Take a fresh look at your lifestyle.

కొరోనా మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాల్సిందే

  • కేంద్రానికి సుప్రీమ్‌ ‌కోర్టు ఆదేశం
  • ఆరు వారాల్లోగా వివరాలు అందచేయాలని ఆదేశం
  • ఈ విషయంలో డిజాస్టర్‌ ‌మేనేజ్‌ ‌మెంట్‌ అథారిటీ ఫెయిల్‌ అయిందని వ్యాఖ్య

కొరోనా మృతుల కుటుంబాలకు కనీస నష్ట పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీమ్‌ ‌కోర్టు స్పష్టం చేసింది. కోవిడ్‌ ‌మృతులకు నష్టపరిహారం చెల్లించే పిటిషన్‌పై బుధవారం జస్టిస్‌ అశోక్‌ ‌భూషణ్‌ ‌ధర్మాసనం తీర్పు వెలువరించింది. కొరోనా వల్ల చనిపోయిన కుటుంబాలకు ఎంత నష్ట పరిహారం అన్నది కేంద్రమే నిర్ణయించాలని కోర్టు తెలిపింది. విపత్తు చట్టం ప్రకారం పరిహారం ఇవ్వడం తప్పనిసరి కాదని కేంద్రం తన వాదనలు వినిపించింది. కానీ కేంద్ర ప్రభుత్వ వాదనను సుప్రీమ్‌ ‌కోర్టు తిరస్కరించింది. విపత్తు నిర్వహణ చట్టం సెక్షన్‌ 12 ‌ప్రకారం పరిహారం ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే అని కోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలపై కేంద్రం స్పందిస్తూ..తమ వద్ద సరిపోయినన్ని నిధులు లేవని కోర్టుకు తెలిపింది.

కేంద్ర వాదనను అంగీకరించని కోర్టు మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇవ్వాలనేది కేంద్రమే నిర్ణయించి 6 వారాల్లో విధివిధానాలు తయారు చేయాలని సూచించింది. విపత్తులో చనిపోయిన వారికి నష్టపరిహారం ఇవ్వాలని రికమండేషన్‌ ‌చేయడంలో డిజాస్టర్‌ ‌మేనేజ్‌ ‌మెంట్‌ అథారిటీ ఫెయిల్‌ అయిందని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో కోవిడ్‌ ‌మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపు విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కోవిడ్‌ ‌కారణంగా మృతి చెందిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపుపై 6 వారాల్లోగా మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్రాన్ని సుప్రీమ్‌ ‌కోర్టు బుధవారంనాడు ఆదేశించడంతో ఇక కేంద్రం చేతులెత్తేయడానికి లేకుండా పోయింది.

ఎలాంటి ఎక్స్‌గ్రేషియా చెల్లించలేమంటూ కేంద్రం చేసిన విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. జస్టిస్‌ అశోక్‌ ‌భూషణ్‌ ‌సారథ్యంలోని సుప్రీమ్‌ ‌కోర్టు త్రిసభ్య బెంచ్‌ ‌తాజా ఆదేశాలిచ్చింది. కోవిడ్‌ ‌కాంప్లికేషన్స్‌తో మృతి చెందిన కేసుల్లోనూ డెత్‌ ‌సర్టిఫికెట్‌ ‌జారీ చేసేందుకు మార్గదర్శకాలను సులభతరం చేయాలని కూడా సుప్రీమ్‌ ‌కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. కోవిడ్‌ ‌మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున చెల్లించాలని కోరుతూ దాఖలైన ఒక పిటిషన్‌పై ‘సుప్రీమ్‌’ ‌ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది.

Leave a Reply