Take a fresh look at your lifestyle.

ఇళ్లను శుభ్రం చేసే పనిలో గ్రామస్థులు

  • ఏ వస్తువూ వినియోగించరాదన్న అధికారులు
  • పారిశుధ్య కార్మికులతో వీధుల క్లీనింగ్‌
  • ‌విశాఖకు మేఘాద్రి నీటి నిలిపివేత

విశాఖపట్నం,మే 12 : ఎల్‌జీ పాలిమర్స్ ‌గ్యాస్‌లీక్‌ ‌ప్రభావిత గ్రామాల్లో స్టైరిన్‌ ‌రసాయన విషవాయువు అవశేషాల తొలగింపు కార్యక్రమానికి జీవీఎంసీ అధికారులు శ్రీకారం చుట్టారు. అలాగే ప్రజలు కూడా ఎవరికి వారు తమ ఇళ్లను శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు. ఇక్కడ నీడకూడా తాకరాదంటూ అధికారులు హెచ్చరించడంతో ఇప్పుడు వారు తిండికోసం ఇతరులపై ఆధారపడ్డారు. ఉన్న సరుకులను చెత్తకుప్పల్లో వేస్తున్నారు. మరోవైపు గ్యాస్‌ ‌ప్రభావాన్ని తొలగించేందుకు సుమారు 500 మంది పారిశుధ్య కార్మికులు పనులు చేస్తున్నారు. ప్రతి ఇంటిని శుభ్రం చేయడానికి అవసరమైన నీటి కోసం 25 వాటర్‌ ‌ట్యాంకర్లను వినియోగించారు. ఐదు గ్రామాల్లో అన్ని రహదారులు, డ్రైనేజీ కాలువను శుభ్రం చేశారు. ప్రతి ఇంటి బయట గోడలకు హైడ్రో క్లోరోఫిన్‌ ‌పిచికారీ చేశారు. తరువాత ఇంటి లోపల గోడలు, కిటికీలు, ఎ•-లోరింగ్‌…ఏ ‌ప్రదేశాన్ని వదలకుండా స్పే్ర చేశారు. ఈ పక్రియ తరువాత ఇంటి తలుపులు, కిటికీలను కనీసం ఐదారు గంటలు తెరిచి వుంచాలని జీవీఎంసీ కమిషనర్‌ ‌సృజన ప్రజలకు సూచించారు. దీనివల్ల ఇంటిలో ఏ మూలలోనైనా స్టైరిన్‌ ‌గ్యాస్‌ ‌వుండిపోతే బయటకు వస్తుందన్నారు.

గ్యాస్‌ ‌లీక్‌ ‌సమయంలో ఇళ్లలో వున్న కూరగాయలు, పండ్లను వినియోగించవద్దని, వాటిని బయట పడవేయాలని చెప్పారు. గాలి చొరబడకుండా మూతపెట్టిన నిత్యావసర సరకులు తప్ప మిగిలిన వాటిని వాడొద్దని సూచించారు. ఐదు గ్రామాల్లో ప్రతి ఇంటినీ నీటితో శుభ్రం చేయడానికి రెండు మూడు రోజులు పడుతుందని అధికారులు భావిస్తున్నారు. గ్యాస్‌ ‌తీవ్రతకు మాడిపోయిన చెట్లు, ఇతర వ్యర్థాలను తొలగించారు. మరోవైపు విశాఖ నగరానికి తాగునీరు అందించే మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ ‌నీరు కూడా కలుషితమైంది. గ్యాస్‌ ‌లీకైన గ్రామాలకు ఆనుకుని ఉన్న మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌లో నీరు కలుషితమైందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో నగరానికి నీటి సరఫరా నిలిపివేశారు. నాగపూర్‌లోని నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ‌రీసెర్చి ఇనిస్టిట్యూట్‌(‌నీరి) నిపుణుల బృందం ఇక్కడ తనిఖీ చేసింది. రిజర్వాయర్‌లో నీటి శాంపిల్స్ ‌తీసి నాగపూర్‌ ‌పంపారు. నాగపూర్‌లోని నీరి లేబొరేటరీలో నీటిని పరీక్షించి నివేదిక రావడానికి మూడు రోజులు పట్టే అవకాశం ఉంది. అందువల్ల తాము చెప్పే వరకు రిజర్వాయర్‌ ‌నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించవద్దని జీవీఎంసీ అధికారులకు నీరి నిపుణుల బృందం స్పష్టం చేసింది.ఎల్‌జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ ‌లీకేజీ సంఘటన నేపథ్యంలో మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ ‌నుంచి నీటి సరఫరా నిలిపివేసి ఏలేరు కాలువ నీటిని పరిశ్రమలు, తాగునీటికి తరలిస్తున్నామన్నారు.

Leave a Reply