Take a fresh look at your lifestyle.

నాటి పోరాట పటిమ మరువలేనిది

‘నాకు వయసుంటే లంచగొండితనం మీద మహా ఉద్యమాన్ని నిర్మించేవాడిని’. ప్రస్తుత సమాజంలో పేరుకు పోయిన అవినీతి, అసమానతలను గాంధీ గారు చూస్తే బహుశః ఆ ‘మహాత్ముడి’ గుండె పగులుతుందేమో. నేడు నెలకొన్న స్వేచ్ఛ కన్నా బానిసత్వమే నయమనిపిస్తుంది. కాలాలు మారినా, భావాలు మారినా మానవీయత స్థానంలో దానవీయతకు అవకాశం ఈయకూడదు. నైజాం రాష్ట్ర ఆంధ్ర ప్రజల్ని చైతన్య పరచడంలో ఆంధ్ర మహాసభ పాత్ర ఎనలేనిది. ఆ మహోద్యమంలో ఎందరో మహనీయులు ఎన్నో కష్టనష్టాలకోర్చి కృషి చేసారు. 1930 నుంచి 1946 దాకా తెలంగాణా అంతటా పదమూడు మహాసభలు జరుపుకొన్న ఈ ఉద్యమంలో నల్లగొండ (నీలగిరి) జిల్లాకు చెందిన నాతో పాటు రావి నారాయణరెడ్డి నాలుగు ఆంధ్ర మహాసభలకు అధ్యక్షత వహించారు. ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావుకు నేను ప్రియశిష్యుణ్ణి.

మాడపాటి హన్మంతరావుతో పాటు బూర్గుల రామక్రిష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి, కొండవీటి వేంకట రంగారెడ్డిలు నాకెంతో సన్నిహితులు. నైజాం నిరంకుశ పాలనతో నవనాడులు కృంగిపోయిన తెలంగాణా ప్రజలను జాగృత పరిచే కార్యక్రమాలలో వీరందరితో కలిసి నేను పనిచేసాను. 1931న దేవరకొండలో బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన రెండవ ఆంధ్ర మహాసభకు ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా ఉన్నాను. ఆ తరువాత 1934లో ఖమ్మం లో జరిగిన మూడవ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించాను. 1945 నాటికి ఆంధ్ర మహాసభ రావి నారాయణ రెడ్డి అధ్యక్షతన రెండుగా చీలింది. పరిపూర్ణ గాంధేయవాదం పట్ల అచంచల నిబద్ధత కలిగిన నన్ను జమీందారుగా చిత్రీకరిస్తూ కమ్యూనిస్టులు పాటలు పాడేవారు. అయినప్పటికీ రావి నారాయణరెడ్డితో నాకు ఎన్నడూ వ్యక్తిగత సంబంధాలు చెడిపోలేదు.

1948లో మిలిటరీ చర్య జరుగుతున్న పుడు నిజామ్‌ ‌సేనలు గ్రామాలలో పడి ఎన్నో అరాచకాలను చేశారు. ఎంతో మంది నాయకులను, యువకులను, నిలువునా కాల్చి వేసారు. ఎందరో స్త్రీలను చెరిచారు. ధాన్యం, బంగారం, ధనం దోచుకున్నారు. కనిపించిన ప్రతీ దానిపై, వారికి చేయాలనిపించిన పనల్లా చేసారు. ఈ విధంగా అంతులేని దౌర్జన్యాలతో చెలరేగుతున్న రజాకారు రాకాసి మూకలను అదుపు చేయడానికి నేను పోలీసు అధికారులతో కలిసి వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకున్నాను. ఈ రజాకార్ల రాక్షసత్వాన్ని తట్టు కోలేని కమ్యూనిస్టులు ఒకవైపు, ముస్లిం నాయకులు మరొక వైపు, వీరి జమీందారీ బంధువులు ఇంకొక వైపు నా విశాలమైన ఇంట్లో తలదాచుకొనేవారు. పరస్పరంగా వైరుధ్యాలు కలిగిన పై మూడు వర్గాలను రక్షించడంలో నేను.. పులిజాల వెంకట రంగారావు… ఎన్నో కష్టనష్టాలను భరించాను.

నైజాం రాష్ట్రాన్ని అప్పటి తొలి కేంద్ర హోం మంత్రి సర్దార్‌ ‌వల్లభాయ్‌ ‌పటేల్‌ ‌నేతృత్వంలో భారత దేశంలో విలీనం చేసే ముందు తెలంగాణా జిల్లాలను వేరు చేస్తూ రాష్ట్రం కావాలని కూడా కోరాను. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రానికై ఉద్యమం కూడా చేపట్టాను. ‘ఆంధ్ర రాష్ట్రం ‘పేరుతో ‘విశాలాంధ్ర ఏర్పడాలని బలమైన వర్గానికి ప్రతినిధులుగా ఉన్న బూర్గుల రామకృష్ణారావు ప్రభృతులు నన్ను పట్టుబట్టారు. ఈ అంశం మీదనే బూర్గులతో రాజకీయ విభేదాలు తలెత్తాయి. అయినా వ్యక్తిగతంగా మా ఇద్దరి మధ్య మితృత్వం చెదిరి పోలేదు.
– పులిజాల వెంకట రంగారావు

Leave a Reply