ఒక అందమైన పోయెం అంటే/దానికి ఒక గుండె ఉండాలి/ అది కన్నీళ్లు కార్చాలి/ క్రోధాగ్నులు పుక్కిలించాలి/ వీడితుల పక్షం అవలంబించి / మనిషి రుణం తీర్చుకోవాలి/ బ్రతకడానికి ఒక బురుజై/ మనిషి విజయానికి జెండా అయ్ ఎగరాలంటారు మహాకవి డాక్టర్ గుంటూరు శేషేంద్ర శర్మ. తరంగ సంగీతాల్ని జీవన లయాత్మకతతో వినేందుకు ఆలోచనల కిటికీలను రెప్పపాటు జాగ్రత్తతో తెరిచే మనోమైదానమే కవిత్వం. కవే కవిత్వానికి పరిసరాలను నిర్మించుకోవాలి. పుడితే నదిగా, ఎదిగితే చెట్టుగా మారి పరహితమే లక్ష్యమైన అపురూప సందర్భంగా కవిత్వానికి పేరుంది. ఇదివృత్తం ఏదైనా పాదరసంలా ప్రవహించే గుణం కలిగిన కవిత్వం స్వాతిముత్యమంత స్వచ్చమై వెలుగుతుంది. వ్యాక్యాన్ని వెలిగించే భావనలకు కవిత్వ రూపం అద్దిన కవి కోట్ల వెంకటేశ్వరరెడ్డి. నిరంతర నిత్యనూతన ప్రవాహమైన తన అంతరంగంలోని కవిత్వాన్ని తొణకని వాక్యంగా నిర్మించారు. ఎనభై కవితల సమాహారంగా రూపొందించి జలజం సత్యనారాయణకు అంకితమిచ్చిన ఈ కావ్యం కరీంనగర్ సాహితిగౌతమి సినారె పురస్కారానికి ఎంపికైంది. వాన కడిగిన చీకటిలో ప్రవహించే జ్ఞాపకంగా, నిత్యాన్వేషణ తత్వంగా ఇందులో కవిత్వం కనిపిస్తుంది.
అతడిలోని రెండో ముఖాన్ని పట్టి చూస్తే సమూహాల్ని కూడగట్టే అసహనమైండు అనడంలో చింతచచ్చినా పులుపు చావని వ్యక్తుల నైజాన్ని వెంకటేశ్వరరెడ్డి ఎండగట్టారు. కాలసూచిగా కవిత్వాన్ని ఆశించగలమా అని ప్రశ్నించుకొని సమాధానం కోసం అన్వేషణలో మునిగిపోతారు. శిథిల కోట గోడలకు నోళ్లుంటే గుట్టు విప్పుతాయని అంటారు. విలపించడమైనా /వివేచించుకోవడమైనా మనిషికి తప్పదంటారు. కవితా పాదానికి కూడా/ ఒక వెంటాడే తనముండాలని చెబుతారు. జీవిత గంధమంటని రాతల ప్రయోజకత్వం ఏమిటని సూటిగా అడుగుతారు. వాక్యం అగ్ని చల్లి, అమృతం కురవాలన్నది కవి ఆకాంక్ష. ఉండి లేనితనం పనికిరాదని జాగ్రత్త చెబుతారు. అచేతన స్థితి ఆగిపోయిన కాలంలోకి నెట్టేస్తే బతుకుది వెంపర్లాటేనని, జీవితం ఎప్పటికీ చెల్లని నోటేనా అని బాధపడతారు. కవిని జీవనదితో పోల్చి తీరాన్ని ఒరుసుకుంటూ నిత్యం ప్రవహించే పచ్చదనపు హృదిగా అభివర్ణిస్తారు. ఆమె/ కట్టెలమ్మినా బాగుండేది/ పూలమ్మి బతుకు పరిమళాన్ని పోగొట్టుకుందని వికసించని బతుకు చిత్రాన్ని కన్నీటిమయంగా గీశారు. అందరూ విడిచి వెళ్లిపోతే ఖాళీ అయిన ఇల్లును ఒంటరి మేఘంతో పోల్చారు. గదిలో కూర్చొని/ పాలనాపగ్గాల పగటి కలలు కనటం కన్నా/ పాదయాత్రలు చేయడం మంచిదేనంటూ కదలిక ఎవరినైనా పదునెక్కిస్తుందన్న వాస్తవాన్ని చెబుతారు.
