Take a fresh look at your lifestyle.

నేడు రవీంద్రుని జయంతి

“దేశంలో గల అంతర్గత రుగ్మతలైన కుల, మతాల కుమ్ములాటాలను ఎప్పుడో ఊహించిన దార్శినికుడాయన. మతం మనిషిలో విభాజక హేతువు కారాదని వాదించాడు. మనిషిలో మానవత్వాన్ని పెంపొందించేలా ఉండాలని, పక్షపాత వైఖరిని విడనాడి స్వచ్చమైన వ్యక్తిత్వాన్ని ప్రభోదించేలా మతం తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని టాగూర్‌ ‌వాదిస్తాడు. మతం అనేది కేవలం ఒక మార్గమేనని, క్రమశిక్షణ, పారదర్శక జీవన విధానంతో కూడిన అలవాట్లను ఆచరించేలా మతం ఉండాలంటాడు. కులం, వర్ణం, వర్గం, వారసత్వం, సంస్కృతి, సాంప్రదాయాల వంటి ప్రాపంచిక అంశాలకతీతంగా అందరినీ ఆదరించేదిగా మతముండాలంటాడు.”

jayaprakash ankam
జయప్రకాశ్‌ అం‌కం

జ్ఞానవంతుని పుట్టుకకు ఎప్పటికీ ఒకరు కారణం కానేకాదు. ఎందుకంటే మేధస్సు సాధారణ నియమానికి గల మినహాయింపు యొక్క స్వభావం. అదే సమయంలో మనస్సులో అపస్మారక, ఉపచేతనల భావోద్వేగాలు మరియు సమాజంలోని ఆలోచనలకు వ్యక్తీకరణను కనుగొనడం మేధావి పని. విశ్వంలో జరిగే అద్భుతాలకు అర్థాలు చెప్పే వివేకవంతుడు తన భాష్యాలతో సాటి వ్యక్తులతో తెలియని బందాన్ని ముడివేసుకుంటాడు. రవీంద్రనాథ టాగూర్‌ ‌మేధావి మాత్రమే కాదు, నాటి సమాజాన్ని పీడిస్తున్న సాంఘీక దురాచారాలను నిరసించినా, గుర్తింపుకు నోచుకోని సంస్కర్త కూడా. టాగూర్‌ ‌తన పుట్టిన సమయం, ప్రదేశాలను బట్టి ఒకరకంగా అదృష్టవంతుడేనని చెప్పాలి. అప్పుడప్పుడే బ్రిటీష్‌ ‌ప్రభుత్వ ప్రత్యేక్ష పాలనతో భారతదేశమంతటా రాజకీయంగా, సాంస్కృతికంగా సమూలమైన మార్పులు సంభవిస్తున్నాయి. ఆ మార్పులకు దేశంలో కేంద్రస్థానం రవీంద్రుని జన్మస్థానమైన బెంగాల్‌ ‌కావడం విశేషం. రవీంద్రనాథ్‌ ‌ఠాగూర్‌ను కేవలం కవిగా చూస్తే సంకుచితమే అవుతుంది. ఆయన విశ్వమానవ వాదాన్ని ఖండాంతర వ్యాప్తి చేసిన ఆధునిక భారత రచయిత. గురుదేవ్‌ అని ప్రసిద్ది చెందిన రవీంద్రనాథ్‌ ‌ఠాగూర్‌ 1861 ‌మే 7న కోల్‌కతాలోని సామాజిక సంస్కరణోద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న నాయకుల కుటుంబంలో జన్మించాడు. కుటుంబ సభ్యులంతా ఆధునిక భావాలు గల ఆదర్శవాదులు. తన తండ్రి నుంచే సంఘ సంస్కరణల ఆవశ్యకతను గ్రహించిన ఠాగూర్‌ ‌భారతీయ సాంస్కృతిక రాయబారిగా భారతదేశ స్వరమయ్యాడు.

