Take a fresh look at your lifestyle.

విద్యార్థులు, మహిళలు, మైనారిటీ సమూహాల పోరాటం

The struggle of students, women and minority groups

నిర్బంధాలకతీతంగా భారత లౌకిక రాజ్యాంగ విలువల పరిరక్షణకై..

‘‘ఎంత తీవ్ర నిర్బంధం ఎదురైనా, ఆంక్షలు విధించినా ప్రజలు అంతకంటే పెద్ద ఎత్తున దానిని తిరస్కరిస్తారు అనేదానికి తార్కాణం హైదరాబాద్‌లో జరిగిన రెండు చారిత్రాత్మకమైన  ప్రదర్శనలు. అనేక ఆంక్షల నడుమ, జనవరి 4న ఇందిరా పార్క్ ‌ధర్నా చౌక్‌ ‌వద్ద జరిగిన మిలియన్‌ ‌మార్చ్‌కు అనూహ్యంగా స్వచ్ఛందంగా వచ్చిన లక్షలాది మంది ప్రజలు ఒక చిన్న గొడవ కూడా జరగకుండా ఎంత క్రమశిక్షణతో వ్యవహరించారో చూసిన పోలీసులు నివ్వెరపోయారు. అలానే, జనవరి 10న హైదరాబాద్‌ ‌పాతబస్తీ మిరాలం ట్యాంక్‌ ‌దగ్గర జరిగిన సభలో కూడా చిన్నపాటి అపశ్రుతి కూడా జరగలేదు. కానీ, ఈ సభకు వస్తున్న ప్రజల మీద పురానాపూల్‌ ‌దగ్గర అకారణంగా లాఠీ చార్జీ చేసిన పోలీసు అధికారుల వ్యవహారం సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే బయటకు వచ్చింది.’’

భారత రాజ్యాంగ లౌకిక స్ఫూర్తికి వ్యతిరేకంగా, రాజ్యాంగంలో రాసుకున్న ఆర్టికల్‌ 8(‌పుట్టుకతో, వారసత్వంతో పౌరసత్వ హక్కు), 14(సమానత్వ హక్కు), 15(సామాజిక సమానత్వం), 21(జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ) లకు విరుద్ధంగా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకు వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం మీద దేశంలోనే కాదు విదేశాల్లో కూడా తీవ్ర వ్యతిరేకతలు వస్తున్నాయి. కానీ, ఈ చట్టంతో పాటు, కేవలం దేశ సరిహద్దు రాష్ట్రాల్లోనే కాకుండా, దేశమంతా అమలుచేసి తీరతామని ప్రకటిస్తున్న జాతీయ పౌరస్వత్వ రిజిస్టర్ల గురించి మనదేశంలో సామాన్య ముస్లిమేతరులకు ఎంతమందికి అవగాహన వుంది? ఒక పక్క వివేకానందుడు మా స్ఫూర్తి అని ప్రకటించుకునే హిందూ మతస్థులు ఆయన చెప్పిన మాటను ఎందుకు మర్చిపోతున్నారు. ‘‘ఈ పుడమి మీద వుండే అన్ని దేశాల, మతాల నుండి శరణాగతులై వచ్చే ప్రజలను అక్కున చేర్చుకునే దేశ పౌరుడనైనందుకు నేను గర్వపడుతున్నాను’’ అని ఆయన చికాగో నగరంలో ప్రపంచ ఆధ్యాత్మిక సదస్సులో చేసిన ప్రకటన గురించి మర్చిపోయారా? ఈ దేశంలోని మైనారిటీ సమూహాల, అణగారిన సమూహాల, తెగల పౌరులను శాశ్వత అభద్రతలోకి నెట్టేసే విధానానికి చట్ట రూపం తీసుకువస్తే అది తమకు సంబంధించినది కాదు అని ముస్లిమేతరులు ఎందుకు భావిస్తున్నారు? శాంతియుత విధానాల్లో తమ వ్యతిరేకతను, నిరసనను చూపిస్తున్న ప్రతి సమూహం మీదా దేశ వ్యాపితంగా పోలీసు బలగాలు విచక్షణారహితంగా ఎందుకు హింసకు పాల్పడుతున్నాయి? బహుళ మత, కుల సముదాయంతో విభిన్నతతో వుండే భారత సమాజ అల్లికను కేవలం ఆధిపత్య హిందూత్వ సమూహ అస్తిత్వంగా మార్చటానికి ఒక్కొక్కటిగా చేస్తున్న ప్రయత్నాల్లో పరాకాష్టగా పౌరసత్వ చట్టంలో మార్పు తీసుకువస్తే దానిని వ్యతిరేకించకుండా వుండటం అంటే, ప్రజాస్వామ్యం అనే స్ఫూర్తికే విఘాతం కలిగినట్లు కాదా? ఈ ప్రమాదాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టే అస్సాం, జామియా మిలియా, అలిగడ్‌ ‌ముస్లిం యూనివర్సిటీ, జెఎన్‌యు, దేశంలోని ఇతర విశ్వవిద్యాలయాల విద్యార్థినీ విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున నిర్బంధాల నెదిరిస్తూ ఉద్యమిస్తున్నారు.