చరిత్ర నిన్ను పట్టించుకోవాలంటే మార్పును నిత్యం గమనించాలంటారు. ఫలితం లేని యుద్ధంలో పతనం తథ్యమని చెప్పి యేట్లో చింతపండు పిసికిన సామెతను, నాన్న పులి కథను ఉదాహరిస్తారు. పుస్తకావిష్కరణ వేడుకను ప్రసూతి వైరాగ్య చిత్రంగా చూపించారు. ఎత్తుల్లేవ్/ పల్లాల జిత్తుల్లేవ్/ నదుల నడక మారాల్సిందే/ కోటి ఎకరాలు తడవాల్సిందే అంటూ బతుకు భయం లేని తెలంగాణ పాడిపంటలతో దేశానికి కొత్త పాఠం చెబుతుందంటారు. కాలాన్ని సహచరిగా భావించమంటారు. అసాధారణమైన ఆత్మస్థైర్యం తగ్గకుండా పరాభవానికి దూరంగా మనుగడ సాగించమని దిశానిర్దేశం చేశారు. త్యాగం ఎప్పుడూ పారేసుకున్న రూపాయి బిల్లేనని దానిని నిరాశ అంటిన నీలి మేఘంతో పోల్చి చెప్పి దానిని వెతకొద్దు అని హెచ్చరిస్తారు. లక్ష్యం కోసం నిలువునా కాలిపోయినా ఓడితే జారే కుర్చీని కలగనకుండా రెపరెపలాడే జాతిపతాకాన్ని ఊహించాలంటారు. అబద్ధపు ప్రపంచం వద్దంటారు. మనిషికి మనిషికి మధ్య లోయల విస్తరణ ఎందుకని ప్రశ్నిస్తారు. కాలం నాలుగు పాదాల మీద నడవదు కనుక జీవన దృశ్యం మారాలని భావిస్తారు. చరిత్రలో నిలబెట్టే నిబద్ధత వైపే అడుగేయమంటారు. రద్దైన కరెన్సీ బాధను వదలని బొమ్మాళిగా అభివర్ణించారు. కరువులెన్ని వచ్చినా మెతుకు వాగ్దానం మరువని రైతును కళ్లకద్దుకున్నారు. ఆత్మవంచన, అబద్ధం ప్రపంచంలో ఒదగదని చెప్పారు. దీవించడం, శపించడం అక్షరానికి తెలుసని అంటారు. పూలరెమ్మల తలలూపే వీడ్కోలు తుమ్మెదలకు అమృతప్రాయమే అనడంలో జీవన వైరుధ్యాలను గమనించవచ్చు. పాదాలు కడిగిన సముద్రమే అవకాశాన్ని బట్టి పాతాళానికి తొక్కేస్తుందని హెచ్చరిస్తారు. స్వయంజనిత శక్తిని అడ్డుకుంటే కల్లోలాలు ఎగిసిపడతాయంటారు. మనిషి అన్వేషణ ఆగకుండా కొనసాగాలని చెబుతారు. పాపపు కూపాల కష్టాలను సందర్భోచిత సంఘటనలతో చిత్రించారు. మహాకవి సినారె మాటను ప్రవహించే కవితా సరస్సుగా అభివర్ణించారు. మీ శుద్ధ వాక్యం కోసం సభాస్థలుల ఎదురు చూపు/ కవితా యవనిక మీద పగలే చీకట్లు/ మరణంపై రణం చేసి గెలిచారు అని సినారెను స్మరించారు.
వేటగాళ్లు అంతటా విస్తరిస్తుంటే/ గుడ్డి కొంగైనా/ నిఘా మీద నిలబడ్డ సరిహద్దు సైనికుడే అని అబలలపై మృగాళ్ల అకృత్యాల పట్ల అప్రమత్తతను సూచిస్తారు. కాలం పేజీలను వెనక్కి తిప్పి చూసుకుంటే చిందిన స్వేదం, పొందిన ఫలం తెలుస్తుందంటారు. మట్టి తనపు పలకరింత కన్న గొప్పది ఏముందంటారు. అన్నివ్యాధులకు ఒకే ఔషదం ఉండదని చెబుతారు. చరిత్ర నిర్దయ ఏ అబద్ధాన్ని వదిలిపెట్టదు/ ఎంత నీల్గినా చివరికైనా/ జమా ఖర్చుల ఆనవాళ్లు ఇక్కడే వదిలి పోవలసిందే అన్న నిర్ధారిత విషయాన్ని స్పష్టంగా వివరిస్తారు. అద్దం పగిలిందా/ రాయిని కాదు ప్రశ్నించాల్సింది/ విసిరిన చేయిని అంటారు. నిన్ను నీవే గెలవకపోతే/ ఎవరినీ ఓడించలేవు అన్న సత్యాన్ని తెలుసుకొమ్మంటారు. మెలకువ జీవితాన్ని కాపాడే సహజ కవచకుండలమని అంటారు. దీపస్తంభంగా మనిషి ఎదగాలంటారు. తగిలిన గాయాల్ని/ మానిన మరకల్ని తడిమి చూసుకొని బాధను భద్రపరుచుకొమ్మని అంటూ ఎదిగావో దిగజారావో చూసుకొమ్మంటారు. పుస్తకాన్ని అవ్యక్త అనుభూతుల కాంతి పరంపరగా భావించారు. ఆమె పని చేసి ఆఫీసు నుండి ఇంటికి తిరిగొస్తుంటే అవనతం చేసిన జెండాలా ఉంది అని ఆమెది ఒకనాటితో ముగిసే యుద్ధమా అని జీవిత సహచరిని గుర్తు చేసుకుంటారు. ఆరిపోని అల్లాఉద్దీన్ దీపంగా ఆమెను చెబుతారు. మానవతరాల గణన జాతరకు శిథిల జనపదాలను ఉదాహరణలుగా చూపారు. కుతంత్రాలతో వెలుతురు బాటను అడ్డుకుంటే కుప్పకూలిపోతావంటూ సార్వభౌముణ్ణి హెచ్చరిస్తారు. ఐదేండ్ల రాజకీయంలో ప్రాధాన్యతలేని పోటీ యంత్రాలుగా ప్రజల్ని లెక్కించడాన్ని స్వయంకృతానికి నిదర్శనంగా చూపారు. ప్రశాంతంగా ఉండే నట్టింటిని బుల్లితెర అసెంబ్లీ చేసిందని అంటారు. అవసరాలు తీరాక అసంకల్పితంగా అన్ని మాయమైపోతాయనే నిత్యసత్యాన్ని చెప్పారు.
