Take a fresh look at your lifestyle.

కుంభవృష్టితో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం

తీవ్ర వాయుగుండం ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో కుంభవృష్టి వల్ల ఎక్కడి ప్రజలు అక్కడే చిక్కుకున్న పరిస్థితులు నెలకొన్నాయి. రైలు మార్గాలపై మీటరు పైగా ఎత్తున వర్షపు నీరు ప్రవహిస్తోంది. రోడ్ల సంగతి సరేసరి. అవి రోడ్లో, కాలువలో తెలియని పరిస్థితి నెలకొంది. వాహన చోదకులు సాహసం చేసి రోడ్డు మీదికి వెళ్తే ఎక్కడికక్కడే బందీలు కావల్సి వస్తోంది. ఇంతటి భీకరమైన కుంభవృష్టి తుపాను సమయాల్లో కూడా లేదని అనుభజ్ఞులు చెబుతున్నారు. పక్కా భవనాల్లో ఉన్నవారే బిక్కుబిక్కుమని గడపాల్సిన పరిస్థితి వచ్చిందంటే పూరిగుడిసెలు, రేకుల షెడ్లలో ఉన్న వారు ఎంతటి భయాందోళనతో గడుపుతున్నారో ఊహించవచ్చు. హైదరాబాద్‌ ‌పాత బస్తీలో రెండు రోజుల క్రితం రేకుల షెడ్డు కూలింది. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడిన సంఘటనలో మరణాలు, గాయపడటం వంటివి చోటు చేసుకున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరుకోవడంతో 7 గేట్లను ఎత్తివేశారు. జురాలాలో గరిష్ట స్థాయిలో నీటి మట్టం చేరడంతో 20 గేట్లు ఎత్తివేశారు. దిగువకు నీరు వదులుతుండడంతో కృష్ణా నది పరవళ్ళుతొక్కుతోంది. విజయవాడ బరాజ్‌ ‌వద్ద ప్రస్తుతం రెండు లక్షల క్యుసెక్కుల నీరు ప్రవహిస్తోంది. అది ఆరు లక్షలకు పెరగవచ్చని సమాచారం అందడంతో కరకట్టకు దిగువన ఉన్న భవనాల్లో ఉన్న వారిని ఖాళీ చేయమని నోటీసులు పంపారు. ఆ భవనాల్లో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నివాస గృహం కూడా ఉంది. ఆంధప్రదేశ్‌లో వర్షబీభత్సం ఉధృతంగా ఉంది. తెలంగాణాలోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లానూ, నల్లగొండ, వనపర్తి జిల్లాలలో భారీ వర్షం నమోదు అయింది.

ఖమ్మం జిల్లా వేంసూరులో 18.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌ ‌వచ్చే రహదారిపై వర్షపు నీరు చేరుకోవడంతో వాహనాలు స్తంభించి పోయాయి. నిడదవోలు రైల్వే స్టేషన్‌లో రైలుమార్గంపై మీటరు ఎత్తున నీరు ప్రవహించడంతో అతి కష్టం మీద గూడ్సు రైలును కదిలించారు. అలాగే, విశాఖ జిల్లాలో చిమిడిపల్లి వద్ద రైలు మార్గంపై కొండచరియలు విరిగి పడటంతో రైళ్ళకు అంతరాయం కలిగింది. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల చెక్‌ ‌డ్యాంలు కొట్టుకుని పోయాయి. ద్విచక్రవాహనాలు, కార్లు, ఇతర వాహనాలు ఎక్కడికక్కడ దిగబడి పోయాయి. రహదారులన్నీ జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో రాకపోకలకు తీవ్రమైన అంతరాయం కలిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల జలాశయాల్లో నీటి మట్టం పెరగడంతో నీటి కొరత తీరుతుంది. హిమాయత్‌ ‌సాగర్‌ ‌జలాశయంలో, ఇతర జలాశయాల్లో నీటి మట్టం గరిష్టస్థాయికి చేరుకుంది. మంచినీటి సమస్య తీరవచ్చని భావిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాల రహదారులన్నీ జలమయం కావడంతో రాకపోకలు స్తంభించాయి. గిరిజన గ్రామాలకు వైద్య సౌకర్యం అసలే అంతంత మాత్రం ఇప్పుడు మరింత దుర్లభం అయింది. అలాగే, ఖమ్మం, వరంగల్‌ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలు, నగరాలకు వచ్చే వ్యవసాయఉత్పత్తులు, పాలు, తదితర నిత్యావసరాల రవాణాకు తీవ్రమైన అంతరాయం కలిగింది. కొరోనా కాలంలో పాఠశాలలు, విద్యా సంస్థలు మూత పడినందున విద్యార్థులకు ఇబ్బందులు లేకపోయినా, ఉద్యోగులు, ప్రైవేటు సంస్థల్లో పని చేసే వారు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం.

తీర ప్రాంతాల్లో జాలర్లను చేపల వేటకు వెళ్ళవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఓడ రేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల కారణంగా రెండు రాష్ట్రాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నందున చెదురుమదురు సంఘటనలు మినహా పెద్దగా ప్రాణనష్టం సంభవించలేదు. ఆస్తి నష్టం వివరాలు నీరు తీసిన తర్వాత కానీ తెలియవు. చేతికి అందివచ్చిన పంట నీట మునగడం వల్ల నష్టపోతామన్న భయం రైతుల్లో ఉంది. జలమయమైన గ్రామాల్లో బాధితుల కోసం పునరావాస కేంద్రాలను తెరిచారు. అయితే, రైతులు, గ్రామీణులు తమ ఇళ్ళ వద్ద ఉండేందుకే ఆసక్తిని చూపుతున్నారు. ఈ వర్షాల ప్రభావం రెండు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై తీవ్రంగా ఉండవచ్చు. కొరోనా కారణంగా ఇప్పటికే ఆర్థికంగా నష్టపోయిన తెలుగు రాష్ట్రాలు కుంభవృష్టి కారణంగా మరింతగా నష్టాలకు గురి కావల్సి వస్తుందుదేమోనన్న భయాలు సర్వత్రా కనిపిస్తున్నాయి. తెలంగాణ శాసనసభ మంగళవారం నాడు హైదరాబాద్‌ ‌మునిసిపల్‌ ‌చట్టం సవరణపై ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో వర్షబీభత్స పరిస్థితిని వివరించేందుకు పలువురు ప్రయత్నించినా అవకాశం దొరకలేదు. ప్రభుత్వం ప్రజల అజెండా కోసం కాకుండా సొంత అజెండా కోసమే అసెంబ్లీని సమావేశపర్చినట్టు కనిపిస్తోంది. ఎల్‌ఆర్‌ఎస్‌ ‌రద్దు చేయాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోలేదు. వర్షాల వల్ల కష్టాల పాలైన రైతుల గురించి చర్చించకుండానే మొక్కుబడి సమావేశాన్ని నిర్వహించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. వర్షబాధితుల పాట్లు వర్ణనాతీతం.

Leave a Reply