- టిఆర్ఎస్ది కర్షక ప్రభుత్వం-బిజెపిది కార్పోరేట్ ప్రభుత్వం
- కెనడా ప్రధాని స్పందించినా..మోదీ ప్రభుత్వం స్పందించడం లేదు
- తూప్రాన్ దిగ్బంధనంలో మంత్రి హరీష్రాావు
తెలంగాణలో రైతుల పోరాటం ప్రారంభమైంది. కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక మూడు బిల్లులు రద్దయ్యే వరకు తెలంగాణ పోరాడుతుంది. ప్రతీ గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌లలో తీర్మానాలు చేద్ధాం. రైతు సభలు పెట్టి తీర్మానాలు చేయాలి. కేంద్రంపై ఒత్తిడి తెద్దాం. భారత్ బంద్ సక్సెస్‌తో ఈ పోరాటం ప్రారంభమైంది. రైతుల పక్షాన టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమస్పూర్తితో పోరాటం చేస్తామనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. భారత్ బంద్‌లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి మెదక్ జిల్లా తూప్రాన్ వై జంక్షన్ వద్ద మంగళవారం జరిగిన రహదారి దిగ్భంధంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ..దేశంలో రైతులు చేస్తున్న పోరాటానికి కెనెడా ప్రధాని స్పందించారనీ, దేశ ప్రధాని మోదీ మాత్రం స్పందించడం లేదన్నారు.
ప్రస్తుతం దేశంలో 23 పంటలకు మద్ధతు ధర ఇస్తున్నారనీ, ఈ మద్ధతు ధరను నరేంద్ర మో , బీజేపీ ప్రభుత్వం మద్ధతు ధర లేకుండా చేస్తోందనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి పార్టీ ప్రభుత్వం తెచ్చిన మూడు చట్టాల్లో ఒక చట్టం రైతుకు మద్ధతు ధర లేకుండా చేస్తోందన్నారు. రైతు ఎక్కడైనా పంటను అమ్ముకోవడానికి చట్టం తెచ్చామని చెబుతున్నారనీ, కానీ, ఇది తేనే పూసిన కత్తి లాంటి చట్టమనీ, చెప్పుకోవడానికి అందంగానే ఉంది. కానీ, అమలులో ఆచరణ సాధ్యం కాదన్నారు. దేశంలో 86 శాతం మంది ఐదెకరాల కన్నా తక్కువ ఉన్న రైతులు ఉన్నారనీ, తెలంగాణలో 92.5 శాతం మందికి 5 ఎకరాల కన్నా తక్కువ ఉన్నవారు ఉన్నారన్నారు.
ఇలాంటి రైతు తమ పంటను పంజాబ్‌లోనో, చత్తీస్ఘడ్, బొంబాయి, నాగపూర్ వెళ్లి అమ్ముకుంటారా? ఇది సాధ్యమేనా?అని ప్రశ్నించారు. దేశంలో రైతులందరూ కళ్లంలోనే పంటను అమ్ముతారు. తెలంగాణ అందుకే ఊరి ఊరికి ఐకేపీ కేంద్రం పెట్టి అక్కడే రైతు ధాన్యం కొని మద్ధతు ధర ఇస్తుందన్నారు. రైతుల కోసం టిఆర్ఎస్ పార్టీ అనేక పథకాలను అమలు చేస్తుంటే..కేంద్రంలోని బిజెపి పార్టీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తెస్తూ కార్పోరేట్ సంస్థలు బాగుపడేలా చేస్తుందన్నారు.