Take a fresh look at your lifestyle.

పెళ్లి ముహూర్తాలకు ఇప్పట్లో కష్టమే

కఠిన ఆంక్షల నేపథ్యంలో పెళ్లిళ్ల వాయిదాకే మొగ్గు
దెబ్బతిన్న కోట్లాది రూపాయల వ్యాపారం

కొరోనా అన్ని రంగాలపైనా తీవ్ర ప్రభావం చూపినట్లుగానే పెళ్లిళ్లపై తీవ్ర ప్రభావంచూపింది. ఇప్పుడు లాక్‌డౌన్‌ ‌కారణంగా పెళ్లిళ్లు అనుమానమే అని పురోహితులు అంటున్నారు. కేవలం 40మందికి మాత్రమే పెళ్లిల్లకు అనుమతి ఇవ్వడంతో పెళ్లిళ్లు జరగడం అనుమానమే అని అంటున్నారు. అత్యవసరమైన వారు దగ్గరి బంధువనలు పిల్చుకుని తంతు ముగిస్తారు. దీంతో ఈ రంగంపై ఆధారపడ్డ అనేక అనుబంధ రంగాలకు సంబంధించిన వారి ఉపాధి కోల్పోనుంది. కొరోనా కారణంగా ఇంతకాలం పెళ్లిళ్లు వాయిదా పడుతూ వచ్చాయి.  గతేడాది  జనతా కర్ఫ్యూ, ఆ వెంటనే దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ ‌విధించడంతో పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఆగిపోయాయి.

భౌతిక దూరం పాటించడమే కొరోనా వైరస్‌కు విరుగుడని నిపుణులు తేల్చడంతో ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేసాయి. దీంతో పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు బ్రేక్‌ ‌పడింది. అప్పటికే నిశ్చయమైన ఎన్నో పెళ్లిళ్లు ఆగిపోయాయి. దీంతో ఈ యేడాది నిర్వహిద్దామనుకున్న వారికి సెకండ్‌ ‌వేవ్‌ ఉప్పెనలా వచ్చి పడింది. వచ్చే ఐదారు నెలల్లో ముహూర్తాలు ఉన్నా వేలాది మంది శుభకార్యాల నిర్వహణకు ముందుకు రావడం లేదు. తమ పెళ్లిళ్లను వాయిదా వేసుకునే ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇలా కొరోనా కారణంగా వేలాది పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. వైరస్‌ ‌ప్రభావం తగ్గిన తరువాత తిరిగి ముహూర్తాలు చూసుకోవచ్చని చాలా మంది పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటున్నారు. ఆగస్ట్ ‌తరవాత ముహూర్తాలు ఉన్నా.. అనుమానమే అని అంటున్నారు. ఏప్రిల్‌, ‌మే మాసాల్లో ముహూర్తాలకు సంబంధించి చాలా ఫంక్షన్‌ ‌హాళ్లు ఎప్పుడో బుక్‌ అయిపోయాయి. అయితే, కొరోనా ప్రభావంతో పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. దీంతో అడ్వాన్సులు వాపస్‌ ఇవ్వాల్సి వచ్చిందని ఫంక్షన్‌ ‌హాల్‌ ‌నిర్వాహకులు  తెలిపారు.

తరువాత తేదీ ఖరారు చేసుకున్నాక తిరిగి అడ్వాన్సులు ఇస్తామంటూ చాలా మంది డబ్బులు రిటర్న్ ‌తీసుకున్నారని చెప్పారు. పెళ్లిళ్లపై ఆధారపడి వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఇందులో కోట్లాది రూపాయాల బిజినెస్‌ ‌ముడిపడి వుంది. ఫంక్షన్‌ ‌హాళ్లలో పని చేసే వారితో పాటు డెకొరేటర్స్, ‌క్యాటరర్స్, ‌కుక్‌, ‌సర్వర్స్, ‌మేలతాళం, బ్యాండు మేళం, ఫొటో, వీడియో గ్రాఫర్స్.. ఇలాంటి వారంతా కొరోనా కారణంగా ఉపాధికి దూరమయ్యారు. పెళ్లి పందిళ్లు తయారు చేసేవారు, డెకరేషన్‌ ‌చేసే వారు, వంటలవారు, మేలతాళంతో పాటు పంతుళ్లూ పనిలేక ఉండాల్సి వస్తోంది. సీజన్‌లో నాలుగు డబ్బులు సంపాదించాలని ఆశపడ్డ వారిని కొరోనా దారుణంగా దెబ్బ తీసింది. మరో పదిహేను, ఇరవై రోజులు ఇలాగా ఉండాల్సిన పరిస్థితుల నేపథ్యంలో వారంతా ఆందోళన చెందుతున్నారు. పెళ్లిళ్ల సీజన్‌ ‌వచ్చిందంటే చాలు వస్త్ర దుకాణాలు, బంగారు షాపులు, ఫర్నిచర్‌, ‌స్టీల్‌ ‌దుకాణాలు, లేడీస్‌ ఎం‌పోరియంలు… ఇలా రకరకాల వ్యాపారాలు జోరుగా సాగేవి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ‌విధింపు, పెళ్లిళ్ల వాయిదాలతో  లేకపోవడంతో ఆయా వ్యాపారాలన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయి.

సీజన్‌లోనే మూతవేసి ఉంచడం మూలంగా కిరాయిలు చెల్లించడం, పని వాళ్లకు జీతాలు సమకూర్చడం భారంగా మారింది. అలాగే బంగారు ఆభరణాలు చేసే స్వర్ణకారులు, పెళ్లి తంతు నిర్వహించే బ్రాహ్మణులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తంగా కొరోనా ఎంతో మంది ఉపాధికి గండి కొట్టింది.

Leave a Reply