ఈ పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ), జాతీయ పౌరసత్వ రిజిస్టర్‌(ఎన్‌ఆర్‌సి), జాతీయ పౌర గణన(ఎన్‌పిఆర్‌) ‌మీద హైదరాబాద్‌లో లక్షలాది మందితో జరిగిన రెండు అతిపెద్ద ప్రదర్శనల మీద స్పందిస్తూ ఈ మధ్య నేను ప్రయాణించిన ఒక ఊబర్‌ ‌క్యాబ్‌ ‌డ్రైవర్‌ ‘‘‌ముఖ్యమంత్రి కేసిఆర్‌ ‌కొంతమందే వున్న ఆర్‌టిసి కార్మికుల మీద లాఠీ చార్జీ చేయించాడు కానీ, ఇన్ని లక్షల మంది ముస్లిములను రోడ్ల మీదకు ఎలా అనుమతించాడు’’ అని ఒకింత చిరాకుతో ప్రశ్నించాడు. ఏ విషయం మీద అంత మంది రోడ్ల మీదకు ప్రదర్శనగా వచ్చారో మీకు తెలుసా అని అడిగితే, పెద్దగా తెలియదు కానీ, ముస్లిముల స్పందన చూస్తుంటే అది వాళ్ళకు ఇబ్బంది కలిగించే విషయంగా అర్థమైందని మాత్రం చెప్పాడు. బొట్టు పెట్టుకుని వున్న అతని సామాజిక నేపథ్యాన్ని అడిగినప్పుడు తను ఎస్‌సి అని, పదవ తరగతి తర్వాత పై చదువు చదివించే స్థోమత తల్లిదండ్రులకు లేకపోవటంతో చదువు ఆపేసి ఉపాధి కోసం డ్రైవింగ్‌ ‌నేర్చుకున్నానని, తెలంగాణా గ్రామీణ ప్రాంతం నుంచీ బతకటానికి హైదరాబాద్‌ ‌వచ్చి డ్రైవర్‌గా పనిచేస్తున్నానని చెప్పాడు. అతను చెప్పిన అభిప్రాయం కేవలం, ఒక సాదా సీదా కాబ్‌ ‌డ్రైవర్‌కు మాత్రమే వున్న అభిప్రాయం మాత్రమే అనుకోవటానికి వీల్లేదు. మెజారిటీగా వున్న ముస్లిమేతరులు సిఎఎను తమకు వర్తించని చట్టంగా భావించడం, నెత్తి మీదకు వచ్చిన ప్రమాదాన్ని గ్రహించలేని, గ్రహించినా ప్రతిస్పందించలేని స్వభావానికి గుర్తు! ఒక సమూహాన్ని కంట్రోల్‌ ‌చేయటం అవసరమా, రేపు మీ సమూహాన్ని కూడా ఇలానే చేస్తే మీరు రోడ్ల మీదకు రారా అని అడిగిన తర్వాత, ఇది కేవలం ముస్లిములకు మాత్రమే సంబంధించిన సమస్య కాదు, ప్రతి ఒక్కరికీ సంబంధించినది అని వివరించినప్పుడు, మతపరంగా పౌరసత్వాన్ని గుర్తించడం తప్పు అని అతను ఆ సమయానికి అంగీకరిం చినప్పటికీ, అతను, అతని లాంటి అనేకమంది తన అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకోగలరా, దానికి తగినంత సమాచారం, రాజకీయ విశ్లేషణ వారికి అందే అవకాశం ఎంతవరకు వుంది అనే సందేహం నాకు ఇంకా నడుస్తూనే వుంది.

దళిత, బహుజన, ఇతర మైనారిటీ, అణగారిన సమూహాలతో పనిచేస్తున్న రాజకీయ, సామాజిక సంఘాలు, గ్రూపులు ఈ విషయంలో క్రియాశీలకమైన కార్యచరణలోకి ఇంతవరకూ రాకపోవటాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి? ఈ రోజు పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా గొంతు విప్పిన సమూహాల నిరసనను మీడియా నిస్పక్షపాతంగా చూపించడం లేదు. ప్రజల మీద ప్రకటితంగా, అప్రకటితంగా విధిస్తున్న నిర్బంధం గురించి కనీసంగా కూడా మాట్లాడటం లేదు. తెలంగాణా వరకు చూస్తే, హాల్‌ ‌మీటింగులను కూడా అనుమతించని పరిస్థితి నెలకొని వున్నది. దీని గురించీ ఏ మీడియా కూడా చర్చిస్తున్నట్లుగా కనిపించడం లేదు. ఎంత తీవ్ర నిర్బంధం ఎదురైనా, ఆంక్షలు విధించినా ప్రజలు అంతకంటే పెద్ద ఎత్తున దానిని తిరస్కరిస్తారు అనేదానికి తార్కాణం హైదరాబాద్‌లో జరిగిన రెండు చారిత్రాత్మకమైన ప్రదర్శనలు. అనేక ఆంక్షల నడుమ, జనవరి 4న ఇందిరా పార్క్ ‌ధర్నా చౌక్‌ ‌వద్ద జరిగిన మిలియన్‌ ‌మార్చ్‌కు అనూహ్యంగా స్వచ్ఛందంగా వచ్చిన లక్షలాది మంది ప్రజలు ఒక చిన్న గొడవ కూడా జరగకుండా ఎంత క్రమశిక్షణతో వ్యవహరించారో చూసిన పోలీసులు నివ్వెరపోయారు. అలానే, జనవరి 10న హైదరాబాద్‌ ‌పాతబస్తీ మిరాలం ట్యాంక్‌ ‌దగ్గర జరిగిన సభలో కూడా చిన్నపాటి అపశ్రుతి కూడా జరగలేదు. కానీ, ఈ సభకు వస్తున్న ప్రజల మీద పురానాపూల్‌ ‌దగ్గర అకారణంగా లాఠీ చార్జీ చేసిన పోలీసు అధికారుల వ్యవహారం సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే బయటకు వచ్చింది.

