Take a fresh look at your lifestyle.

తెలంగాణా ప్రభుత్వం ఎన్‌పిఆర్‌, ఎన్‌ఆర్‌సిలను కూడా నిర్ద్వందంగా తిరస్కరించాలి

“యంత్రాంగం చేసిన పొరపాట్లకు తమకు న్యాయబద్ధంగా రావలసిన పథకాలను కోల్పోయినవాళ్ళు ఎంతోమంది! సంక్షేమ పథకాలలోనూ ఇదే పరిస్థితి. వీటి పరిస్థితి మరీ ఘోరం. లబ్దిదారులు తమ పార్టీకి అనుకూలవర్గం కాకపోతే వారి పేర్లు జాబితా నుంచీ తీసివేయబడతాయి కూడా! ఇన్ని రకాల సంక్లిష్ట పరిస్థితుల్లో ఇప్పుడు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సి రావటం అనేది ప్రజలందరి నెత్తిమీద వేలాడుతున్న కత్తి. మొదట్లో ఇది కేవలం ముస్లిం మతస్థులకు మాత్రమే అనుకున్న చాలామంది సామాన్య ప్రజలకు ఇది ప్రజలందరి సమస్య అని అర్థం అవుతోంది.”

The Telangana government must also reject the NPR and NRC

ఏదైనా గెజిటెడ్‌ అధికారి సంతకం అవసరమయ్యి ప్రభుత్వ ఆఫీసులకు వెళ్ళాల్సి వచ్చే సామాన్య ప్రజలను అడిగితే ఆ ప్రక్రియ ఎంత హింసాత్మకంగా వుంటుందో వైనవైనాలుగా చెబుతారు. తమకు సంబంధించిన రుజువులు చూపించినప్పటికీ ఎన్ని రకాల అనుమానాస్పద చూపుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందో వివరిస్తారు. గత పదిహేను సంవత్సరాలుగా క్షేత్ర స్థాయిలో రైతు ఆత్మహత్యల మీద పనిచేస్తున్న వాళ్ళంగా ఇలాంటి కథనాల్ని ఎన్నో విన్నాం. సాక్షాత్తూ కలెక్టరు, ఎమ్మార్వో స్థాయిలో వుండే అధికారులు కూడా బాధిత కుటుంబ సభ్యుల పట్ల చులకనగా మాట్లాడటం, తీసుకువచ్చిన డాక్యుమెంట్స్ ‌సరైనవి కావని, నకిలీ సర్టిఫికెట్లు తెస్తారని, తాగి సచ్చిపోతే ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తోందని రైతు ఆత్మహత్యలుగా చెబుతున్నారని, నష్టపరిహారం కోసం ఆత్మహత్య చేసుకుంటున్నారని(!!!!?) ….ఇలా ఎన్నో రకాల విచ్చలవిడి ఆరోపణలు ప్రత్యక్షంగా విన్నాం. నిజానికి ఆ అధికారులెవరికీ అలా మాట్లాడే అధికారం, హక్కు లేవు. కానీ, తమ అధికార స్థానబలాన్ని ఉపయోగించుకుని తమ దగ్గరకు సాయంకోరి వచ్చిన నిస్సహాయుల మీద అకారణంగా తమ స్వంత డబ్బేదో దోచేయటానికి వచ్చిన దోపిడీదారులుగా చిత్రించి మాట్లాడేవారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలకు పాల్పడింది ప్రధానంగా బిసీ సామాజిక కులాలకు సంబంధించిన వాళ్లే! తర్వాత షెడ్యూలు కులాలు, తెగలకు సంబంధించిన సామాజిక వర్గాలు వుంటాయి. చాలా అరుదుగా ముస్లిం సామాజిక వర్గం కనిపిస్తుంది. కనిపించిన ఆ ఒక్కరిద్దరి పట్ల కూడా వీళ్లు ఎలా వ్యవసాయదారులవుతారంటూ కొట్టిపారేసే పరిస్థితి కూడా వుంది.

