Take a fresh look at your lifestyle.

ముంచుకొస్తున్న మూడో ముప్పు డెల్టా ప్లస్‌

‌కోవిడ్‌ ‌రెండో దశ ఏప్రిల్‌, ‌మే నెలల్లో విరుచుకుపడి దేశాన్ని అతలాకుతలం చేసింది. కేసులు, మృతుల సంఖ్య వేగంగా పెరగడంతో మళ్లీ లాక్‌ ‌డౌన్‌ ‌విధించవలసి వొచ్చింది. పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయి. మెల్లిమెల్లిగా వ్యాపారాలు, కార్యాలయాలు తెరుచుకుంటున్నాయి. ప్రజల రాకపోకలు మొదలవుతున్నాయి. అయితే, మరి కొన్ని నెలల వ్యవధిలోనే, రాబోయే 12-16 వారాల్లోపే మూడో దశ ప్రారంభం కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడో ముప్పును అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతవరకు సంసిద్ధంగా ఉన్నాయనేది మిలియన్‌ ‌డాలర్ల ప్రశ్న. కొరోనా డెల్టా ప్లస్‌ ‌వేరియంట్‌కు ప్రపంచం భయపడాల్సిందేనా? డెల్టా ప్లస్‌ ‌లాంటి కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుంటే, టీకాల ప్రభావం తగ్గిపోతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. కొత్తగా పుట్టుకొచ్చిన డెల్టా ప్లస్‌, ‌కిందటి ఏడాది తొలిసారిగా భారతదేశంలో కనిపించిన డెల్టా వేరియంట్‌ ‌బంధువే. ఇండియాలో కొరోనా రెండోదశ విజృంభణకు డెల్టా వేరియంటే కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు మూడో వేవ్‌ ‌ముప్పు ముంచుకొస్తున్నదనే భయం కనబడుతున్నది. అయితే, ఈ భయాలన్నీ ఎంతవరకు నిజం? ఇంకా పలు కోవిడ్‌ ‌దశలు రావొచ్చని అంచనా ఉన్నప్పటికీ, వాటి వ్యాప్తి, తీవ్రత అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.

ఎన్నికల ప్రచారాలు, మతపరమైన వేడుకలు, ఉత్సవాలు, మార్కెట్లలో రద్దీ.. ఇవన్నీ సెకండ్‌ ‌వేవ్‌కు కారణాలయ్యాయి. పేలవమైన విధాన నిర్ణయాలు, పర్యవేక్షణ, ముందస్తు హెచ్చరికలను విస్మరించడం లాంటివి మరి కొన్ని కారణాలు. ఇవే తప్పులు పునరావృతం అయితే కోవిడ్‌ ‌మూడో దశ మీద పడడానికి ఎంతో సమయం పట్టదని నిపుణులు అంటున్నారు. దేశంలో పరిస్థితి ఇప్పటికీ చాలా ప్రమాదకరంగానే ఉందని, ప్రజల నడవడిక, కోవిడ్‌ ‌నిబంధనలు పాటించే తీరుపై థర్డ్ ‌వేవ్‌ ‌వేగం, తీవ్రత ఆధారపడి ఉంటాయని పబ్లిక్‌ ‌పాలసీ, ఆరోగ్య వ్యవస్థ నిపుణులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల్లో ఆర్థిక కార్యకలాపాలు ఒకేసారి కాకుండా క్రమకమంగా మొదలయితేనే మేలని అంటున్నారు. ‘‘మనం తొందరపడి అన్ని ఒకేసారి తెరిచేస్తే, ప్రజలు కోవిడ్‌ ‌భద్రతా నిబంధనలను పాటించకపోతే, మనకు మనమే వైరస్‌ను ఆహ్వానించినట్లవుతుంది. కోవిడ్‌ ‌నిబంధనలను స్థానికంగా, కింది స్థాయిల నుంచి పర్యవేక్షించాలి. వ్యాపార సంస్థలు నిబంధనలు పాటించకపోతే వెంటనే జరిమానా విధించాలి’’ అని సూచిస్తున్నారు.

