రాజేందర్ హెచ్చరిక
ఓ వైపు అచ్చంపేటలోని రాజేందర్‌కు చెందిన జమున హ్యాచరీస్‌లో సిఎం కేసీఆర్ ఆదేశాలతో విజిలెన్స్, రెవెన్యూ అధికారులు భూమిని సర్వే చేస్తున్న సమయంలోనే ఈటల రాజేందర్ మీడియా ముందుకు వచ్చారు. తన వైద్య శాఖను తొలగింపుపై స్పందించారు. తన శాఖను తొలగించి సిఎం కేసీఆర్ బదిలీ చేయించుకున్నట్లు తెలిసిందనీ, చాలా సంతోషమన్నారు. కేసీఆర్‌కు సిఎంగా సర్వాధికారాలుంటాయనీ, ఎప్పుడైనా ఎవరినైనా మంత్రిగా తొలగించే అధికారం ఉటుందన్నారు. అయితే, తనకు మంత్రి శాఖ లేకపోయినా వ్యక్తిగతంగా ప్రజలకు ఎప్పుడు సేవ చేస్తూనే ఉంటాననీ అన్నారు. తొలుత అచ్చంపేటలో వందల ఎకరాల భూమి కబ్జాకు పాల్పడ్డట్లు చెప్పారనీ, ఇప్పుడు విచారణ జరుగుతుంది కదా…ఎన్ని ఎకరాలు కబ్జా చేసిందో తెలుస్తుందన్నారు. పూర్తి నివేదిక వచ్చాక తెలుసుకుని మిగతా విషయాలు మాట్లాడుతాననీ అన్నారు.
నా బాస్‌లు హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలేననీ వారందరితో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాననీ, అందరి అభిప్రాయంతో భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తానన్నారు. కానీ, ఒకటి మాత్రం నిజం నన్ను బదునాం చేయాలనుకునే వారు మాత్రం భవిష్యత్‌లో తగు మూల్యం మాత్రం చెల్లించుకోకతప్పదన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సిఎం కేసీఆర్‌ను కలిసే ప్రయత్నం చేయలేదనీ, ఇక కలవను కూడా అని రాజేందర్ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు.