- 111 జీఓ రద్దుకు అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలి
- జీ ఓ రద్దుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి
- ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రభుత్వం సమీక్షించుకోవాలి
- అఖిలపక్ష సమావేశంలో పలువురు వక్తలు డిమాండ్
ఖైరతాబాద్, ప్రజాతంత్ర విలేఖరి, ఏప్రిల్ 19 : 111 జీ ఓ రద్దుకు అన్ని రాజకీయ పార్టీలు కలసి కట్టుగా ముందుకు రావాలని, ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకునేదాక పోరాటాలు ఉదృతం చేయాలని అఖిలపక్ష సమావేశంలో పలువురు వక్తలు డిమాండ్ చేశారు. జీ ఓ అమలయితే హైదరాబాద్ కు పునాదిగా ఊపిరితిత్తులుగా ఉన్న జంట జలాశయాలు మురికి కూపాలుగా మారతాయని ఆందోళన వ్యక్తం చేశారు. జీ ఓ 111 ను ఎందుకు ఎత్తివేయాలో ఎంత హేతుబద్దమో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ సోషల్ మీడియా ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం జీ ఓ 111ను రద్దును నిరసిస్తూ గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాలను కాపాడుకుందాం అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అఖిల పక్షం సమావేశం తెలంగాణ సోషల్ మీడియా కన్వీనర్ దేశాయి కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్బంగా హాజరైన సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, సీపీఐ నాయకులు అజీజ్ పాషా, పశ్య పద్మ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, హుడా మాజీ చైర్మన్ కోదండరెడ్డి, సిపిఎం నాయకులు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహా రెడ్డి, పర్యావరణ శాస్త్రవేత్త సుబ్బారావు, దొంతు నర్సింహారెడ్డి, ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి, న్యాయ నిపుణులు సునీల్, టీజెఎస్ నాయకులు వెంకట్ రెడ్డిలు మాట్లాడుతూ ప్రతిపక్షాలను సంప్రదించకుండా ఏక పక్షంగా ఇటీవల సిఎం కెసిఆర్ అసెంబ్లీలో 111 జీవో రద్దు చేస్తామని ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్నికల ముందర ప్రభుత్వాలు 111 జీ ఓ ఎత్తివేసే ప్రస్తావన తీసుకొస్తాయని, 2014 నుంచి సిఎం కెసిఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 111 జీ ఓ రద్దుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడని మండిపడ్డారు. 111 జీవోకు సుధీర్ఘ చరిత్ర ఉందన్నారు. చెరువులను రక్షిస్తామంటున్న కెసిఆర్ ఏ విధంగా రక్షిస్తారో ప్రజలకు చెప్పాలన్నారు. ఉమ్మడి ఆంధప్రదేశ్ లో పాలకులు 111 జీవో వైపు చూడలేదు. 84 గ్రామాల్లో 70 శాతం ప్రజలకు భూములు లేవన్నారు. కొంత మంది భూ స్వాముల ప్రయోజనాల కోసం లక్షల మంది ప్రజలహక్కులు సిఎం కెసిఆర్ కాలరస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలో చెరువులు, కుంటలు, శిఖం భూములు యదేచ్చగా అన్యాక్రాంతం అవుతున్నాయని అన్నారు.
తెలంగాణలో ఉన్న ముఖ్యమైన చెరువులను ఇంటర్ నేషనల్ కన్వెన్షన్ పరిధిలోకి తేవాలన్నారు. చెరువుల సంరక్షణకు ప్రత్యేక చట్టాలు తేవాల్సిన అవసరం ఉందన్నారు. పల్లెల్లో చెరువుల కింద వ్యవసాయం చేసేందుకు ఏక్ సాల్ పట్టా ఇవ్వని ప్రభుత్వం 111 జీ ఓ రద్దుకు ఏ విధంగా అనుమతించిందో చెప్పాలన్నారు. పల్లెల్లో ఉన్న 50 వేల చెరువులను ప్రస్తుత చట్టాలు కాపాడలేవని, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మాదిరిగా లేక్ ప్రొటక్షన్ యాక్ట్ తీసుకురావాలన్నారు. ప్రజా వ్యతిరేకత వస్తున్నప్పుడు ప్రభుత్వం నిర్ణయాలు సమీక్షించుకోవాలన్నారు. ప్రజా ఉద్యమాలు ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రత్యామ్నాయాలు చేసి ప్రజల్ని సంతృప్తి చూపకుండా జీవో రద్దు సరికాదన్నారు. రాష్ట్ర ప్రజల్ని, పకృతిని, కొండలను, చెరువుల్ని పరిరక్షించే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అభివృద్ధి పేరుతో పర్యావరణానికి నష్టం చేయడం సరైంది కాదన్నారు.
సుప్రీం కోర్టు అనుమతి లేనిదే చిన్న కుంట ఐనా పూడ్చరాదని చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలో తొక్కేస్తున్నారన్నారు. మూల ప్రయోజనాలు దెబ్బ తీసే విధంగా ప్రభుత్వం పని చేస్తుందని, పర్యావరణహిత భూ వినియోగాన్ని తీసుకురావాలని, ఇందుకు కొత్త జీవోలు తేవాలన్నారు. 84 గ్రామాలను 111 జీవో నుంచి మినహాయించేందుకు సర్వే చేపట్టాలన్నారు. వ్యవసాయం చేసుకునే రైతులకు హక్కులు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నేతలు, పర్యావరణ వేత్తలు, సీనియర్ జర్నలిస్టులు, న్యాయవాదులు, మేధావులు దిలీప్ కుమార్, పల్లె రవి, శారద గౌడ్, అంజయ్య, ప్రవీణ్, కల్లూరి శ్రీనివాస్ రెడ్డి, శ్రీశైలం, శంకర్ తదితరులు పాల్గొని ప్రసంగిచారు.