కొరోనా వైరస్‌ ‌డెల్టా ప్లస్‌ ‌వేరియంట్‌ ఇప్పుడు దేశంలోని 12 రాష్ట్రాలలో నమోదయింది. దేశవ్యాప్తంగా మధ్యప్రదేశ్‌, ‌మహారాష్ట్ర, హరియాణ, పంజాబ్‌, ‌గుజరాత్‌, ‌కేరళ, ఆంధ్రప్రదేశ్‌, ‌తమిళనాడు, ఒడిశా, రాజస్థాన్‌, ‌జమ్మూ, కర్ణాటకలలో 65 వేల నమూనాలను జీన్‌ ‌సీక్వేన్సింగ్‌ ‌చేయగా 51 కేసులున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కొరోనా సెకండ్‌ ‌వేవ్‌ ఇం‌కా కొనసాగుతూనే ఉందని, డెల్టా ప్లస్‌ ‌వేరియంట్‌ ‌కనుగొన్న రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, వాటిని స్థానికంగానే కట్టడి చెయ్యాలని ఇండియన్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ‌మెడికల్‌ ‌రీసెర్చ్ ‌డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌డాక్టర్‌ ‌బలరామ్‌ ‌భార్గవ ఇప్పటికే హెచ్చరించారు. ఒక వేరియంట్‌ ‌జీనోమ్‌ ‌సీక్వెన్సింగ్‌ 10-12 ‌రోజులు పడుతుందని, డెల్టా ప్లస్‌ ‌పేరిట ఉన్న ప్లస్‌ ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు జీనోమ్‌ ‌సీక్వెన్సింగ్‌ ‌పని గురించి నేషనల్‌ ‌సెంటర్‌ ‌ఫర్‌ ‌డిసీజ్‌ ‌కంట్రోల్‌ ‌ప్రదర్శనలో నిపుణులు వివరించారు. దేశంలో మొదట డెల్టా వేరియంట్‌ని గత డిసెంబరులో తెలిపారు.

2021 మార్చిలో 52 జిల్లాలకు వ్యాపించిన వేరియంట్‌, ‌జూన్‌ ‌నాటికి 174 జిల్లాలకు విస్తరించింది, అయితే వ్యాప్తి కొద్దిగా తగ్గుముఖం పడుతున్నదని వెల్లడించారు. ప్రస్తుతం, 15 రాష్ట్రాల్లోని 174 జిల్లాల్లో డెల్టా వేరియంట్‌ ‌విస్తరించగా, మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్‌, ‌తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌, ‌గుజరాత్‌ ‌లో కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. కొన్ని చోట్ల, డెల్టా వేరియంట్‌ ‌కేసులు ప్రారంభంలో కనిష్టంగా ఉండేవి, క్రమంగా డెల్టా ఆల్ఫాను స్వాధీనం చేసుకుందని, ఆల్ఫా కంటే డెల్టా బలంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది 10 నుండి 51 శాతం వరకు వ్యాపించే అవకాశం ఉందని, నెల రోజుల వ్యవధిలోనే డెల్టా వ్యాప్తి పెరుగుతుందని పేర్కొంటున్నారు. గత నెలలో డెల్టా ప్లస్‌ ‌వేరియంట్‌ ‌కారణంగా ఒకరు మరణించినట్లు వార్తలు రాగా, తాజాగా మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా సంగమేశ్వర్‌ ‌ప్రాంతంలో 80 ఏళ్ల వృద్ధ మహిళ డెల్టా ప్లస్‌ ‌బారినపడి మృతి చెందినట్టు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్ర డెల్టా ప్లస్‌ ‌కేసులు ఉన్నాయని, మొత్తం మహారాష్ట్రలో ప్రస్తుతం 22 కేసులు నమోదయి వారు వైద్య బృందాల పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొన్నారు. డెల్టా ప్లస్‌ ‌వేరియంట్‌ను కనుగొన్న రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, వాటిని స్థానికంగానే కట్టడి చెయ్యాలని ఇండియన్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ‌మెడికల్‌ ‌రీసెర్చ్ ‌డైరెక్టర్‌ ‌పేర్కొన్నారు.

