మేడారం జాతరను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించాలి

వరంగల్, : పర్యావరణాన్ని కాపాడేందుకు గాను మేడారం జాతరను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణ, మున్సిపల్ అభివృద్ధి శాఖ మంత్రి కెటిఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. మేడారం జాతరలో ప్లాస్టిక్ వస్తువులను వాడొద్దంటూ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ప్రత్యేకంగా రూపొందించిన డాక్యుమెంటరీ (ఆడియో విజువల్)ని, ఎవీని ప్రదర్శించే ఎల్ఇడి వాహనాన్ని మంగళవారం హన్మకొండలోని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ క్యాంపు కార్యాలయంలో కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం ప్లాస్టిక్‌ని పూర్తిగా నిషేధించిందన్నారు.
అందులో భాగంగానే ఫిబ్రవరి 5,6,7,8 తేదీల్లో జరిగే మేడారం జాతరలో కూడా భక్తులు ప్లాస్టిక్‌ని వినియోగించవద్దన్నారు. ప్లాస్టిక్‌కి బదులు ప్రత్యామ్నాయ వస్తువులను మాత్రమే వాడాలని, ఇందుకు మేడారం వెళ్లే భక్తులు స్వచ్ఛందంగా సహకరించాలని ఆయన కోరారు. ప్లాస్లిక్ నిషేధంపై ఎవీని రూపొందించి, విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని మంత్రి కెటిఆర్ అభినందించారు. ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలను చైతన్య పరిచేలా రూపొందించిన డాక్యుమెంటరీ బాగుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, నన్నపనేని నరేందర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, మేయర్ గుండా ప్రకాశ్‌రావు, దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, లింగాల ఘన్పూర్ జెడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి, టిఆర్ఎస్ యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.సతీశ్‌రెడ్డి, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.
Tags: The tentacle,plastic-free,municipality,cm kcr,warangal