Take a fresh look at your lifestyle.

ఈ ‌నేల ధిక్కార స్వరం కాళోజీ

( నేడు కాళోజీ జయంతి  పురస్కరించుకొని తెలంగాణా భాషాదినోత్సవ సందర్భంగా….)

కాళోజీ
పందొమ్మిది వందల పదునాలుగు సెప్టెంబర్‌ ‌తొమ్మిదిన
ప్రపంచమంతా యుద్ధభూమై
ప్రజలంతా  భయము లో ఉండగా
నేనున్నానని
అభయహస్తమిస్తున్నట్లు
ఈ నేలపై పుట్టిన ధిక్కార స్వరం

పుట్టుక ఏ మూలనైతేనేమి
అనుబంధమంతమంతా హనుమకొండ వరంగల్‌ ‌తో అల్లుకొని
అంతిమంగా అన్యాయాన్ని ఎదిరించే తెలంగాణ పోరు కెరటమయ్యారు
కాగితాలు కలమే ఆస్తిగా  చేసిన కవన సేద్యంలో
మధించిన మస్తిష్కాలకు లెక్కదొరకదు

ఏగూడులో అలజడి రేగినా
ఏ గుండెలో బడబాగ్నులు రగిలిన
తన హృదిలో వేదన గా తపించిన తండ్లాట ఆయనది

సమరశీలతే వ్యక్తిత్వంగా ఎదిగిన మేరు శిఖరం

సకల జనుల గోడులన్నీ
తనగొడవలుగా భుజాన వేసుకొని
తరలివెళ్ళే బాటసారి

నిజాము నియంతృత్వం
రజాకార్ల రాక్షసత్వానికి రగలి పోయి
కాలంబు రాగానే కాటేయాలన్న వ్యూహరచనకు దర్పణం

నీనా భావన లేకను సమ భావం కొరకు
జీవ నదిలా పారిన సంఘజీవి

ఆకలి కేకలు అలసిన దేహాలు
మాసిన తలల వెనుకనున్న మర్మాన్ని విప్పిజెప్పిన సామ్యవాది

రేపటి ఉదయం కొరకు నిరాశ పడకుండా
కాలం వెంట పరుగులు పెట్టించిన
కర్తవ్యబోధకుడు

తేట తెలుగు తెలంగాణ భాషను
తౌరక్యాంధ్రమన్న వాని తాట తీసేలా
జీవభాషలో జిద్దుగా గిట్లనే రాస్తమన్న  మొండితనం

అమ్మభాషను ఈసడించిన అధములు బతకడమే దండుగన్న భాషాభిమానం

కవితలే గాదు కథలందున జనం వెతలను అక్షరీకరించి
లక్షల మెదళ్ళను కదిలించిన అక్షర సైనికుడు

గిట్లా కదిలస్తే
కాళోజీ నాగొడవ
సబ్బండ వర్ణాల సమస్యల తోరణం
ఉరకలువేసే ఉద్వేగాలకు దారి జూపే రణ నినాదం

అధికారాన్ని అవకాశవాదాన్ని
అహాంకారాన్ని  అసమర్థతలను
కుల్ల కుల్లగా ఎత్తి చూపిన  సత్య వాక్కుల సమాహారం

ఆయన కనబడటానికి
అందరివాడులా నున్న
మాటతప్పిన వాళ్ళకు
హక్కుల హాననముకై పాల్పడే
నియంతలకు
కుతంత్రాలతో కుర్చీ కొరకు
ఎత్తులు వేసే జిత్తులమారితనానికి
మోహమాటం లేకుండా మొట్టి కాయలు వేస్తూనే ఉంటడు

కాళోజీని కౌగిలించు కోవడమంటే
కన్నీటిస్పర్శలో ఓలాడటం
అధికారమదాంధమును తూలనాడటం
ధిక్కారాన్ని ముద్దాడటం
దోపిడికి ద్రోహాబుద్దికి సమాధి కట్టడం

ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవడం
అవినీతిని అంతంచేయడం
ప్రజల భాషకు పట్టం కట్టడం

గిట్ల ఆలోచించి ఆచరణలో చూపడమే
ఆయనకు మనమిచ్చే
నిజమైన నిఖార్సైన నివాళి.

– గన్‌ ‌రెడ్డి ఆదిరెడ్డి, 9494789731

Leave a Reply