రవీంద్రుని రచనలన్ని సాధారణంగా లోతైన తాత్విక భావాలతో కూడుకుని కళా,సంస్కృతులను సమగ్రంగా ఆవిష్కరిస్తూ ఉంటాయి. భారతదేశాన్ని తన మాతృభూమిగా ఆరాదిస్తూనే ప్రపంచ మానవాళిని ఆదరించే విశ్వనరుడాయన. విశ్వమానవ సౌభ్రాతృత్వం, పరస్పర సహజీవనంల అవసరాన్ని నొక్కి చెబుతూ క్షమాగుణం ప్రవచించే ఆధునిక ప్రవక్త. మనిషిలోని జ్ఞానాన్ని గౌరవించినప్పుడు ఆయన ఎదుగుదలకు ప్రోత్సాహం ఉంటుంది. తన ఆలోచనలు, చర్యల కంటే ఎక్కువగా కవిగానే సమాజం మీద ప్రభావం చూపిన రవీంద్రనాథ్‌ ‌ఠాగూర్‌ ‌మనిషిలోని స్వాభావిక సామాన్యతను, నిష్క్రియాత్మకతను ఖండించాడు. ధ్యానం వంటి చర్యల ద్వారా తన స్వంత భావాలను లోతుగా పరిశీలించి మనిషిని ఒక సమున్నతపీఠంపై ఉంచాలని కలలుగన్నాడు. విశ్వమానవ తత్వాన్ని ఆకలింపు చేసుకునే క్రమంలో సార్వత్రిక వ్యక్తిత్వాన్ని ఆపాదించుకున్నాడు. సత్యం, సత్కార్యాల గొప్పతనాన్ని వెతకడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితులలో కూడా మానవాళిని ఎలా ప్రేమించాలో ఆయనకు తెలుసు. మనిషి యొక్క అత్యంత ప్రాముఖ్యమైన ప్రాథమ్యాల మీద ఠాగూర్‌ ‌పూర్తిస్థాయి వివేచనను ఏర్పరుచుకున్నాడు. జంతువును అధిగమించిన మనవుని స్వభావం ఆయన ఆదర్శంతో పెరుగుతుంది, ఇది భౌతిక ప్రపంచంలో స్పష్టంగా కనిపించనప్పటికినీ భౌతిక జీవితానికి అత్యవసరమని రవీంద్రుడు ఉద్ఘాటించేవాడు. ఒక వ్యక్తి తన నిస్వార్థమైన ఆలోచనలతో ఇతరుల కోరికలను నెరవేర్చినప్పుడు, తద్వారా లభించే అలౌకిక ఆనందమే ఆయనలోని విశ్వమానవ భావానికి ప్రతీక. ఈ ఆలోచనలతో తనకు సంబంధం లేకుండా వాటికి వ్యతిరేక దిశలో తన గమనాన్ని నిర్దేశించుకున్నప్పుడు తనలోని ఆటవికుడుకి ఆ మనిషి ఇంకా జీవం పొస్తున్నట్టేనని అంటాడు.

దేశంలో గల అంతర్గత రుగ్మతలైన కుల, మతాల కుమ్ములాటాలను ఎప్పుడో ఊహించిన దార్శినికుడాయన. మతం మనిషిలో విభాజక హేతువు కారాదని వాదించాడు. మనిషిలో మానవత్వాన్ని పెంపొందించేలా ఉండాలని, పక్షపాత వైఖరిని విడనాడి స్వచ్చమైన వ్యక్తిత్వాన్ని ప్రభోదించేలా మతం తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని టాగూర్‌ ‌వాదిస్తాడు. మతం అనేది కేవలం ఒక మార్గమేనని, క్రమశిక్షణ, పారదర్శక జీవన విధానంతో కూడిన అలవాట్లను ఆచరించేలా మతం ఉండాలంటాడు. కులం, వర్ణం, వర్గం, వారసత్వం, సంస్కృతి, సాంప్రదాయాల వంటి ప్రాపంచిక అంశాలకతీతంగా అందరినీ ఆదరించేదిగా మతముండాలంటాడు. ఆ ఆదర్శాలతో తన విశ్వభారతి విశ్వమానవాళిని అక్కున చేర్చుకునే సార్వత్రిక నిలయం కావాలని ఆయన ఆకాంక్షించాడు. స్వేచ్ఛాయుత వాతావరణంలో మనిషి తన ఆలోచనలకు పదును పెడతాడు. సృష్టించడానికి, విమర్శించడానికి, పెరుగుదలకు, అభివృద్ధికి మనిషికి స్వేచ్చనివ్వాలని ఆయన సూచిస్తాడు. ఒక అస్థిరమైన విధానంలో మానవున్ని స్థిరంగా నియంత్రించడం ద్వారా మనిషి తన జీవనవృద్ధి నియమాలను ఉల్లంఘించాడని ఠాగూర్‌ ‌మానవునిలోని ఆధిపత్య దోరణిని విమర్శిస్తాడు.

