Take a fresh look at your lifestyle.

వైరస్‌ ‌యుద్ధంలో అంతిమ విజయం వైద్యులదే

కొరోనా  మహమ్మారితో జరుగుతున్న మహా యుద్ధంలో అంతిమంగా విజయం సాధించాల్సింది, సాదించేది వైద్యులే.  కంటికి కనిపించని ఈ వైరస్‌తో జరుగుతున్న యుద్దంలో మన వైద్యులు అజేయులుగా నిలుస్తారని ఈ వైరస్‌ ‌ప్రభలిన మొదట్లో ప్రధాని మోదీ అన్నమాటలివి. వైద్యులతోపాటు నర్సులు, ఇతర పారా వైద్యసిబ్బంది, సఫాయి కార్మికులపట్ల గౌరవంగా వ్యవహరించాలని ఆయన సూచించినప్పటికీ అక్కడక్కడ వైద్యులపై దాడులు జరుగుతూనేఉన్నాయి. నిజంగా యూనిఫాంలేని యుద్ధ సైనికుల్లా తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా వారు చేస్తున్న పోరాటాన్ని అభినందించాల్సిందే. రోజుల తరబడి తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ, రేయింబవళ్ళు కష్టపడుతున్న వారిపై భౌతిక దాడులు పాల్పడడం ఒకవిధంగా వారిని అవమానించడమే. ఈనెల తొమ్మిదవ తేదీన రాష్ట్ర రాజధానిలోని గాంధీ దవాఖానాలో  జరిగిన సంఘటన ఆందోళనకరంగా మారింది. అయితే  రెండు రోజులుగా  రోడ్డెక్కిన జూనియర్డాక్టర్లను శాంతింపజేయడంలో ప్రభుత్వం విఫలమయింది ..ఒకవైపు ప్రభుత్వం చర్చలు ముగిశాయని..జూనియర్‌ ‌డాక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు అంటుంది..మరోవైపు డాక్టర్లు మాత్రం ఇంకా సమ్మెలో ఉన్నామని ప్రకటనలిస్తున్నారు.

