తెలంగాణ, ఏపీ మంత్రుల మాటలు శృతి మించుతున్నాయి. తోటి మంత్రులన్న కనీస మర్యాదను కూడా విస్మరిస్తున్నట్లుగా నోటికి ఎంతవస్తే అంతే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. తెలంగాణ మంత్రి హరీష్‌రావు చేసిన కామెంట్‌కు ఏపీ మంత్రులకు నషాళానికి ఎక్కినట్లు కనిపిస్తున్నదనేందుకు వారిచ్చే ప్రతిస్పందన తీరు చెప్పకనే చెబుతున్నది. విమర్శలను మంత్రులు తమ వరకే పరిమితం చేయకుండా రాష్ట్ర ప్రజలను కూడా వివాదాల్లోకి లాగుతున్నారు. ఎవరి పాలనలో ఎన్ని లొసుగులున్నాయో అక్కడి ప్రజలను అడిగితే వారే చెబుతారంటూ ఒకరిపై ఒకరు ఆవేశ ప్రసంగాలు చేస్తున్నారు. తమ పాలనా తీరును వంక పెడుతున్నవారు. తమ ప్రాంతానికి వొచ్చి మాట్లాడాలని ఒకరిపై ఒకరు సవాల్ విసురుకుంటున్నారు. ఏదియేమైనా ఇరు ప్రాంతాల్లోని పాలనా లొసుగులేమిటన్నది ఈ వివాదం ద్వారా బహిర్ఘతం అవుతున్నది. అన్నిటికీ మించి మరోసారి ఈ వివాదంలోకి హైదరాబాద్‌ను లాగుతున్నారు. విభజనకు ముందు హైదరాబాద్ అభివృద్ధిపై చేసిన వ్యాఖ్యలనే మరోసారి ఆవు వ్యాసంగా వినిపిస్తున్నారు ఏపీ మంత్రులు. తాజాగా ఏపీ మంత్రి విశ్వరూప్ ఆంధ్రుల వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని మరోసారి విడమరుస్తున్నారు. ఉమ్మడి ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రులుగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, నారా చంద్రబాబు నాయుడుతో సహా ఆంధ్ర ముఖ్యమంత్రులంతా హైదరాబాద్ తమదిగా భావించి అభివృద్ధి చేశారంటూ పాత క్యాసెట్‌ను మరోసారి వేస్తున్నారు. మరో మంత్రి కారుమూరు నాగేశ్వర్‌రావు ధనిక రాష్ట్రంగా మార్చి తెలంగాణను తాము వదిలేస్తే ఇవ్వాళ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారంటారాయన.
ఏర్పాటు చేసిన అనేక పరిశ్రమల ఆదాయాన్ని వదిలేసి వొచ్చామంటూ ఇంకా హైదరాబాద్‌పైన తమకున్న వ్యామోహాన్ని మరోసారి వెళ్ళగక్కారు. వేరుపడినప్పుడు ధనిక ర్గాంగా ఉన్న తెలంగాణను తెలంగాణ పాలకులు ఎలా తగలేసుకున్నారో కండ్లముందే కనిపిస్తున్నదని తీవ్రంగా దుయ్యబట్టారు. హైదరాబాద్‌ను సుందరనగరంగా తీర్చిదిద్దామని చెప్పుకుంటున్న తెలంగాణ పాలకులను ఏపీ మంత్రులు వేలెత్తి చూపుతున్నారు. మీ పాలనేమిటో మీ ప్రతిపక్షాలే చెబుతున్నాయని వారు ఎద్దేవ చేస్తున్నారు. ఒక గంట వర్షం పడిందంటేనే చాలు హైదరాబాద్ అంతా మునిగిపోతుందని, రోడ్లపై పడవలు వేసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఏపీ మంత్రి కారుమూరు విమర్శిస్తున్నారు. ఒక్క హైదరాబాద్‌లో రోడ్లువేస్తేనే సరిపోదని, రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు ఏ పథకం సంపూర్ణంగా అందటంలేదు అందుకు నిత్యం తెలంగాణలో జరుగుతున్న ప్రజా ఉద్యమాలే పాలనతీరును చెబుతున్నాయంటున్నారు. వైఎస్‌ఆర్‌సిపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మరింత ముందుకు వెళ్ళి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తెలంగాణను దోచుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరో మంత్రి సీదరి అప్పలరాజు మరింత ఘాటుగా స్పందించారు. ఆంధప్రజలు తెలంగాణకు రావడం మానేస్తే తెలంగాణవారు అడుక్కు తినడం తప్ప అక్కడ ఏమీ ఉండదని విభజననాటి మాటలను మరోసారి పునరావృతం చేశారాయన. అసలు ఏపీ వాళ్ళు లేకుండా తెలంగాణలో అభివృద్ధి ఎక్కడ అంటారాయన. ఇంకా ఆయన హరీష్‌రావునేమోగాని తెలంగాణ ప్రజలను ఇబ్బందిపెట్టే విథంగా చాలానే అన్నారు.