కొత్త వేరియంట్లు ముప్పు తెస్తాయా? ప్రధానంగా డెల్టా వేరియంట్‌ ‌వల్లే రెండో దశ తీవ్రంగా మారింది. వైరస్‌ ‌వ్యాప్తి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని కొత్త రకాలు పుట్టుకు రావొచ్చని నిపుణులు అంటున్నారు. ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చిన డెల్టా ప్లస్‌ ‌వేరియంట్‌ ‌పట్ల ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది దీన్ని ‘‘వేరియంట్‌ ఆఫ్‌ ‌కన్సర్న్’’‌గా ప్రకటించింది. అయితే, దీనివల్ల థర్డ్ ‌వేవ్‌ ‌ముంచుకొస్తుందని చెప్పడానికి తగినంత డేటా ప్రస్తుతం అందుబాటులో లేదు కానీ, వారాల తేడాతోనే పరిస్థితి మారిపోవొచ్చని నిపుణులు భావిస్తున్నారు. జూన్‌ ‌వరకు దేశంలో 50,000 శాంపిల్స్‌ను పరీక్షించారని, ఇది చాలదని, ఇంకా భారీగా సీక్వెన్సింగ్‌ ‌చేయాలని నిపుణులు భావిస్తున్నారు. తాజాగా ఏపి లోని తిరుపతిలో ఒకరికి డెల్టా ప్లస్‌ ‌సోకగా అతని కుటుంబ సభ్యులపై పరీక్షలు జరుపుతున్నారు. వారికీ సోకే అవకాశం ఉందంటున్నారు.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టీకాలు మనకు తెలిసిన వేరియంట్లపై బాగానే పని చేస్తున్నాయి. కానీ, కొత్త వేరియంట్లపై పని చేస్తాయా, లేదా అనేది కచ్చితంగా తెలీదని అనేకమంది కోవిడ్‌ ‌రోగులకు వైద్యం అందించిన డాక్టర్‌ ‌ఫతాహుదీన్‌ అం‌టున్నారు. టీకా వేసుకున్న తరువాత కూడా కోవిడ్‌ ‌బారిన పడిన వారున్నారు. ముఖ్యంగా మొదటి డోసు వేసుకున్న తరువాత కోవిడ్‌ ‌సోకినవారు ఎక్కువే. థర్డ్ ‌వేవ్‌ ‌కచ్చితంగా వొస్తుంది. కానీ, కొత్త ఉత్పరివర్తనాలను వెంటనే గుర్తించేందుకు భారీగా శాంపిల్స్ ‌పరీక్షించడం, కఠినమైన నిబంధనలు అమలు చేయడం ద్వారా మూడో దశ రాకను ఆలస్యం చేయవొచ్చు. వొచ్చినా సులువుగా ఎదుర్కోవొచ్చు. ఇవన్నీ చేయకపోతే మనం కన్ను మూసి తెరిచే లోపల థర్డ్ ‌వేవ్‌ ‌మనల్ని ముంచేస్తుంది. మూడో దశ ఎలా ఉంటుందనేది ప్రజల రోగ నిరోధక శక్తిపై కూడా ఆధారపడి ఉంటుంది. మూడోసారి ముంచుకొచ్చే డెల్టా ప్లస్‌ ‌టీకాల ద్వారా లేదా గతంలో వొచ్చిన ఇన్‌ఫెక్షన్ల ద్వారా ఎంతమందిలో యాంటీబాడీస్‌ ‌తయారయ్యాయన్నది ముఖ్యం. జూన్‌ 9 ‌నుంచి 25 మధ్య కాలంలో దేశంలో రోజుకు సగటున 32.5 లక్షల టీకా డోసులు వేశారు. 2021 చివరికల్లా అందరికీ టీకాలు వేయడం పూర్తి చేయాలంటే రోజుకు 85 నుంచి 90 లక్షల డోసులు వేయాలి. ప్రస్తుతం 4 శాతం ప్రజలకు రెండు డోసులూ అందించారు.

18 శాతానికి ఒక డోసు వేశారు. వ్యాక్సినేషన్‌ ‌వేగవంతం చేయకపోతే అనేకమందికి కోవిడ్‌ ‌బారిన పడే ప్రమాదం ఉందని, గతంలో కోవిడ్‌ ఇన్‌ఫెక్షన్ల వలన యాంటీబాడీస్‌ ‌తయారైనా, రెండోసారి కోవిడ్‌ ‌సోకే అవకాశాలు కూడా ఉంటాయని అంటున్నారు. అయితే, ఎంతమందికి కోవిడ్‌ ‌సోకింది, ఎంతమందికి యాంటీ బాడీస్‌ ‌తయారయ్యాయన్నది లెక్కించడం కష్టం. గ్రామాల్లో, నగరాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో కూడా చాలామందికి కోవిడ్‌ ‌టెస్టులు జరగలేదు. వారికి కోవిడ్‌ ‌సోకిందో లేదో తెలిసే అవకాశం లేదు. లెక్కించిన కోవిడ్‌ ‌మరణాలు వాస్తవంలో కన్నా చాలా తక్కువ. కోవిడ్‌ ‌సోకి, రోగ నిరోధక శక్తి పెరిగినవారు 55-60 శాతం మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన రెండో దశలో ఉన్నంత తీవ్రత మూడో దశలో ఉండదని చెబుతూ, నిర్లక్ష్యం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. జనాభాలో సగం కన్నా ఎక్కువ మందికి కోవిడ్‌ ‌సోకినా, 20-30 శాతం మంది కోవిడ్‌ ‌బారిన పడలేదు. వీరిలో వృద్ధులు, రోగ నిరోధక శక్తి బలంగా లేనివాళ్లు ఉండొచ్చు. అందుకే, కేసుల పెరుగుదలను వెంటనే గుర్తించేలా గట్టి నిఘా ఏర్పాటు చేసుకోవాలి. కోవిడ్‌ను ఇప్పటికీ తేలికగా తీసుకోలేమని, తీవ్రమైన ముప్పు పొంచి ఉందని నిపుణులు ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నారు. ఏడాది పైబడి ఈ యుద్ధం చేస్తున్న డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తల గురించి ఒక్కసారి ఆలోచించాలి. వారు చాలా అలిసిపోయారు.. థర్డ్ ‌వేవ్‌ ‌కూడా తట్టుకుని నిలబడగలరా ??.

Leave a Reply