వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌కు సర్వోన్నత న్యాయస్థానం సూచన
పెండింగ్ బిల్లులు లేవన్న గవర్నర్ లాయర్
బిల్లులకు సంబంధించిన వివరాలు ఇవ్వండి : పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళి సై కీలక నిర్ణయం
న్యూ దిల్లీ/హైదరాబాద్, ఏప్రిల్ 24(ఆర్‌ఎన్‌ఎ) : తెలంగాణ గవర్నర్ పెండింగ్ బిల్లుల కేసులో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సుప్రీమ్ కోర్టులో విచారణ జరిగింది. వివరణ కోసం గవర్నర్‌కు బిల్లులు తిప్పి పంపే అధికారం ఉందన్న సుప్రీమ్ కోర్టు…వీలైనంత త్వరగా బిల్లులపై నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. ప్రస్తుతానికి బిల్లులు పెండింగ్‌లో లేనందున ఈ కేసును ముగిస్తున్నట్లు తెలిపింది. విచారణ సందర్భంగా గవర్నర్ దగ్గర ఎటువంటి బిల్లులు పెండింగ్‌లో లేవని గవర్నర్ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు.
రెండు బిల్లుల విషయంలో ప్రభుత్వం నుంచి క్లారిఫికేషన్ కోరినట్లు చెప్పారు. అయితే గవర్నర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారాపడాల్సిన పరిస్థితి ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే వాదించారు. పెండింగ్ బిల్లులను ఎక్కువ కాలం గవర్నర్ తన దగ్గరే పెట్టుకోవడం కరెక్ట్ కాదని కోర్టుకు తెలిపారు. మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో బిల్లులు త్వరగా పరిష్కారం అవుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే. నిర్ణీత కాల వ్యవధిలో బిల్లులు ఆమోదించేలా ఆదేశాలివ్వాలంటూ తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీమ్ కోర్టు ప్రస్తుతం బిల్లులు పెండింగ్‌లో లేనందున కేసు విచారణను ముగిస్తున్నామని చెప్పింది.
బిల్లులకు సంబంధించిన వివరాలు ఇవ్వండి : పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళి సై కీలక నిర్ణయం
పెండింగ్ బిల్లులపై గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డీఎంఈ వయసు విరమణ పెంపు బిల్లును గవర్నర్ తమిళ సై తిరస్కరించారు. పురపాలక చట్ట సవరణ బిల్లుపై వివరణ కోరారు. అలాగే ప్రైవేట్ యూనివర్సిటీలపై సైతం గవర్నర్ వివరణ కోరారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, అడిషనల్ డైరెక్టర్, ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిటైర్‌మెంట్ ఏజ్‌ను 61 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లుకు గవర్నర్ నో చెప్పారు.
మరో రెండు బిల్లులు పురపాలక చట్ట సవరణ బిల్లు, ప్రైవేట్ వర్సిటీల బిల్లుపై వివరణ కావాలంటూ పెండింగ్‌లో పెట్టారు. పురపాలక సంస్థల్లో అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఇంతకాలం ఉన్న మూడేళ్ళ గడువును నాలుగేళ్ళకు పెంచుతూ మున్సిపల్ చట్ట సవరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం..తీసుకొచ్చింది. దీనిపై నిర్ణయం తీసుకునేముందు మరింత వివరణ అవసరమని గవర్నర్ తమిళిసై అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలను నెలకొల్పడానికి తీసుకొచ్చిన బిల్లుపై సైతం నిర్ణయం తీసుకునేముందు ప్రభుత్వం నుంచి వివరణ కావాలని గవర్నర్ అభిప్రాయపడ్డారు.