మట్టి అంటిన తన చేతులకు మమకారం నేర్పించాల్సిన అవసరం లేదని అంటారు. రేపటి సూర్యుళ్లుగా పిల్లలను పోల్చారు. మేఘాలు అలవి కాని సంభ్రమ సింహ గర్జనలు చేస్తాయని చెబుతారు. మసకబారుతున్న దృశ్యాలలో పచ్చటి కన్నీటి పొరను చూడమంటారు. స్పష్టంగా లేని అద్దం వ్యూహం లేని యుద్ధంతో సమానమని చెబుతారు. పడడం చిన్నతనమేమీ కాదని, ఒక అనుభవం వెయ్యి పాఠాల సారమని తేల్చారు. చెట్టును జీవనపు నీడగా పోల్చారు. ఉనికి ఎవరికైనా అవసరమేనని అన్నారు. సత్యాన్ని సందర్భాన్ని బట్టి గ్రహించాలని సూచిస్తారు. ఇప్పటి మారిన సమాజంలో మహాత్ముడు కూడా మౌనదీక్షకు దిగడంటారు. దేశం, దేహం నందనవనమని పూల సందేశాన్ని మోసుకొచ్చారు. జూన్ రెండు సకల తెలంగాణ జనుల బంగారు భాగ్యోదయమని ఆత్మగౌరవ పతాకాన్ని నింగికి ఎగరేస్తారు.
శిఖరాలు, లోయలను తపనతో అధిగమిస్తేనే మైదానాలు స్వాగత గీతాలు పాడుతాయని అంటారు. ఓటమి విజయానికి ఆవలివైపే ఉంటుందన్న సత్యబోధన చేస్తారు. అమ్మతనం తెలుసుకుంటే పడికెడు కవిత్వం రాలిపడుతుందంటారు. చెట్టు పిలవనిదే/ వాన విల్లై వాలదు/ హృదయమంతా ధ్రవించనిదే శోకం శ్లోకంగా మారదని చెబుతారు. కవికి నిజాయతీ లేకుంటే కాలం కూడా నిద్రపోతుందని హెచ్చరిస్తారు. ఔటర్ రింగ్రోడ్డును కదలని నాగుపాముతో పోల్చి కాటెప్పుడు వేస్తుందో తెలియదంటూ జాగ్రత్తపడమంటారు. వెతుకులాట మనిషి జీవితంలో ఒక ప్రయాణం వంటిదని అనుభవం ఉపశమనాన్ని ఇస్తుందని చెబుతారు. విధ్వంసాలు కీళ్లు సడలిన వాక్యాల వంటివని వేదన పడతారు. గాలిలో దీపాలు పెట్టి పొలంలో గింజల్ని పండించుకోవాలనుకోవడంలో కరువు దృశ్యాన్ని ఎత్తిచూపారు. జ్ఞాపకాల ఊటబావిగా తన ఊరిని చూపించారు. అప్రమత్తత నిజానికి ఒక ఎత్తుగడే అంటారు. రాజ్యం జేసే వాళ్లు రాజైనా రైతును మర్చిపోయారని వేదన పడుతూ నేల వెన్నుపూసగా అతనిని పోల్చారు. నిలకడలేని హృదయ స్పందనలు మురికిని మోయడానికే అంటూ ఎదతోట నిండా పూలవనాలు ఉంటే ఆలోచనలకు సుమపరిమళాలు అంటుతాయని భావించారు. ఈ కవిత్వం విభిన్న వైవిధ్యాల మానవ జీవన యుద్ధాన్ని అక్షరబద్ధం చేసిన జ్ఞానకుండలి.
– డా. తిరునగరి శ్రీనివాస్
8466053933.