Take a fresh look at your lifestyle.

నోట్ల రద్దును సుప్రీమ్‌ ‌కోర్టు పూర్తిగా సమర్థించలేదు

  • మెజార్టీ ధర్మాసనం మాత్రమే ఆమోదించింది
  • తీర్పుపై కాంగ్రెస్‌ ‌నేత చిదంబరం

చట్టవిరుద్ధ మార్గంలో జరిగినట్లు ఒక న్యాయమూర్తి పేర్కొనడం ప్రభుత్వానికి చెంపపెట్టని వాఖ్య
న్యూ దిల్లీ, జనవరి 2 : నోట్ల రద్దుపై సుప్రీమ్‌ ‌కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత చిదంబరం అన్నారు. ఈ నిర్ణయాన్ని అందరూ సమర్థించారా? ప్రభుత్వం వాటి లక్ష్యాలను సాధించిందా అనే అంశాన్ని ప్రస్తావించడం అవసరమని తెలిపారు. మెజారిటీ ధర్మాసనం దీనికి మద్దతు పలికినప్పటికీ..మైనార్టీ తీర్పు మాత్రం ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని చిదంబరం పేర్కొన్నారు. నోట్ల రద్దు చట్టవిరుద్ధమంటూ జస్టిస్‌ ‌బీవీ నాగరత్న చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ చిదంబరం ఈ విధంగా స్పందించారు. ‘నోట్ల రద్దుపై భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవిస్తాం. అయినప్పటికీ, ఈ నిర్ణయాన్ని అందరూ సమర్థించారా, ప్రభుత్వం వాటి లక్ష్యాలను సాధించిందా అనే అంశాన్ని ప్రస్తావించడం అవసరం.

లక్ష్యాలను సాధించే అంశంపై సుప్రీమ్‌ ‌కోర్టులోని మెజారిటీ ధర్మాసనం స్పష్టత ఇచ్చింది. ఇదే సమయంలో నోట్ల రద్దు చట్టవిరుద్ధ మార్గంలో జరిగినట్లు ధర్మాసనంలోని ఒక న్యాయమూర్తి పేర్కొనడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇది ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిది’ అని  చిదంబరం అభిప్రాయపడ్డారు. నోట్లరద్దు నిర్ణయం విజ్ఞతను సమర్ధించడం కానీ, నోట్ల రద్దు లక్ష్యం నెరవేరిందని కానీ సర్వోన్నత న్యాయస్ధానం పేర్కొనలేదని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రూ .1000, రూ .500 నోట్ల రద్దు నిర్ణయాన్ని తోసిపుచ్చలేమని సుప్రీమ్‌ ‌కోర్టు రాజ్యాంగ ధర్మాసనం 4-1 తేడాతో స్పష్టం చేసింది. మరోవైపు నోట్ల రద్దు చట్టవిరుద్ధమని జస్టిస్‌ ‌బీవీ నాగరత్న పేర్కొన్నారు. ఆర్‌బీఐ బోర్డు నోట్ల రద్దుకు స్వతంత్రంగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని, ప్రభుత్వ సలహాలో ఆర్‌బీఐ నోట్ల రద్దు చేపట్టరాదని పేర్కొన్నారు. మైనారిటీ జడ్జిమెంట్‌ను చిదంబరం ప్రస్తావిస్తూ నోట్ల రద్దు నిర్ణయం వెనుక అక్రమాలు, లోపభూయిష్ట విధానాలను ఈ తీర్పు తప్పుపట్టిందని, తాము ఈ జడ్జిమెంట్‌ ‌పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. అయితే ప్రభుత్వం ద్వారా కాకుండా పార్లమెంట్‌ ‌ద్వారా ఆ చర్య చేపడితే బాగుండేదని జస్టిస్‌ ‌బీవీ నాగరత్న తెలిపారు.

Leave a Reply