Take a fresh look at your lifestyle.

రైతుల ప్రయోజనాల కోసం తెలుగు రాష్ట్రాలు కలిసి పని చేయాలి

దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు చేసిన ఆరోపణలను తిప్పికొట్టేందుకు తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు స్వయంగా రంగంలోకి దిగారు . పెన్షన్ల విషయంలో కమలనాథులు ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నారనీ, రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల పెన్షన్లు కలిపి మొత్తం 38 లక్షల 64 వేల మందికి ఇస్తున్నామనీ, ఇందుకు పదివేల నుంచి 11 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. పెన్షన్ల కింద కేంద్రం ఇస్తున్నది 105 కోట్లు మాత్రమేననీ, ఇంతకన్నా కేంద్రం ఎక్కువ ఇస్తున్నట్టు రుజువు చేస్తే రాజీనామా చేస్తానంటూ కమలనాథులకు కేసీఆర్ సవాల్ విసిరారు. పెన్షన్ల విషయంలో కేంద్రం అందించే నిధులు చాలక పోవడం వల్లనే రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల వాగ్దానాలను అమలు జరపడానికి తమ నిధుల్లోంచి ఎక్కువ మొత్తాన్ని కేటాయిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే తీరు సాగుతోంది. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి పెన్షన్ల కోసం కేంద్రంతో పోరాడారు. కేంద్రం ఈ మాత్రమైనా ఇస్తోందంటే ఆయన పోరాట ఫలితమే.

కేసీఆర్ శనివారం నాడు జనగామ సమీపంలో రైతువేదిక ప్రారంభించిన సందర్భంలో కేంద్రంపై ఘాటుగానే ధ్వజమెత్తారు. రైతులకు కేంద్రం చేయదు, రాష్ట్రాలు చేస్తుంటే అడ్డుపడుతోందంటూ విమర్శించారు. ఆయన లెవీ ధాన్య సేకరణ ను దృష్టిలో ఉంచుకుని ఈ విమర్శ చేశారు. భారత ఆహారసంస్థ ద్వారా లెవీ ధాన్య సేకరణ దశాబ్దాలుగా సాగుతోంది. ఈ సేకరణ విధానంపై విమర్శలు వొచ్చినప్పటికీ, దానిని సరిదిద్దాల్సింది పోయి ఆ విధానాన్ని ఎత్తేసేందుకు మోడీ ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. వ్యవసాయాన్ని కార్పొరేట్ రంగానికి అప్పగించేందుకే మోడీ ప్రభుత్వం మూడు వ్యవసాయ బిల్లులను తెచ్చిందన్న ప్రతిపక్షాల ఆరోపణ నిరాధారం కాదు. పారిశ్రామికరంగానికి బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయిల రుణాలను మంజూరు చేస్తున్న మోడీ ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులను ఆదుకోవడానికి పూర్వపు ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను నీరు గార్చేందుకు మార్గాలను అన్వేషిస్తోంది.

రాష్ట్రాలు రైతులకు రాయితీలు ఇస్తుంటే కేంద్రం ఒప్పుకోవడం లేదనీ, రైతులకు ఎక్కువ ధర చెల్లిస్తే, ఆ ధాన్యాన్ని తీసుకోబోమని భారత ఆహర సంస్థ చెప్పుతోందంటే రైతుల పట్ల కేంద్రం విధానం ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలని కేసీఆర్ పిలుపు ఇచ్చారు.ఈ సందర్భంగా వ్యవసాయ బిల్లులను ముందుగా వ్యతిరేకించింది తమ రాష్ట్రమేనని అన్నారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ పంజాబ్,రాజస్థాన్ అసెంబ్లీలు ఇటీవల తీర్మానాలు చేశాయి. దేశంలో మొదటి సారిగా రైతులకు వేదికను నిర్మించే బృహత్ కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం చేపట్టిందని కేసీఆర్ ప్రకటించారు.అది నిజమే కానీ, రైతులు సమావేశం కావడానికి వేదికలు అవసరం లేదు. రచ్చబండలు ఉంటాయి. గ్రామాల్లో రైతులు పండించే పంటను భద్రపర్చుకోవడానికి గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజిలు నిర్మించాలి . రైతులకు నిజంగా సాయమందించాలంటే వెంటనే వీటి నిర్మాణాలు చేపట్టడం ముఖ్యం ,. భారత ఆహార సంస్థ గిడ్డంగులను రైతులకు ఉపయోగ పడే రీతిలో తీర్చిదిద్దేట్టు కేంద్రంపై ఒత్తిడి తేవాలి.

