Take a fresh look at your lifestyle.

తెలంగాణ ప్రజల విజయం…

“ఈజిప్టులోని తహ్రీర్‌ ‌స్క్వేర్‌ ‌వద్ద జరిగిన లాంగ్‌ ‌మార్చ్ ఈజిప్టు ప్రజలకు స్వాతంత్రాన్ని తెచ్చిపెడితే హైదరాబాద్‌ ‌బుద్దుడి సాక్షిగా జరిగిన మిలియన్‌ ‌మార్చ్ ‌తెలంగాణ ప్రజలకు ఎన్నాళ్లయినా ఉద్యమం చేసే స్పూర్తిని నింపింది. పాలకులు ఎంత నిర్బంధం విధిస్తే అంతగా ఉద్యమం ఉధృతం అవుతుందని మిలియన్‌ ‌మార్చ్ ‌మరోసారి నిరూపించింది. తెలంగాణ ప్రజలకు పోలీసులు నిర్బంధాలు కొత్తవేమీ కావని,ఉద్యమాన్ని ఎంతగా అణిచివేస్తే అంత కసిగా విజృంభిస్తారని మార్చ్ ‌రుజువుచేసింది. పాలకులు ఇప్పటికైనా గుర్తెరిగి తెలంగాణ ప్రజల ఆకాంక్షకు విలువనివ్వాలి..”

మార్చి 10,2011.. ‘ప్రజాతంత్ర’సంపాదకీయం

బారీకేడ్లను దాటుకొని… పోలీసు రక్షణ వలయాలను చేధించుకొని… తెలంగాణ ప్రజలు హైదరాబాద్‌ ‌నడిబొడ్డున ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ జెండాను రెపరెపలాడించారు. బైండోవర్లు… ముందస్తు అరెస్టులు.. లాఠీలు… తూటాలు… భాష్పవాయి ప్రయోగాలు, ఇవేవి తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర వాంఛను నిలువరించలేకపోయాయి. వేలమంది పోలీసులు మోహరించినా, తమ ప్రాణాలను పణంగా పెట్టయినా విజయవంతం చేస్తామని చెప్పినట్లుగానే సమైక్యవాదుల గుండెల్లో దడ పుట్టేలా మిలియన్‌ ‌మార్చ్‌ను సక్సెస్‌ ‌చేసారు తెలంగాణ వాదులు. ఇది నిజంగా తెలంగాణ ప్రజల విజయం. వారం రోజుల నుండే తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తూ హైదరాబాద్‌కు రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నా జిల్లాల నుండి వేలదిమంది తెలంగాణ వాదులు నగరానికి చేరుకొని మార్చ్‌లో పాల్గొన్నారు.

రెండు రోజుల ముందుగానే హైదరాబాద్‌కు చేరుకొని మిలియన్‌ ‌మార్చ్ ‌విజయవంతానికి వ్యూహాలు రచించుకున్నారు. ఓయూ విద్యార్థులు కూడా పోలీసుల నిర్బంధం నుండి తప్పించుకొని ట్యాంక్‌బండ్‌కు చేరుకునేందుకు నానా యాతన పడ్డారు. చివరకు మార్చ్‌లో పాల్గొని తమ సత్తా చాటారు. మిలియన్‌ ‌మార్చ్‌కు కలిసి వొచ్చిన రాజకీయ నాయకులను అక్కున చేర్చుకున్నారు. రాజీనామాలు చేయకుండా తెలంగాణ తామే తెస్తామంటూ ప్రగల్భాలు పలికే నాయకులను తరిమికొట్టారు. అందుకు కేకే, మధుయాష్కీలపై దాడి చేసారు. ఒకవైపు తెలంగాణలో విద్యార్థుల బలిదానాలు జరుగుతున్నా, ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నా కాంగ్రెస్‌ ‌పార్టీ ఏమీ తేల్చకుండా తెలంగాణ ప్రజలతో నాటకాలు ఆడుతుంటే, అధిష్టానాన్ని గట్టిగా ఎదురించలేని ఎంపీలపై విద్యార్థులు తమ ఆక్రోషాన్ని వెళ్లగక్కారు. తెలంగాణ ఎంపీలపై దాడి ఖండించదగినదే అయినా తెలంగాణపై ఇంకా తాత్సారం చేస్తే తెలంగాణలోని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఇదే గతి పడుతుందని విద్యార్థులు చెప్పకనే చెప్పినట్లున్నారు.

ఈజిప్టులోని తహ్రీర్‌ ‌స్క్వేర్‌ ‌వద్ద జరిగిన లాంగ్‌ ‌మార్చ్ ఈజిప్టు ప్రజలకు స్వాతంత్రాన్ని తెచ్చిపెడితే హైదరాబాద్‌ ‌బుద్దుడి సాక్షిగా జరిగిన మిలియన్‌ ‌మార్చ్ ‌తెలంగాణ ప్రజలకు ఎన్నాళ్లయినా ఉద్యమం చేసే స్పూర్తిని నింపింది. పాలకులు ఎంత నిర్బంధం విధిస్తే అంతగా ఉద్యమం ఉధృతం అవుతుందని మిలియన్‌ ‌మార్చ్ ‌మరోసారి నిరూపించింది. తెలంగాణ ప్రజలకు పోలీసులు నిర్బంధాలు కొత్తవేమీ కావని, ఉద్యమాన్ని ఎంతగా అణిచివేస్తే అంత కసిగా విజృంభిస్తారని మార్చ్ ‌రుజువుచేసింది. పాలకులు ఇప్పటికైనా గుర్తెరిగి తెలంగాణ ప్రజల ఆకాంక్షకు విలువనివ్వాలి. ప్రభుత్వం ఇప్పటికైనా తెలంగాణపై నిర్ణయం తీసుకోకుంటే ఈసారి మిలియన్‌ ‌మార్చ్ ‌సీమాంధ్రులు నివసించే జూబ్లీహిల్స్‌లో జరుగుతుందని అడ్వకేట్‌ ‌జెఎసి చెప్పింది. అదే జరిగితే ఇప్పటికే ప్రాంతాల వారిగా విడిపోయిన ప్రజల మధ్య వైషమ్యాలు పెచ్చరిల్లే ప్రమాదముంది.

తెలంగాణ ప్రజలు వేలాదిగా పాల్గొని విజయవంతం చేసిన మార్చ్‌పై సీమాంధ్ర విషపు ప్రచారం చేసింది. జరగని సంఘటనలు జరిగినట్లు, తెలంగాణ ఉద్యమాన్ని ఒక అల్లరిమూకల ఉద్యమంలా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేసింది. అందుకే రెచ్చిపోయిన కొందరు విద్యార్థులు సీమాంధ్ర మీడియా వాహనాలపైన దాడి చేసారు. మిలియన్‌ ‌మార్చ్‌లో భావోద్వేగానికి గురైన సంపత్‌ అనే యువకుడు ట్యాంక్‌బండ్‌పైనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసి దవాఖానా లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. మీడియాపై దాడి ఆక్షేపణీయమైనా ఇలాంటి సమయంలో సీమాంధ్ర మీడియా సంయమనం పాటించకుండా తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా వార్తలు ప్రసారం చేస్తే తెలంగాణ వాదుల ఆగ్రహానికి గురికాకతప్పదు. ఎన్నో అవాంతరాల మధ్య మొదలైన మిలియన్‌ ‌మార్చ్ ఎట్టకేలకు విజయవంతంగా ముగిసి తెలంగాణ వాదుల్లో నూతనోత్సాహాన్ని నింపింది.

Leave a Reply