ఈ మధ్యనే భూముల క్రమబద్దీకరణ పేరుతో జరిగిన తతంగాన్ని కూడా చూశాం. అప్పుడు ప్రభుత్వ యంత్రాంగం చేసిన అవకతవకలను, సాంకేతిక పొరపాట్లకు బలైన రైతాంగం ఇప్పటికీ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ అవమాన పడుతూనే వున్నారు. యంత్రాంగం చేసిన పొరపాట్లకు తమకు న్యాయబద్ధంగా రావలసిన పథకాలను కోల్పోయినవాళ్ళు ఎంతోమంది! సంక్షేమ పథకాలలోనూ ఇదే పరిస్థితి. వీటి పరిస్థితి మరీ ఘోరం. లబ్దిదారులు తమ పార్టీకి అనుకూలవర్గం కాకపోతే వారి పేర్లు జాబితా నుంచీ తీసివేయబడతాయి కూడా! ఇన్ని రకాల సంక్లిష్ట పరిస్థితుల్లో ఇప్పుడు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సి రావటం అనేది ప్రజలందరి నెత్తిమీద వేలాడుతున్న కత్తి. మొదట్లో ఇది కేవలం ముస్లిం మతస్థులకు మాత్రమే అనుకున్న చాలామంది సామాన్య ప్రజలకు ఇది ప్రజలందరి సమస్య అని అర్థం అవుతోంది. వారికి, ఇప్పుడిప్పుడే సిఏఏ(పౌరసత్వ సవరణ చట్టం), ఎన్‌ఆర్‌సి(జాతీయ పౌర రిజిస్టర్‌), ఎన్‌పిఆర్‌(‌జాతీయ పౌర గణన) వెనుకనున్న అసలు వాస్తవాలు అర్థం అవుతున్నాయి కానీ అవి కార్యాచరణలోకి వస్తే పరిస్థితి ఏమిటి అనే మీమాంసలో వున్నారు. కానీ మధ్యతరగతి విద్యావంతులైన హిందువులు ఇంకా ఇది తమ సమస్య కాదని, తమకు మినహాయింపు వుందనే అనుకుంటున్నారు. ఒకపక్క పార్లమెంట్‌లో పౌరసత్వ సవరణ చట్టాన్ని సిఏఏ వ్యతిరేకించిన తెలంగాణా ప్రభుత్వం, తమ వ్యతిరేకతను తెలియజేస్తున్న ప్రజల మీద తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తోంది. ఇంకోపక్క తెలంగాణా రాష్ట్ర అసెంబ్లీ కూడా సిఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని రాష్ట్ర కాబినెట్‌ ‌నిర్ణయించినట్లు మీడియాలో, సామాజిక మాధ్యమాలలో ప్రకటించారు. కానీ ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌లను నిర్ద్వందంగా తిరస్కరస్తామని మాత్రం అనటం లేదు. పైగా, జనగణనలో (సెన్సెస్‌) ‌భాగంగా ఎన్‌పిఆర్‌ ‌షెడ్యూలు ఉంటుందని కేంద్ర ప్రభుత్వ సెన్సెస్‌ ‌విభాగం జారీ చేసిన గెజిట్‌ ‌కు అనుకూలంగా ఎన్‌పిఆర్‌ ‌సేకరణ సమయంలో పాటశాలలు ఏ పరీక్షలూ లేకుండా ఖాళీగా వుండాలని విద్యాశాఖ ఆదేశాలు కూడా జారీ చేసింది. జిల్లా కలెక్టర్లు కూడా దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేస్తున్నారు. అంటే, రాష్ట్ర ప్రభుత్వం పౌర సవరణ చట్టం సిఏఏ మీద ప్రకటిస్తున్న వైఖరి సందేహాస్పదమే అనిపిస్తోంది!

సిఏఏకు మొదటి మెట్టు ఎన్‌పిఆర్‌. ఆ ‌తర్వాత ఎన్‌ఆర్‌సి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎన్‌పిఆర్‌ని సెన్సెస్‌ ‌తో ముడిపెట్టడం అంటేనే చాపకింది నీరులా ప్రమాదాన్ని తీసుకురావటం. జనగణన పేరుతో వాళ్లకు కావలసిన వివరాలను సేకరించడం! కానీ వాళ్లకు కావలసిన సమాచారం రానప్పుడు వారిని ‘అనుమానాస్పద’ పౌరులుగా గుర్తిస్తారు. ఇంతకూ ఏమి సమాచారం అడగబోతున్నారు? ప్రతిఒక్కరూ తమ పుట్టినతెదీ, సంవత్సరం చెప్పాలి. ఎక్కడ పుట్టారో చెప్పాలి. భారత దేశం లోనే పుట్టారా, లేక వేరే దేశంలో పుట్టారా అనేది చెప్పాలి. మన జాతీయత ఏమిటి అని అడుగుతారు. అవి సరైనవా కాదా అని పరిశీలిస్తారు. మన గుర్తింపు పత్రాలుగా వున్న ఆధార్‌, ‌వోటర్‌, ‌పాన్‌ ‌నెంబర్‌, ‌ఫోన్‌ ‌నెంబర్‌ ‌వంటివాటినన్నిటినీ నమోదు చేసుకుంటారు.ఎక్కడైనా వారికి అనుమానం అనిపిస్తే ‘అనుమానాస్పదం’ గా రాస్తారు. అంటే అసలు సమస్య ఇక్కడి నుంచీ మొదలవుతుంది. అనుమానాస్పదంగా గుర్తించిన వారు తమ వివరాలన్నీ సరైనవే అని ఎన్‌ఆర్‌సిలో నిరూపించుకోవాల్సి వుంటుంది. అక్కడ కూడా విఫలమయితే వారు ఈ దేశ పౌరుల కింద లేక్కకురారు. అంటే విదేశీయుల కిందకు వస్తారు. పౌరసత్వ సవరణ చట్టం పేరుతో ఈ దేశ ప్రజల భవితవ్యాన్ని అత్యంత ప్రమాదకరమైన అస్తిరత్వంలోకి నెట్టేసే ప్రక్రియ మొదలయింది.