రవీంద్రుని ప్రతి రచనలోనూ ఏదో ఒక సామాజిక కోణం అంతర్లీనంగా ఉండి పాఠకులను ఆలోచనలో పడేస్తుంది. ఆయన తన పదహారవ ఏట రచించిన బికారిన్‌ ‌కథలో నాటి సామాజిక స్థితిగతులను వివరించాడు. 1881లో ఆయన రచించిన వాల్మీకి ప్రతిభ నాటకం ఆ కాలంలో ఒక సాహిత్యపరమైన విప్లవం. శూద్రుడైన రత్నాకరుడు వాల్మీకిగా మారి రామాయణం రచించిన విధానంతో విద్య ఎవరి సొత్తు కాదని తన ఉద్దేశాన్ని స్పష్టం చేశాడు. 1882లో ఆయన రచించిన కాబూలీవాలా కథ అత్యంత హృద్యంగా ఉండి మనసులను మెలిపెడుతుంది. ఎండు పళ్ళు అమ్ముకునే కాబుల్‌కు చెందిన హజారా వ్యాపారికి, కలకత్తాలోని చిన్నారి మిని మధ్య గల బాంధవ్యాన్ని హృద్యంగా చెప్పిన కథ ఇది. హిందూ ముస్లీం వైశమ్యాలను సైతం సునిశితంగా విమర్శించిన ఈ కథ ఇప్పటికి ఆకట్టుకుంటూనే ఉంది. 1903లో ఠాగూర్‌ ‌రచించిన చోకర్‌ ‌బాలి నవల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. స్త్రీ విద్య నిరాకరణ, బాల్యవివాహం, పితృస్వామ్య వ్యవస్థలోని పెద్దరికం మీద అప్పుడే ఎక్కు పెట్టిన సాహిత్య అస్త్రం ఇది. ఆయన 1905లో రచించిన అమార్‌ ‌సోనార్‌ ‌బంగ్లా గీతం బంగ్లాదేశ్‌ ‌జాతీయ గీతంగా స్వీకరించబడింది. 1911లో ఠాగూర్‌ ‌విరచిత భారతో భాగ్యో బిధాతో నుండి తీసుకున్న జన గణ మన గీతం మనదేశ జాతీయగీతంగా గౌరవం పొందింది. భారతో భాగ్యో బిధాతో సుభాష్‌ ‌చంద్రబోస్‌ ఏర్పరిచిన తాత్కాలిక ప్రభుత్వానికి సైతం జాతీయ గీతంగా ఉండడం విశేషం. శ్రీలంక జాతీయగీతమైన శ్రీలంక మాతకు కూడ ఠాగూర్‌ ‌గీతాలే స్పూర్తి. గోరా నవల రవీంద్రునిలో తాత్విక కోణాన్ని ఆవిష్కరించిన రచన. బ్రిటీష్‌ ‌పాలనాకాలం నాటి మతం, రాజకీయాల మీద సున్నితమైన విమర్శనాస్త్రాలు సంధించిన ఈ నవల రవీంద్రుని రచనలకెళ్ళా సుదీర్ఘమైనది. 1910లో ఆయన రచించిన గీతాంజలి బారతదేశ ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాప్తి చేసింది. నోబెల్‌ ‌సాహిత్య బహుమతి పొందిన ఈ వచన కవిత సంకలనంలో 103 కవితలున్నాయి. బెంగాలీ సాహిత్యంలోనే తలమానికమైన రచనగా పేరొందిన శేశేర్‌ ‌కోబిత నవల 1929లో ప్రచురించబడి ఇప్పటికీ ఆదరణ పొందడం విశేషం. లెక్కకు మిక్కిలి రచనలు చేసిన ఆయన కవి,రచయిత, నవలాకారుడు, కథారచయితగా పేరొందిన బహుముఖప్రజ్ఞాశాలి. అంతేకాదు 1919 నాటి జలియన్‌ ‌వాలాబాగ్‌ ‌హత్యాకాండకు నిరసనగా తన నైట్‌ ‌హుడ్‌ అవార్డును తిరస్కరించిన బాధ్యతగల భారతీయుడాయన.

