Take a fresh look at your lifestyle.

గెలుపు మనదే…

“మీరు రణరంగంలోకి
రాకుండా ఉండాలంటే
హతం కాకూడదంటే
అవగాహనతో మెలుగుతూ
వ్యక్తి దూరం, పరిశుభ్రత పాటిస్తే సరి
నాలుగ్గోడల మధ్యే హాయిగా
పిల్లాపాపల ఆటపాటలతో
సరదా సరదా కాలక్షేపాలతో
సరి కొత్త వ్యాపకాలతో
కుటుంబమంతా సందడి చేయండి
సంబురం చేసుకోండి
మాకులేని అవకాశం మీకుంది
దాన్ని ఫలవంతం చేసుకోండి “

shanthi prabhodha
వి . శాంతి ప్రబోధ

ఆ ప్రాంతమంతా రణ రంగం నుండి
తరలిన క్షతగాత్రులతో ..
గుట్టలు గుట్టలుగా పోగవుతున్న దేహాలు
జీవంగా.. నిర్జీవంగా..
జీవం పోస్తారనుకున్న దేవుళ్ళు భయంతో
తలుపులు మూసుకుంటే
ప్రాణం నిలిపే సంజీవనులై వైద్య బృందం..
రోబోల్లా..రేయింబగళ్లు బాధితుల సేవలో

చిరునవ్వులు పూసే ఆమె
వాడిన తోటకూర కాడలా వేలాడిపోతూ
దేహాపు అలసట తీర్చడం కోసం
అత్యవసర వార్డుకీవల కొన్ని క్షణాలు
కుప్ప తెప్పలుగా వచ్చిపడుతున్న
పాజిటివ్‌లు ..ఎగశ్వాస దిగశ్వాసతో
కొందరు, బంధాల బంధనాలు తెంపుకుని
అనాథల్లా పయనమైపోతూ ..
అవే దృశ్యాలు ..
రోజుల తరబడి అవే దృశ్యాలు
చూసీ చూసీ మనసంతా శూన్యంగా..
దేహమంతా నిస్సత్తువతో ..
తనలాగే ఇతర వైద్యులు .. వైద్య సిబ్బంది
సూర్యోదయాలు అస్తమయాలు తెలీకుండా
గడియారం ముల్లులా.. పనిచేస్తూనే ..

ఏంటమ్మా .. అలా ఉన్నావ్‌
‌సీనియర్‌ ‌పలకరింపుతో లోపల
గూడుకట్టుకున్న దుఃఖం
కట్టలు తెంచుకొని అలలు అలలుగా ఎగిసిపడింది
మాసిన బట్టలతోనే ఆమెను చుట్టుకుపోయింది .
ఆత్మీయ స్పర్శ పంచుకునే తోడు కోసం
తపించిపోతున్నారేమో .. ఇద్దరూ
ఒకరినొకరు ఓదార్చుకుంటూ
గుండె బరువు తీర్చుకుంటూ
కారిడార్లో ఓ మూల కూలబడ్డారు

ఆమె అమాసకో పున్నానికో
వెనుక వాకిట్లోంచి ఇంట్లోకి చేరి
బరిబాతై బట్టల్ని వాషింగ్‌
‌మిషన్దొ వేసి, అంటుకున్నవన్నీ
శానిటైస్‌ ‌చేసి, తలారా వేడినీటి
స్నానం చేసినా ఐసొలేట్‌.. అయినవాళ్లకు
ఆరడుగుల దూరంలో కలిపే మాటలు
మీదకురికే మూడున్నరేళ్ల చిట్టితల్లి
ఏమీ తినడంలేదని జతగాడి ఫిర్యాదు ..
అతని చూపులో చూపు కలపలేక
తినమ్మా .. మా బంగారం కదా ..
నీకేం కావాలి చెప్పు ..పప్పు ..ఆమ్లెట్‌
ఊహూ .. నువ్వే .. కావాలి
మమ్మీ.. హగ్గీ ప్లీజ్‌ ..

ఎదుట ఉన్న వారి స్పర్శ
అందుకోలేనంత దూరంలో
ఏకాకిలా.. ఆమె గుండె బద్ధలైంది
యూస్‌ అం‌డ్‌ ‌త్రో
భోజనంప్లేటు చేజారిపోయింది
ఐదేళ్ల కొడుకు వేసే ప్రశ్నల వర్షం ..
పెద్దరికంతో అందించే జాగ్రత్తల గుచ్ఛం ..
చూసి మురిపెంతో వాడి బుగ్గల్ని పుణికి
గుండెలకు హత్తుకోవాలన్న బలమైనకోరికకు
కళ్లెం వేయలేక సతమతమవుతూ ..

శారీరకంగా బలహీన పడుతున్న ఆమె
ఏ ఏమరుపాటు క్షణాన
శత్రువు దాడి చేస్తుందో
ఏమయి పోతుందోననే బెంగతో అతను
ఆ స్థితిని దాటవేసే ప్రయత్నంలో
రాని నిద్రను తెచ్చుకుంటూ
నలిగిన హృదయంతో గుడ్‌ ‌నైట్‌లు
ఫ్లయింగ్‌ ‌కిస్‌లతో భారమైన హృదయం

పిల్లలు పడుకున్నాక
కాసేపు మనసుకు సాంత్వననిచ్చే
కబుర్లు కలబోసుకోవాలని
ఆత్మీయ స్పర్శతో సేదతీరాలని
మనసుపడే ఆరాటం ..
కానీ ఎలా..ఎలా
ఎన్నాళ్లిలా.. ఏమో
క్యాలెండరులో తేదీలు, నెలలు
కదిలిపోతున్నాయి ..

మిత్రులారా ..
నాలాటి వాళ్ళ తరఫున మీకో విన్నపం
యుద్ధభూమిలో మీ వైపున నిలబడి
పోరాటం చేస్తున్న సైనికుల
మాట వింటారు కదూ..

మీరు రణరంగంలోకి
రాకుండా ఉండాలంటే
హతం కాకూడదంటే
అవగాహనతో మెలుగుతూ
వ్యక్తి దూరం, పరిశుభ్రత పాటిస్తే సరి
నాలుగ్గోడల మధ్యే హాయిగా
పిల్లాపాపల ఆటపాటలతో
సరదా సరదా కాలక్షేపాలతో
సరి కొత్త వ్యాపకాలతో
కుటుంబమంతా సందడి చేయండి
సంబురం చేసుకోండి
మాకులేని అవకాశం మీకుంది
దాన్ని ఫలవంతం చేసుకోండి

స్మాల్‌ ‌పాక్స్, ‌పోలియోలను
అద్భుతంగా తరిమి కొట్టిన అనుభవంతో
ఈ మహమ్మారిని నిర్ములించే సత్తా, సామర్థ్యం
మన దేశానికి ఉన్నాయన్న భరోసా ఇవ్వండి
ఎల్లవేళలా మీ సేవలో మేముంటాం
గెలుపు మనదే.. రేపు మనదే ..

(కోవిద్‌ -19 ‌పై చేస్తున్న యుద్ధంలో క్రమశిక్షణాయుతమైన సైనికుల్లా సేవలందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది కోసం)

Leave a Reply