Take a fresh look at your lifestyle.

రాష్ట్ర బ్జడెట్‌ ‌మొత్తం పద్దు రూ.2,90,396 కోట్లు

  • రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు..మూలధన  వ్యయం 37,525 కోట్లు
  • ప్రత్యేక అభివృద్ధి నిధికి 10,348
  • రైతు బంధుకు రూ. 15,075 కోట్లు
  • ఆర్థిక శాఖకు రూ. 49,749 కోట్లు
  • సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం అందించేందుకు రూ.7,890 కోట్లు
  • హరితహారంకు రూ. 1471 కోట్లు…పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమానికి రూ. 4,834 కోట్లు
  • మొదటిసారిగా కేసీఆర్‌ ‌న్యూట్రిషన్‌ ‌కిట్‌ ‌పథకం కోసం రూ. 200 కోట్లు
  • ఏప్రిల్‌ ‌నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ
  • అసెంబ్లీలో 2023-24 బడ్జెట్‌ ‌ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి హరీష్‌ ‌రావు
  • తెలంగాణ అనుసరిస్తుంది..దేశం అనుకరిస్తుందని వ్యాఖ్య

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : తెలంగాణ ఆచరిస్తుందని, దేశం అనుసరిస్తుందన్న స్థాయిలో రాష్ట్రం దూసుకపోతుందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ ‌రావు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి తమది పెద్దపీట అని ప్రభుత్వం రుజువు చేసుకుంది. కేంద్రం మోకాలడ్డుతున్నా..అనేక పథకాలకు నిధలు కేటాయింపుతో రాష్ట్రాన్ని ప్రగతిపథంలో పరుగు పెట్టిస్తూ..దేశానికి రోల్‌ ‌మోడల్‌గా నిలిచిందన్నారు. సోమవారం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీష్‌ ‌రావు 2023-24 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సంక్షోభ సమయంలోనూ సంక్షేమం ఆగలేదని, అన్ని సామాజిక వర్గాల ఆకాంక్షలకు అనుకూలంగా సమగ్రాభివృద్ధి చేశామన్నారు. రాష్ట్రం ఏర్పడేనాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండేదన్నారు. ఏర్పడిన తరువాత జిఎస్‌డిపి క్రమేణా పెరుగుతూ వొచ్చిందన్నారు. తెలంగాణ అభివృద్ధి మోడల్‌ ‌గురించి ఊరురూవాడ చర్చ జరుగుతుందన్నారు. 2019-20 సంవత్సరానిని జిఎస్‌డిపి వృద్ధి రేటు 13.2 శాతానికి పెరిగిందన్నారు.

దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ అత్యధికంగా తలసరి ఆదాయం 11.8 శాతం వృద్ధిరేటును నమోదు చేసిందని హరీష్‌ ‌రావు ప్రశంసించారు. దేశ జిడిపిలో తెలంగాణ జిడిపి శాతం 4.9 కావడం గర్వకారణమని కొనియాడారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రధాన రంగాల్లో అనుబంధ రంగాల్లో గణనీయమైన వృద్ధి రేటు కనిపించిందన్నారు. నీటి పారుదల ప్రాజెక్టుల వల్ల వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో మెరుగైన వృద్ధి రేటు కనిపించిందని వివరించారు. అన్ని రంగాల్లో పెట్టుబడులు పెరగడం వల్లనే ఈ వృద్ధి రేటు సాధ్యమైందని, జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం 86 శాతం ఎక్కువగా ఉందని ఆయన తెలియజేశారు. తలసరి ఆదాయం రూ.3,17,155గా అంచనా వేశామన్నారు. 2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర నికర అప్పులు రూ.3,57,059 కోట్లుగా ఉండగా అప్పుల శాతం 23.8 శాతంగా ఉంది. రాష్ట్ర బ్జడెట్‌ అం‌చనాలను  రూ.2,90,396 కోట్లుగా మదింపు చేశారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ. 37,525 కోట్లు, రెవెన్యూ రాబడుల అంచనా రూ.2,16,566 కోట్లుగా మంత్రి తెలిపారు. సొంత పన్నుల ఆదాయం: రూ.1,31,028 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా రూ.21,470 కోట్లు, రుణాలు రూ.46,317 కోట్లు, పన్నేతర ఆదాయం రూ.22,808 కోట్లు, గ్రాంట్లు అంచనా రూ.41,259 కోట్లుగా అంచనా వేశారు. సొంత జాగా ఉండి ఇల్లు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ ‌న్యూస్‌ ‌చెప్పింది. ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ సారి ప్రత్యేక అభివృద్ధి నిధికి 10,348 కోట్లు కేటాయించారు. ఈ నిధి కింద గత సంవత్సరం కేవలం రూ. 2,000 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇక సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది.