రవీంద్రనాథ్‌ ‌ఠాగూర్‌ ‌రాసిన నేషనలిజం ఆయనలోని జాతీయవాద కోణాన్ని ఆవిష్కరిస్తుంది. 1917లో మొదటిసారిగా ప్రచురించబడిన ఈ పుస్తకం సమకాలీన రాజకీయ స్వరూపాన్ని తెరమీదికి తెచ్చింది. రవీంద్రుడే స్వయంగా బెంగాలి నుంచి ఇంగ్లీషులోకి అనువదించిన ఈ గ్రంథంలో 1916లో ఆయన జపాన్‌లో చేసిన మూడు ఉపన్యాసాలను సైతం పొందుపర్చారు. ఠాగూర్‌ 1917 ‌నేషనలిజం ఎడిషన్‌ను అప్పటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్‌కు అంకితం చేయాలనుకున్నాడు. కాని బ్రిటీష్‌ ఇం‌డియాకు వ్యతిరేకంగా భారతీయ విప్లవాకారులకు(గదరైట్లు) అమెరికా ఆశ్రయమిస్తుందన్న కారణంతో తన ఉద్దేశాన్ని విరమించుకున్నాడు. ఠాగూర్‌ ‌పాశ్చాత్య జాతీయతా భావనను ఎన్నోసార్లు వేలెత్తిచూపాడు. ప్రజలకు రాజకీయ, ఆర్థిక అధికారాలను నిరోధించే ఏ జాతియభావమైన మనుగడ సాగించదని, ఇది ముగింపుకు ఆరంభమని వ్యాఖ్యానించాడు. మానవ సంబంధాలు పరస్పర సహకారంతో ముడిపడి ఉన్నాయని, వ్యక్తికి గల స్వేచ్చే సామాజిక అభివృద్ధికి కారణమని స్పష్టం చేశాడు.

ఠాగూర్‌ ‌తన సమకాలీనులైన మహాత్మా గాంధి , నెహ్రూ, ఆల్బర్ట్ ఐన్‌ ‌స్టీన్‌ ‌సుభాష్‌ ‌చంద్రబోసులతో సన్నిహితంగా ఉండేవాడు. వ్యక్తిగతంగా ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకున్నప్పటీని నెహ్రూ అంటే ప్రత్యేక అభిమానాన్ని కలిగి ఉండేవాడు. స్వదేశి ఉద్యమం అనంతరం ఆయనకు రాజకీయాల మీద ఉన్న భ్రమలు తొలిగిపోయాయి. అంతేకాదు జలియన్‌ ‌వాలాభాగ్‌ ‌దురంతం అనంతరం ఆయన నైట్‌ ‌హుడ్‌ ‌ను తిరస్కరించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమైంది. అదేసమయంలో భారతదేశంతో పాటు జపాన్‌, ‌చైనా, పశ్చిమ దేశాలలో జాతీయవాదం పేరుతో మితిమీరిన చర్యలను కూడా ఖండించాడు.గాంధి నాయకత్వంలోని సహాయ నిరాకరణోద్యం సమయంలో 1921 అక్టోబర్‌ ‌లో ‘‘ఏ కాల్‌ ఆఫ్‌ ‌ట్రూత్‌’’ ‌పేరుతో ఠాగూర్‌ ఒక వ్యాసాన్ని ప్రచురించాడు. అందులో గాంధి చూపించే చర్కా చిహ్నం ఏ విధంగా ఆర్థికంగా భారతదేశానికి ఉపయుక్తమని ప్రశ్నించాడు. విదేశి వస్తువులను బహిష్కరించడాన్ని కూడా ఠాగూర్‌ ‌నిరసించాడు. ప్రతి రంగంలో భారతీయ స్వయం సమృద్ధి యొక్క అవసరాన్ని గాంధీ నొక్కిచెప్పగా, అంతర్జాతీయ సహకారం మరియు భాగస్వామ్యం యొక్క అవసరాలు అనివార్యమని ఠాగూర్‌ ‌వాదించాడు. ఆధునిక యుగంలో భారతదేశం విదేశాల నుండి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధిలో పాశ్చత్య దేశాల సహకారం తప్పనిసరి అని అప్పుడే జోస్యం పలికాడు.

