- క్రమంగా పెరుగుతున్న కేసులు..20 మందిలో లక్షణాలు గుర్తింపు
- అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరిక
భారత్‌లో యూకే కొరోనా వైరస్ స్టెయిన్ కలకలం రేపుతోంది. మంగళవారం 5 కేసులు నమోదు కాగా, కొత్తగా మరో 15 మందికి స్ట్రెయిన్ నిర్దారణ అయింది. దీంతో.. భారత్‌కు యూకే నుంచి వొచ్చిన వారిలో మొత్తం ఇప్పటివరకూ 20 మందికి కొత్త స్ట్రెయిన్ నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశించింది. మరోవైపు బ్రిటన్ నుంచి వొచ్చే విమానాల రాకపోకలపై నిషేధాన్ని జనవరి 7వరకు పొడిగించారు. దేశ రాజధాని ఢిల్లీలో స్ట్రెయిన్ కేసులు పెరగడం గమనార్హం. ఢిల్లీ ల్యాబ్‌కు పంపిన శాంపిల్స్‌లో మొత్తం 8 మందికి కొరోనా స్ట్రెయిన్ నిర్దారణ అయింది. తర్వాత బెంగళూరు ల్యాబ్‌కు పంపిన శాంపిల్స్‌ను పరీక్షించగా మరో ఏడుగురికి స్ట్రెయిన్ సోకినట్లు వైద్య శాఖ అధికారులు గుర్తించారు.
దేశంలోని ఇతర నగరాల్లో మరో 5 స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. యూకేలో స్ట్రెయిన్ కేసులు పెరుగుతున్న సమయంలో అక్కడి నుంచి ఇండియాకు వొచ్చిన ప్రయాణికులను గుర్తించి, వారికి కొరోనా పరీక్షలు చేసే ప్రయత్నాలను కేంద్రం ముమ్మరం చేసింది.
ఇప్పటికే నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 వరకూ యూకే నుంచి 33,000 ప్రయాణికులు భారత్‌కు వొచ్చినట్లు కేంద్రం గుర్తించింది. డిసెంబర్ 9 నుంచి 22 వరకూ వొచ్చిన ప్రయాణికుల్లో లక్షణాలున్న ప్రయాణికులకు, పాజిటివ్ వొచ్చిన ప్రయాణికులకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. మరోవైపు భారత్‌లో సాధారణ కొరోనా కేసులు మళ్లీ పెరిగాయి. ఇటు కేసులు పెరుగుతుంటే.. వైరస్ కొత్త స్ట్రెయిన్ మాత్రం కలవరపెడుతోంది.