వాస్తవంగా ప్రపంచాన్నే వణికిస్తున్న ఈ వైరస్‌ను ఎదుర్కోవడంలో వైద్య సిబ్బంది అలుపెరుగని పోరాటం చేస్తున్నది. రాష్ట్రంలో వైరస్‌ ‌పాల్పడినవారి కేసులన్నీ రాజధాని నగరానికి చేరుకోవడంతో అక్కడి వైద్య సిబ్బందికి బారంగా మారింది. కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్న కేసులతో వైద్య సిబ్బందికి గుక్కతిప్పుకోలేక పోతున్నారు.   అలాంటి పరిస్థితిలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యుల దాడి వారికి మనస్థాపానికి గురిచేస్తున్నది. వైరస్‌ ‌ప్రభావం చూపిస్తున్నప్పటినుండి ఇప్పటివరకు పలుసార్లు వైద్యులపైన దాడులు జరుగుతుండడం, వారు నిరసన తెలుపుతుండడం, ప్రభుత్వం చర్చించి వారికేవో హామీలిచ్చి తిరిగి వారిని కార్యోన్ముఖులను చేయడం జరుగుతూనే ఉంది.  అయితే ఇటీవల ఓ జర్నలిస్టు మృతిపై అతని కుటుంబ సభ్యులొకరు సోషల్‌ ‌మీడియాలో పెట్టిన  మెసేజ్‌ ‌వారి నిబద్దతను  ప్రశ్నించేదిగా ఉంది. ప్రభుత్వం, ప్రజలు వారికి ఎంతటి ప్రాధాన్యతను ఇస్తున్నారన్న విషయాన్ని వారు మరిచి ప్రవర్తిస్తున్నారా అన్న అనుమానం ఆ వీడియోను చూసినవారికి కలుగక తప్పదు.  ఇదిలా ఉంటే ప్రస్తుత పరిస్థితి చూస్తే రాష్ట్రంలోని నాలుగుకోట్ల జనభాలో కొరోనా విస్తరిస్తూనే ఉంది. ఎప్పుడు ఎలా విస్తరిస్తున్నదన్నది అంతుపట్టకుండా ఉంది. ఇలాంటి పరిస్థితిలో ప్రతీ ఒక్కరినీ అనుమానించాల్సి వస్తున్నది. అయితే రాష్ట్రంలో ఎక్కడ పాజిటివ్‌ ‌కేసులు వెలుగు చూసినా అందరినీ గాంధీ దవాఖానకు కే తరలించడం ద్వారా తమపై పనిభారం పెరుగుతున్నదంటున్నారు ఆ  డాక్టర్లు. గాంధీలో పదిహేను వందల పడకలుంటే, వేల సంఖ్యలో రోగులను తరలిస్తామంటే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. అక్కడ ఐసిలో ఆరవై ఆయిదు పడక లుంటే రెండు నుంచి మూడు వందలమందిని అడ్మిట్‌ ‌చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఏమీ చేయలేకపోతున్నామంటూ వారు తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారు. వైరస్‌ ‌లక్షణాలు పెద్దగాలేని వ్యాధిగ్రస్తులను జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాల్లో చేర్పిస్తే తమపైన పడుతున్న భారం కొంత వరకైనా తగ్గుతుందంటున్నారు.  విచిత్రమేమంటే గాంధీతో పాటు, నిమ్స్ ‌హాస్పిటల్స్ ‌లో  పనిచేస్తున్న డాక్టర్ల తోపాటు ఇతర వైద్య సిబ్బంది అంటే నర్సులు, వార్డు బాయ్‌లు, పరీక్షలు నిర్వహించే సిబ్బంది సగం మంది హోం క్వారంటైన్‌లోకి వెళ్ళడం కూడా వారిని వివశులను చేస్తోంది.  ఒక నిమ్స్‌లోనే  నలభై మంది వైద్య సిబ్బందికి ఈ వ్యాధి లక్షణాలున్నట్లు గుర్తించారు. వీరిలో  ప్రొఫెసర్లు, పీజీ విద్యార్దులతో పాటు ఇతర సిబ్బంది ఉన్నట్లు చెబుతున్నారు.  రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్‌తో జరిగిన చర్చల్లో జూనియర్‌ ‌డాక్టర్లు ఇవే విషయాలను ముందుపెట్టారు. వైద్య సిబ్బంది కూడా క్వారంటేన్‌కు వెళ్ళాల్సిన పరిస్థితిలో ప్రతీ హాస్పిటల్‌ ‌లో ముప్పై శాతం అదనపు సిబ్బంది ఉండేలాగా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ను వారు మంత్రి ముందు పెట్టారు. కాని ఇక్కడ ప్రధాన విషయమేమంటే వివిధ జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ దవాఖానాల్లో  గాంధీ హాస్పిటల్‌ ‌లో అందిస్తున్న సేవల్లాంటివి ఎందుకు ఏర్పాటు చేయడంలేదన్నది. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న 2వేల 162 కేసుల్లో ఒక గాంధీలోనే 600 మంది చికిత్స పొందుతున్నారు. మరో వందమంది ప్రైవేటు హాస్పిటల్‌ ‌లో చికిత్స చేయించుకుంటుండగా, మిగతావారు హోం క్వారంటేన్‌లో ఉంటున్నారు. రాష్ట్రంలో వైద్య పరీక్షలు విసృత్తం చేయక పోవడంకూడా పాజిటివ్‌ ‌కేసులు పెరగడానికి కారణమన్న చర్చకూడా జరుగుతున్నది. ఈ విషయంలో రాష్ట్ర హైకోర్టుకూడా జోక్యం చేసుకుని పరీక్షా కేంద్రాలను,చికిత్సా కేంద్రాలసంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. అయినా కోవిడ్‌ ‌పరీక్షలను, కేసులను ఒక్క గాంధీ  హాస్పిటల్‌  ‌కే ఎందుకు పరిమితం చేస్తున్నారని భారతీయ జనతాపార్టీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో వందకు పైగా ప్రభుత్వ హాస్పిటల్‌ ‌లున్నా  గాంధీ పైనే భారం మోపడాన్ని ఆయన విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో పాజిటివ్‌ ‌కేసుల సంఖ్యను ప్రభుత్వం తక్కువ చేసి చూపుతున్నదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌విమర్శిస్తున్నారు. ప్రభుత్వం చర్చకు వొస్తే తాను వాస్తవ జాబితాను ముందుపెడుతానని ఆయన సవాల్‌ ‌విసురుతున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా కేంద్రం జోక్యం అనివార్యమని ఆ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ‌కె.లక్ష్మణ్‌ ‌కేంద్ర హోంశాఖమంత్రి  అమిత్‌షాకు ఒక లేఖకూడా రాశాడు. రాష్ట్ర రాజధానిలో పెరుగుతున్న పాజిటివ్‌ ‌కేసులపైన కేంద్రం అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంత్తైనా ఉందని ఆయన ఆ లేఖలో వివరించాడు. మొత్తంమీద ఈ మహమ్మారినుండి ప్రజలను రక్షించాల్సిన వైద్య సిబ్బంది ఎంత అవసరమో,  వారిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత అంతే అవసరమని పై సంఘటనలు గుర్తుచేస్తున్నాయి.

Leave a Reply