ధాన్య సేకరణ బాధ్యత నుంచి క్రమంగా తప్పుకోవాలని భారత ఆహార సంస్థ ఆలోచిస్తోంది. లేదా, రాష్ట్రాలు ఇచ్చే ధరకి బదులు తాము నిర్ధారించే ధరకే సేకరించాలని చూస్తోంది. దీని వల్ల రైతులకు చేయాలనుకున్న మేలు జరగదన్న కేసీఆర్ మాటల్లో నిజం ఉంది.అయితే, కేంద్రం నుంచి సాయం ఆశించకుండా రాష్ట్రాలు సొంతంగా రైతుల కోసం ప్రవేశపెట్టే పథకాలను సమన్వయ పర్చి పంటను కాపాడుకోవడానికి, ధర వొచ్చినప్పుడు అమ్ముకోవడానికి వీలు కల్పించాలి.అప్పుడే రైతులకు సాయం చేసినట్టు అవుతుంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం బాగా ఉందని రైతు సంఘాల వారు పేర్కొంటున్నారు. కనుక, వరి పండించే రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉన్న తెలుగు రాష్ట్రాలు రైతుల వద్ద ధాన్యం మంచి ధర చెల్లించి కొనుగోలు చేయడానికి సమన్వయంతో కృషి చేయాలన్నది తెలుగువారి ఆకాంక్ష. పాలనా సౌలభ్యం కోసం విడిపోయినా, రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు కలిసి పని చేయడంలో తప్పేమీ లేదు. సాగునీటి సౌకర్యాల కోసం కూడా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి పని చేయాలన్నది ప్రజల ఆకాంక్ష.

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ను దక్షిణాది ధాన్యాగారమని అభివర్ణించేవారు. ఆ పేరును నిలబెట్టుకోవడానికి తెలుగు రాష్ట్రాలు కృషి చేయాలి. కాళేశ్వరం జలాశయాన్ని నింపి, తెలంగాణలో చెరువులకు పూర్తి స్థాయిలో నీరు అందించింది తమ ప్రభుత్వమేనని కేసీఆర్ పదే పదే అంటున్నారు.అదే సందర్భంలో తెలుగు రాష్ట్రాల్లో ఇతర ప్రాజెక్టుల పూర్తికీ, రైతులకు సాధ్యమైనంత గరిష్టంగా సాయం అందించడానికి తన అనుభవాన్ని ఉపయోగించి కృషి చేస్తే ఆయనకు రైతు బాంధవుడనే పేరు సార్ధకమవుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లు విడిపోయినా కలిసి అభివృద్ధికి కృషి చేయాలన్న ప్రకటనలను నిజం చేసినప్పుడే నాయకుల నిబద్ధతను ప్రజలు విశ్వసిస్తారు. రాష్ట్రాలు ఎంతో కాలంగా అనుభవిస్తున్న ప్రయోజనాలను కత్తిరించాలని కేంద్రం ముఖ్యంగా, మోడీ ప్రభుత్వం ఆలోచిస్తున్న మాట నిజమే. ఒక్క తెలంగాణాపైనో, తెలుగు రాష్ట్రాల పైనో అని కాకుండా ఖర్చు తగ్గించుకునేందుకు కేంద్రం అనేక దారులను అన్వేషిస్తోంది. అందువల్ల తమ ప్రయోజనాల కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి పనిచేయడంలో తప్పులేదు. రాజకీయాలకు అతీతంగా కలిసి పని చేస్తే వారికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా సాయం అందుతుంది.

Leave a Reply