దీనికోసం రూ.7,890 కోట్లు కేటాయించినట్టు బ్జడెట్‌ ‌ప్రసంగంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ ‌వెల్లడించారు. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు ప్రతి నియోజకవర్గంలో 2 వేల మందికి రూ.3 లక్షల చొప్పున సాయం అందిస్తామని ప్రకటించారు. సీఎం కోటాలో 25వేల మందికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. మొత్తంగా 2 లక్షల 63 వేల మందికి 7890 కోట్లు అందించనున్నట్టు పేర్కొన్నారు. ఇక డబుల్‌ ‌బెడ్రూమ్‌ ఇళ్ల కోసం రూ.12 వేల కోట్లు కేటాయించారు. ఈ సారి బ్జడెట్‌లో కూడా ప్రభుత్వం వ్యవసాయంతో పాటు సంక్షేమానికి కూడా పెద్ద పీట వేసింది. విద్య, వైద్యానికి ఎప్పటి లాగా ప్రధాన్యతనిచ్చింది. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌, ‌దళితబంధు పథకాలకు భారీగా నిధులు కేటాయించింది. పల్లెప్రగతి, డబుల్‌ ‌బెడ్‌రూమ్‌ ఇం‌డ్లకు నిధులు కేటాయించింది. ఒకప్పుడు సంక్షోభంలో కూరుకుని అల్లాడిన వ్యవసానికి తిరిగి జవజీవాలను అందించడంలో, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడే రైతుల్లో తిరిగి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రభుత్వం పూర్తిగా సఫలీకృతమైందని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు.

ప్రభుత్వ అసాధారణ కృషితో నేడు సుజల, సుఫల, సస్యశ్యామల తెలంగాణగా అవరించిందని చెప్పారు. 2023-24కుగాను రూ.2,90,396 కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. వ్యవసాయ శాఖకు రూ.26,831 కోట్లు కేటాయించారు. ఇందులో రుణమాఫీ పథకానికి రూ.6385 కోట్లు, రైతుబంధుకు రూ.15,075 కోట్లు, రైతు బీమాకు రూ.1,589 కోట్లు, ఆయిల్‌పామ్‌ ‌సాగుకు రూ.వెయ్యి కోట్లు కేటాయించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు పదేండ్లలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు అప్పటి ప్రభుత్వాలు రూ.7994 కోట్ల నిధులు ఖర్చు చేశాయని, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2023 జనవరి నాటికి సీఎం కేసీఆర్‌ ‌ప్రభుత్వం రూ.1,91,612 కోట్లు వెచ్చించిందని చెప్పారు. అంటే 20 రెట్లు నిధులు అధికంగా ఖర్చు చేసిందన్నారు. దేశ వ్యవసాయ వృద్ధిరేటు 4 శాతం కాగా, తెలంగాణలో అది 7.4 శాతంగా ఉందని చెప్పారు. 2014-15లో రాష్ట్రంలో మొత్తం పంటసాగు విస్తీర్ణం 131.33 లక్షల ఎకరాలు ఉండగా, ప్రభుత్వం తీసుకున్న వ్యవసాయ అభివృద్ధి చర్యల వల్ల సాగు విస్తీర్ణం 2020-21 నాటికి 215.37 లక్షల ఎకరాలకు చేరిందన్నారు. రాష్ట్రంలో వరి ఉత్పత్తి 3 రెట్లు పెరిగిందని చెప్పారు. 2014-15లో 68.17 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల నుంచి 2021-22లో 2కోట్ల 2 లక్షల మెట్రిక్‌ ‌టన్నులకు చేరుకుందన్నారు. 75 ఏండ్ల భారతదేశ చరిత్రలో 65 లక్షల మంది రైతులకు రూ.65 వేల కోట్ల భారీ మొత్తాన్ని పంట పెట్టుబడి సాయంగా అందించిన ఒకే ఒక ప్రభుత్వం తెలంగాణ సర్కార్‌ అని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుందన్నారు. రైతుబీమా పథకం రైతుల కుటుంబాలకు ఎనలేని ధీమా అందిస్తున్నదని వెల్లడించారు. ఏ రైతైనా మరణిస్తే.. మరణించిన నాటినుంచి 10 రోజుల్లోగా రూ.5 లక్షల బీమా సొమ్మును ప్రభుత్వం అతని కుటుంబానికి అందజేస్తున్నదని చెప్పారు. ఇప్పటి వరకు దాదాపు లక్ష మంది రైతుల కుటుంబాలకు రైతుబంధు ద్వారా రూ.5384 కోట్ల ఆర్థిక సాయం అందించామన్నారు. రైతు పండించిన ప్రతిగింజా ప్రభుత్వమే కొనుగోలుచేస్తున్నదని ప్రకటించారు. ఆయిల్‌పామ్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉం‌దని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. ఆయిల్‌పామ్‌ ‌సాగుద్వారా ప్రతి ఎకరానికి రూ.లక్షా 50 వేల వరకు నికర ఆదాయం వొస్తుందన్నారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్‌ ‌సాగు విస్తీర్ణాన్ని 20 లక్షల ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నదని చెప్పారు. ఇక కొత్త ఉద్యోగుల జీతభత్యాల కోసం రూ. 1000 కోట్లు అదనంగా ప్రతిపాదిస్తున్నామని, ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్‌ ‌నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, సెర్ఫ్ ఉద్యోగుల పే స్కేల్‌  ‌సవరణ చేయబోతున్నామని హరీష్‌ ‌రావు తెలిపారు.

Leave a Reply