Take a fresh look at your lifestyle.

వ్యాక్సిన్‌ ‌కోసం ప్రపంచదేశాల ఎదురుచూపు

ప్రపంచ వ్యాప్తంగా వేగవంతంగా విస్తరిస్తున్న కొరోనా వైరస్‌కు విరుగుడు రానంతవరకు మరణమృదంగం మోగుతూనే ఉంటుందనడానికి నిత్యం పెరుగుతున్న పాజిలివ్‌ ‌కేసులు, మరణాల సంఖ్యనే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నది. ప్రపంచంలోని దాదాపు రెండు వందల పది దేశాల ప్రజలను గడగడలాడిస్తున్న ఈ వైరస్‌ను నివారించడం ఇప్పటివరకు ఏ ఒక్క దేశానికి సాధ్యపడడం లేదు. ఒక పక్క అతికష్టంగా వ్యాధి లక్షణాలను నివారించగలిగినా పూర్తిస్థాయిలో వ్యాధిని పొగొట్టగలిగామాన్న నమ్మకాన్ని వైద్యులు చెప్పలేకపోతున్నారు. శరీరంలో ఎక్కడో ఏమూలో దాగి ఉన్న వైరస్‌ ‌కణాలు ఎప్పుడైనా తిరగబెట్టవచ్చనేది నుపుణుల అభిప్రాయం. అందుకే దాని విరుగుడు వ్యాక్సిన్‌ ‌వచ్చేవరకు స్వీయ నియంత్రణ పాటించాల్సిందేనని ఇటు వైద్యులు, అటు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు కోటిన్నర మంది ఈ వ్యాధి బారిన పడగా కనీసం ఆరున్నర లక్షల మంది మరణించినట్లు తెలుస్తున్నది. అయితే వ్యాధి ప్రబలడానికి, పెద్ద సంఖ్యలో మృత్యువాత పడడానికి ప్రజలు కనీసం జాగ్రత్తలను తీసుకోకపోవడం ప్రధానకారణంగా శాస్త్రవేత్తలు చెబుతున్నమాట. అభివృద్ధి చెందుతున్న మన లాంటి దేశాలు కూడా ఎక్కువ కాలం లాక్‌డౌన్‌ను పొడిగించలేకపోవడం కూడా మరో కారణం. మన దేశంలో లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత ఈ వైరస్‌ ‌వేగవంతంగా వ్యాప్తిలోకి వచ్చింది. లాక్‌డౌన్‌ ఎత్తివేయడమంటే పూర్వంలా స్వేచ్ఛగా తిరగవచ్చన్న అభిప్రాయంగానే ప్రజలు తమ పనులను సాధారణంగానే చేసుకుంటూపోవడంతో వైరస్‌ ‌విస్తృతమవుతోంది. లాక్‌డౌన్‌ ‌కాలంలో విధించినట్లుగా ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా ఒక విధంగా ప్రజలను గాలికివదిలేయడమే మరణాల సంఖ్య పెరగడానికి కారణమంటున్నారు. ఫలితంగా సామాజిక వ్యాప్తి జరుగుతోంది. ఇంతవరకు కట్టడిగా ఉన్న పల్లెటూళ్ళకు కూడా సోకుతోంది. దేశంలో ఇప్పటివరకు పన్నెండు లక్షలు దాటి పదమూడు లక్షలకు చేరువలో పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య చేరుకుంది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో దేశవ్యాప్తంగా యాభై వేలకు దగ్గరగా పాజిటివ్‌ ‌కేసులు వచ్చాయంటేనే వైరస్‌ ‌తీవ్రత ఎలా ఉందో తెలియజేస్తున్నది. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ప్రారంభంలో ఎంత తక్కువ సంఖ్య ఉండిందో ఇప్పుడు అంత••న్నా వేగవంతంగా కొరోనా విజృంభిస్తోంది. అనుమానితులకు పరీక్షలు సక్రమంగా చేయకపోవడవల్ల ఇంకా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య తక్కువగా కనిపిస్తుందేగాని, పరీక్షలు విస్తారంగా చేస్తే భయపడే స్థాయిలో ఆ సంఖ్య వెలుగు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలంగాణలో తాజా లెక్కల ప్రకారం పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య యాభై ఒక్క వేలకు పైనే చేరుకోవడం