.
కోవిడ్-19 సోకకుండా ఈ వ్యాక్సిన్ 95 శాతం రక్షణ కల్పిస్తుంది. ఈ వ్యాక్సిన్ వేయించుకున్న వాలంటీర్లలో సైడ్ ఎఫెక్టస్ స్వల్పంగానే ఉన్నాయని, వెంటనే తగ్గిపోయాయని ఫైజర్ తెలిపింది. రెండో డోస్ ఇచ్చిన తర్వాత సైడ్ ఎఫెక్ట్‌ల తీవ్రత ఎక్కువగా ఉందని, 3.8 శాతం మంది వాలంటీర్లలో అలసట కనిపించగా..2 శాతం మంది తలనొప్పి వొచ్చిందని ఫిర్యాదు చేసినట్టు వెల్లడించింది. వయసు దపడిన వారిలో ఈ సైడ్ ఎఫెక్టస్ ఒకింత ఎక్కువగా ఉన్నాయని వివరించింది.. రెండో ఇంజెక్షన్ వేయించుకున్న వారం తర్వాత ఈ వ్యాక్సిన్ కోవిడ్ సోకకుండా నిరోధించిందని కూడా తెలిపింది. వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ నిరంతరం అప్రమత్తంగా ఉండటం, మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరిగా చేయాలని సూచిస్తున్నారు.