తెలంగాణ ఉద్యమకాలంలో పొట్ట చేతపట్టుకుని వొచ్చిన వాళ్ళను కాదు, మా పొట్టలు కొట్టేవారిపైనే తమ పోరాటమని నాటి ఉద్యమనేతగా కెసిఆర్ అన్నట్లుగానే, తెలంగాణ అభివృద్ధికోసం చెమట చిందించే ప్రతీ ఒక్కరూ తెలంగాణ బిడ్డలేనంటూ మంత్రి హరీష్‌రావు మాట్లాడిన తీరు ఎందుకో వారికి కొరుకుడు పడలేదు. అంతటితో ఆగకుండా తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రా కార్మికులు ఏపీలోని తమ వోటు హక్కును రద్దు చేసుకుని తెలంగాణలో దరఖాస్తు చేసుకోవాలన్న వ్యాఖ్యలు కూడా ఏపీ మంత్రులకు మరింత ఆగ్రహాన్ని తెప్పించాయి. తెలంగాణలో వ్యవసాయ, పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందటంతో వివిధ ప్రాంతాలకు చెందిన కార్మికులు ఇక్కడికి రావడానికి మక్కువ చూపుతున్నారన్నది హరీష్‌రావు ఉద్దేశ్యం అయిఉంటుంది. దాన్ని ఏపీ మంత్రులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. తెలంగాణకు మించిన అభివృద్ధి ఏపీలో ఉందని, వొచ్చి చూస్తే అర్థమవుతుందని, తెలంగాణతోపాటు ఒడిషా, బీహార్ కార్మికులు ఏపీకి రావాలనుకుంటున్నారంటూ, అనవసరంగా తమ పాలనలో జోక్యం చేసుకోవద్దని ఏపీ మంత్రులు చేసిన హెచ్చరికకు హరీష్‌రావు కూడా అదే స్థాయిలో స్పందించడంతో ఈ విమర్శలు చివరకు ఎటు దారితీస్తాయోననుకుంటున్నారు. మొన్నటి వరకు జగన్, కెసిఆర్ ఒక్కటే అన్న అభిప్రాయానికి ఈ విమర్శలు వారి మధ్య దూరాన్ని ఎత్తిచూపుతున్నాయి. ఇటీవల విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయం రెండు రాష్ట్రాల మధ్య వివాదమైంది. ఏపీ ప్రజల మేలుకోసమే ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో తెలంగాణ ముందుపడిందేగాని, ఉక్కును అమ్ముతున్న మాట్లాడలేని నిస్సహాయతలో ఏపీ ప్రభుత్వమున్నదన్న హరీష్ మాటలు వారిని ఆగ్రహం కట్టలు తెంచుకునేలా చేశాయి. తమ ప్రాంత అభివృద్ధి గురించి చెప్పుకోవడానికి బోలెడన్ని ఉన్నాయి. మీ దగ్గరేముంది.. కనీసం విభజన హామీలోని ప్రత్యేక హోదానుకూడా సాధించుకోలేక పోయారన్న హరీష్ దెప్పిపొడుపుకు ఆగ్రహోదగ్రులవుతున్న ఏపీ మంత్రుల నోటి వెంట పరుషపదాలు వెలువడుతున్నాయి.