రెండవ ప్రపంచ యుద్ధం మానవ చరిత్రలో అతి ఘోరమైన ఘర్షణ. 1930 ప్రాంతంలో ఐరోపా దేశాలలో నెలకొన్న అతి జాతీయవాదమే ఈ ఘోరానికి కారణమని ఠాగూర్‌ ‌విశ్వసించాడు. చైనాపై జపాన్‌ ‌దాడిని, అంతకు ముందే ఇథియోఫియా మీద ఇటలీ దురాక్రమణ, బెల్జియం మీద జర్మని దండయాత్ర, చెకోస్లేవియాను వక్ర బుద్ధితో ఆక్రమించుకున్న యూరోపియన్‌ ‌దేశాల వైఖరీ పట్ల రవీంద్రుడు తీవ్రంగా కలత చెందాడు. ఒక దేశం మరో దేశం మీద చేస్తున్న దాడులు నాగరిక విలువల మీద దాడులని వాపోయాడు. ఆయన తన చివరి ప్రసంగమైన క్రైసిస్‌ ఇన్‌ ‌సివిలైజేషన్‌ (‌సభ్యతార్‌ ‌సంకట్‌) ‌లో రెండవ ప్రపంచ యుద్ధం పరిణామల పట్ల తీవ్రంగా భయందోళనలను వ్యక్తం చేశాడు. అతి జాతీయవాదం గురించి ఠాగూర్‌ ‌మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. సామాజికపరమైన దుష్ఫలితాలకు ఇది మూల బిందువవుతుందని, ఒక దేశం మరో దేశాన్ని శత్రు దేశంగా భావించే ప్రమాదం ఉన్నదని హెచ్చరించాడు. ఆధునిక కాలంలో మనిషి కనుగొన్న అతి గాఢమైన మత్తు పదార్థం జాతీయవాదమే అని విశ్వకవి విచారం వ్యక్తం చేశాడు.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జాత్యాహంకార దోరణులు పెరిగి వివక్ష విజృంభిస్తోంది. వర్గపోరుతో ప్రపంచం ఎప్పుడో ముక్కలైంది. భారతదేశం కూడ కులాల కుమ్ములాటలు, మతఘర్షణలతో తీవ్రమైన సంక్షోభంలో ఉంది. ఇప్పుడు ప్రపంచానికి రవీంద్రుని ఆశయాల అవసరం ఎంతైనా ఉంది. ఆయన వివరించిన మానవత్వపు విలువలు పాటించడం అనివార్యం. తన భోదనల సారాంశమైన విశ్వమానవ వాదమే ప్రపంచ శాంతికి భవిష్యత్తు కారకం. భారత దేశాన్ని ‘‘నిస్సహాయత నిండిన అపరిశుభ్రమైన బంజరు భూమి’’గా మార్చడానికి నేను అనుమతించను అన్న కవీంద్రుని మాటలే మనకు స్పూర్తి. చిమ్మచీకటిలో సైతం మనిషి పై విశ్వాసం కోల్పోవడం మహా పాపం అని ప్రభోదించిన రవీంద్రుడు నిజమైన విశ్వమానవుడు.

Leave a Reply