మన దేశంలోఅత్యధికులు నిరక్షరాస్యులు. అనేకమందికి తమ పుట్టిన తేదీ ఎప్పుడో తెలిసే అవకాశం లేదు. తాత తల్లిదండ్రుల విషయమైతే చెప్పనవసరం లేదు. ఎక్కడ పుట్టారనేది తెలిసే ముచ్చటే లేదు. ఈ దేశ అసంఖ్యాక గ్రామీణ శ్రామిక మహిళల కాన్పులు ఇండ్లలోనో, పనికి వెళ్ళినప్పుడు పొలం గట్ల మీదో జరిగాయనేది వాస్తవం. ఇప్పటికీ అనేక ఆదివాసీ గ్రామాలకు సరైన రవాణా సౌకర్యం లేదు. కాన్పు సక్రమంగా జరిగితే దేవుడి దయ అనుకునే పరిస్థితులే వున్నయి . ఇలాంటి సామాజిక పరిస్థితులున్నచోట పౌరగణన, రిజిస్ట్రీ పేరుతో ఆధారాలు తీసుకు రమ్మని చెప్పటం అత్యంత క్రూరమైన పరిహాసం. ఇది కేవలం ముస్లిం సామాజిక వర్గానికే పరిమితమయ్యే విషయం కాదని ఈపాటికి అందరికీ అర్థమయ్యి వుండాలి. ముఖ్యంగా దళిత, ఆదివాసీ, ట్రాన్స్ ‌జెండర్‌ ‌సమూహాలు, వంటరి మహిళలు, తల్లీతండ్రీ లేని పెద్దల సంరక్షణ లేని అనాథ పిల్లలు, నివాసమే లేని ప్రజలు, సంచార జాతుల సమూహాలు ఇంకా అనేకమంది జీవితాలు మరింత దుర్భర పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్నాయి. మామూలు సమయాలలోనే తమ కంటే సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్ధికంగా చాలా కింది స్థాయిలో వుండే ప్రజల పట్ల అనుచితంగా వుండే అధికార యంత్రాంగం ఇప్పుడు ప్రజల మీద రుద్దబడుతున్న ఈ జాతీయ పౌరగణన ఎన్‌పిఆర్‌, ‌జాతీయ పౌరసత్వ రిజిస్టర్‌ ఎన్‌ఆర్‌సిలను అమలుచేసే క్రమంలో ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడదని ఏమైనా నమ్మకం ఉందా! పౌరసత్వాన్ని నిరూపించుకోలేక పోతే దేశంలోకి అక్రమంగా వలస వచ్చిన వారుగా ముద్రపడి ఏ రకమైన ప్రభుత్వ సంక్షేమ పథకాలకూ అర్హులుగా లేక , ప్రాథమిక హక్కులను కూడా కోల్పోయి నిర్బంధ శిబిరాలలోకి నెట్టివేయబడతారు. డెబ్భై సంవత్సరాల లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశాన్ని మత ప్రాతిపదికన వెనుకబాటుతనం లోకి నడిపించటానికి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం, దాన్ని అమలు చేసే ప్రక్రియ. ఇదీ మన దేశ భవిష్యత్‌ ‌చిత్రపటం!!!!! తెలాంగాణ ప్రజానీకం దీనికి అంగీకరిస్తుందా….ప్రతిఘటిస్తుందా?????.

Leave a Reply