- అందుకే గ్రేటర్లో పోలింగ్ శాతం తగ్గింది
- ఎన్నికల సంఘం, ప్రభుత్వంపై విజయశాంతి ఫైర్
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోలింగ్ తగ్గడంపై ప్రముఖ సినీ నటి విజయశాంతి అలియాస్ రాములమ్మ స్పందించారు. పోలింగ్ తగ్గడానికి రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘమే కారణమన్నారు. ఈ ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరించిన ఫలితంగా పోలింగ్ గణనీయంగా తగ్గిందనీ ఆమె మండిపడ్డారు. ఆమె ఈ మేరకు మంగళవారం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేస్తూ..జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇంత తక్కువ వోటింగ్ నమోదు కావడం ఆవేదన కలిగిస్తున్నప్పటికీ… ఇందులో ప్రభుత్వం, ఎన్నికల సంఘం బాధ్యత ఎక్కువనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయన్నారు. వరుస సెలవులు ఉన్నాయని తెలిసీ, ఎక్కువ మంది నగరంలో ఉండే అవకాశం లేదని తెలిసీ… ఈ సమయంలో ఎన్నికలు వొచ్చేలా షెడ్యూల్ ప్రకటించారన్నారు.
తెలంగాణ ప్రభుత్వమే వ్యూహాత్మకంగా పోలింగ్‌ను నిర్వీర్యం చేసిందనే వాదన బలంగా వినిపిస్తోందనీ, దీనికి తోడు వోటరు నమోదు, వోటరు జాబితాల్లో తగిన మార్పు చేర్పులు, అవకతవకలుంటే పరిశీలించి సరిచేయడానికి కావలసిన సమయం ఇవ్వకుండానే హడావుడిగా కేవలం రోజుల వ్యవధిలో ఎన్నికలకు వెళ్లడం కూడా ఈ పరిస్థితికి దారి తీసిందనే విమర్శను కొట్టిపారేయలేమన్నారు. ముఖ్యంగా చాలా డివిజన్లలో ఉద్దేశ్యపూర్వకంగానే ఎందరో వోటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించినట్లు ఆరోపణలు వొచ్చాయి.