ఆందోళనను కలిగిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినట్లు కొరోనాతోనే సహజీవనం చేయకతప్పని పరిస్థితి కనిపిస్తోంది. దీనివల్ల అనేక కుటుంబాలు అనాథలవుతున్నాయి. లక్షలాది రూపాలయలను ప్రైవేటు హాస్పిటళ్లకు చెల్లించలేక ఆర్థికంగా కృంగిపోతున్న కుటుంబాలెన్నో ఆగమవుతున్నాయి. అందుకే ప్రపంచమంతా ఇప్పుడు దీనికి విరుగుడు మందును ముందుగా ఎవరు కనిపెడుతారా అని వెయ్యి కండ్లతో ఎదురుచూస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు ఇరవై నుండి ముప్పై సంస్థలు దీనిపై రేయింబవళ్ళు పరిశోధనలు చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు మందును కనిపెట్టినా క్లినకల్‌ ‌టెస్ట్‌లో నిమగ్నమై ఉన్నాయి. ఈ సంస్థలన్నీ ఆగస్టు మొదలు డిసెంబర్‌ ‌లోపుగా మార్కెట్‌లోకి ఇందుకు సంబంధించిన టీకాను తీసుకొస్తామని విశ్వాసంగా ప్రకటిస్తునాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం 2021కి ముందు ఎట్టి పరిస్థితిలో వ్యాక్సిన్‌ ‌వచ్చే అవకాశంలేదంటోంది. అయినప్పటికీ ప్రపంచ దేశాలన్నీ బ్రిటన్‌వైపు ఆశగా చూస్తున్నాయి. కొరోనా వ్యాక్సిన్‌ను ఇతర దేశాల్లోని సంస్థలకన్నా ముందుగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఆదేశ ఆక్స్‌ఫర్డ్ ‌యూనివర్శిటీ ఉండడంతో అందరి చూపు అటువైపు మళ్ళింది. బ్రిటీష్‌-‌స్వీడిష్‌ ‌బహుళజాతి ఫార్మాకంపెనీ అస్త్రా జెనెకా, ఆక్స్‌ఫర్డ్ ‌యూనివర్శిటీలు సంయుక్తంగా తయారుచేసిన ఏజెడ్‌డి 1222 వ్యాక్సిన్‌ను ఇప్పటివరకు రెండు దశల్లో మనుష్యులపై చేసిన ప్రయోగం సానుకూల ఫలితాలు రావడంతో, మరో రెండు దశల ప్రయోగం తర్వాత అంటే సెప్టెంబర్‌ ‌లేదా అక్టోబర్‌ ‌నాటికి ఇది అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉంటే మనదేశంలో కూడా దాదాపు ఆరునుంచి ఏడు సంస్థలు ఇదే పనిలో ఉన్నాయి. భారత్‌ ‌బయోటెక్‌ ‌సంస్థ తయారుచేసిన కోవ్యాక్సిన్‌ ‌దాదాపు పద్నాలుగు హాస్పిటళ్లలో చేపట్టిన ప్రయోగాలపై వైద్యబృందం నిశితంగా పరీక్షలు జరుపుతున్నది. మిగతా సంస్థలు కూడా ఆరు నెలల నుండి ఎనిమిది నెలల కాలంలో పరీక్షలను పూర్తిచేయనున్నట్లు చెబుతున్నాయి. కాగా రష్యా కూడా వచ్చేనెలలోనే వ్యాక్సిన్‌ అం‌దుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం మూడవ దశ ప్రయోగాలు వచ్చేనెల మొదటి వారంలో ప్రారంభించనున్నట్లు చెబుతోంది. అమెరికాలో దీనిపై వేగవంతమైన పరిశోధన జరుగుతున్నది. మోడెర్నా అనే సంస్థ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ ‌మూడవ దశ ప్రయోగం ఈనెల 27న జరుగనున్నందున రెండు మూడు నెలల్లోనే ఏదో ఒక సంస్థ నుండి వ్యాక్సిన్‌ ‌తప్పకుండా వెలువడుతుందన్న ఆశాభావం కనిపిస్తున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకునే అన్నట్లు తాజాగా రాష్ట్ర ప్రజా ఆరోగ్యశాఖ రానున్న నాలుగైదు వారాలు అతి క్లిష్టమైనవని, సామాజిక వ్యాప్తి జరుగ కుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను అప్రమత్తం చేసింది.

Leave a Reply