Take a fresh look at your lifestyle.

దేశ ఐకమత్యత, సమగ్రతలకు పెద్దపీట వేయాలి

  • భంగం వాటిల్లే చర్యల పట్ల చట్టసభలు అప్రమత్తంగా ఉండాలి
  • ప్రిసైడింగ్‌ అధికారుల సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న ప్రధాని

భారత దేశానికి స్వాతంత్య్ర వొచ్చి 100 ఏళ్ళు పూర్తి కాబోతున్న తరుణంలో అంతకుముందు రానున్న 25 సంవత్సరాల్లో ప్రతి వ్యక్తి తన కర్తవ్యాన్ని నిర్వహించడమే ఓ మంత్రమని, ఇది దేశాభివృద్ధికి దోహదపడుతుందని ప్రధాని మోడీ అన్నారు. ఈ సందేశం పార్లమెంటు, రాష్ట్రాల శాసన సభల నుంచి వెలువడాలన్నారు. దేశ ఐకమత్యం, సమగ్రతలకు విఘాతం కలిగించే చర్యల పట్ల చట్టసభలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పారు. ఇతరులపై రాజకీయపరమైన అనుచిత వ్యాఖ్యలు లేకుండా, శ్రద్ధగా, హుందాతనంతో చట్టసభల్లో నాణ్యమైన, ఆరోగ్యకరమైన చర్చల కోసం ప్రత్యేక సమయం కేటాయించాలని పిలుపునిచ్చారు. చట్ట సభల సభ్యుల ప్రవర్తన భారతీయ విలువలకు అనుగుణంగా ఉండాలని చెప్పారు. 82వ ఆలిండియా ప్రిసైడింగ్‌ ఆఫీసర్స్ ‌కాన్ఫరెన్స్ ‌సిమ్లాలో బుధవారం ప్రారంభమైంది.

ఈ సమావేశంలో మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్‌ ‌ద్వారా పాల్గొన్నారు. భారత్‌లో ప్రజాస్వామ్యం ఓ వ్యవస్థ కన్నా గొప్పదని, దేశ సమాఖ్య వ్యవస్థలో ప్రతి రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోడీ అన్నారు. దేశం కోసం పనిచేయాలన్న తపన ప్రతి ఒక్కరిలో ఉండాలని, రాబోయే 25 ఏళ్లలో ఆ కర్తవ్యంతో ప్రతి ఒక్కరు పనిచేయాలన్నారు. భారత్‌లో ఉన్న భిన్న సంస్కృతులు ఏకత్వం వల్లే పరిరక్షించబడుతున్నట్లు ఆయన చెప్పారు. చట్టసభల్లో నాణ్యమైన, ఆరోగ్యకరమైన చర్చల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించాలని ప్రధాని మోదీ సూచించారు. చాలా సిరీయస్‌గా, హుందాగా, రాజకీయాలకు అతీతంగా ఆ చర్చలు సాగాలన్నారు. చట్టసభ ప్రతినిధులు భారతీయ విలువలకు తగినట్లు ప్రవర్తించాలని ప్రధాని మోదీ సూచించారు. ఇటీవల పార్లమెంట్‌లో పదేపదే ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ కామెంట్‌ ‌చేసినట్లు తెలుస్తుంది. ప్రజాస్వామ్యం ఇండియాలో ఓ వ్యవస్థ మాత్రమే కాదు అని, అది ఇక్కడి సహజ విధానం అన్నారు.

Leave a Reply