- లాక్డౌన్ 4.0పై నేడో, రేపో మార్గదర్శకాలు
- కేంద్రం సడలింపులకు అనుగుణంగా తెలంగాణ నిర్ణయం
దేశవ్యాప్తంగా కొరోనా వైరస్ నియంత్రణకు అమలులో ఉన్న మూడో విడత లాక్డౌన్ ఆదివారంతో ముగియనుంది. దీంతో మరోసారి లాక్డౌన్ పొడిగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లాక్డౌన్ 4.0 అమలుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు నేడో, రేపో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇచ్చే మార్గదర్శకాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అయితే, ఈ సారి లాక్డౌన్లో ఎక్కువ సడలింపులు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గ్రీన్, ఆరెంజ్ జోన్లలో నిబంధనలతో కూడిన సడలింపులకు ఆయా రాష్ట్రాలకు అవకాశం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఈసారి ఎక్కువ సడలింపులు ఇవ్వనుందని సమాచారం. పరిమిత ఆంక్షలతో రవాణా సదుపాయాల పునరుద్ధరణతో పాటు జోన్లను నిర్ధారించే అవకాశం ఆయా రాష్ట్రాలకే ఇవ్వనుందని వార్తలు వెలువడుతున్నాయి.
కాగా, నాలుగో విడత లాక్డౌన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో తదుపరి చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.ఒకవేళ కేంద్రం పరిమిత ఆంక్షలతో రవాణా సదుపాయాల పునరుద్ధరించుకోవచ్చని సూచించిన పక్షంలో రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లను పునరుద్ధరించే దిశగా ఇప్పటికే ఆయా శాఖల అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంకా మిగతా ఏయే అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇస్తుందో పరిశీలించి వాటికి అనుగుణంగా సీఎం కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.