2020 సంవత్సరం మొదలై ఇంకా పదిహేను రోజులు కూడా గడవకముందే అనేకమంది మీద ఈ విషయంలో పోలీసు కేసులు నమోదు అవుతున్నాయి. జనవరి 4 సభ నిర్వాహకులు, కార్యకర్తల మీద ఇప్పటికే వివిధ పోలీసు స్టేషన్లలో 25 మంది మీద కేసులు నమోదయ్యాయి. విపరీతంగా పెరిగిన ఫీజుల అంశంతో పాటు పౌరసత్వ చట్టంపై ఉద్యమిస్తున్న ఢిల్లీ జవహర్లాల్‌ ‌నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులపై జనవరి 5 అర్ధరాత్రి హాస్టళ్లలోకి దౌర్జన్యంగా ప్రవేశించి దాడి చేసిన గుండాల చర్యలను శాంతియుతంగా నిరసించడానికి వచ్చిన కొంతమంది విద్యార్థులను నిర్బంధించి దాదాపు అర్ధరాత్రి వరకూ తమ ఆధీనంలో ఉంచుకున్నారు. నగరంలో వేరే ఎవరూ నిరసన తెలియ జేయకుండా ఉంటేనే వారిని వదిలిపెడతాం అనే మెలిక పెట్టి జరగవలసిన ఒక నిరసన కార్యక్రమం తప్పని పరిస్థితుల్లో రద్దు చేసుకునేలా చేశారు. టోలిచౌకి ప్రాంతంలో పౌరసత్వ చట్టానికి నిరసన తెలియజేస్తున్న ప్రజల మీద లాటీచార్జీ చేసి 60మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళా ఉద్యమాలలో క్రియాశీలకంగా ఉంటూ, సిఎఎకు వ్యతిరేకంగా జరుగుతున్న
ఉద్యమంలో భాగస్వామి అయిన ఖలీదాపర్వీన్‌ ‌వంటి వయోజన పౌరురాలిపై అనేక కేసులు బనాయించడం, హాల్‌ ‌మీటింగులు కూడా అనుమతినివ్వని పరిస్థితులపై నగర పోలీసు కమిషనర్ని కలిసి చర్చించడానికి వెళ్ళిన మహిళా సామాజికవేత్తలు జస్వీన్‌ ‌జైరత్‌, ‌షీలా శారా మాథ్యూలను నిర్బంధించడం, అదే సమయంలో తన వ్యక్తిగత పనిరీత్యా నగర పోలీసు కమిషనర్‌ ఆఫీసు ముందువున్న రహదారిమీద కారులో వెళుతున్న ప్రగతిశీల మహిళాసంఘం జాతీయ అధ్యక్షురాలు మరియు మహిళా ట్రాన్స్ ‌జెండర్‌ ‌సంఘాల ఐక్యకార్యచరణ బాధ్యుల్లో ఒకరైన సంధ్య(పిఓడబ్ల్యు)ను అటకాయించి అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నించడం వంటివన్నీ కూడా ఏం సూచిస్తున్నాయి? ఒక పక్క పార్లమెంట్లో ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్‌కి వ్యతిరేకంగా వోటు వేసిన తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం, ఆ చట్టానికి వ్యతిరేకంగా ప్రజలకు నిరసన కూడా తెలియజేసే అవకాశం ఇవ్వకపోవడం దేనికి సంకేతం? చిన్న విషయాలను కూడా గంటల తరబడి సాగదీసే మీడియా, మరి ఈ అంశాల మీద ఎందుకు చర్చించడం లేదు అని అడగాలా వద్దా? శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ ‌సమస్యలు అంటూ చిన్న చిన్న నిరసనలకు కూడా అనుమతులంటూ పోలీసులు సృష్టిస్తున్న అడ్డంకులు అన్నీ ఇన్నీ కాదనేది ప్రతి ఒక్కరికీ అనుభవమవుతున్న విషయమే! నిజానికి, బహిరంగ నిరసనలకు కూడా పోలీసుల అనుమతి అవసరం లేదు. ట్రాఫిక్‌, ఇతర సమస్యలు రాకుండా ఒక ముందస్తు సమాచారం ఇస్తే సరిపోతుంది. అంతవరకూ ఈ నిబంధనను అంగీకరించడానికి ఎవరికీ అభ్యంతరం లేదు. ధర్నా చౌక్‌లో ఇంతకాలంగా జరిగిన నిరసన ప్రదర్శనలే అందుకు ఉదాహరణ. శాంతి యుతంగా ఉన్నప్పటికీ ధర్నా చౌక్‌ ‌మీద దాదాపు ఒకటిన్నర సంవత్సరం పాటు అప్రకటిత నిషేధం విధించి, ప్రజా, రాజకీయ సంఘాల సంఘటిత ఉద్యమంతో, హైకోర్ట్ ‌జోక్యంతో మళ్ళీ తప్పనిసరిగా నిషేధాన్ని ఎత్తివేశారు. కానీ, ఇప్పటికీ, కొన్ని అంశాల మీద, సంఘాల మీదా ఆ అప్రకటిత నిషేధం అమలవుతూనే వుంది.

ఇంకో ముఖ్యమైన విషయం, హాల్‌ ‌లోపల జరిగే సమావేశాలకు పోలీసుల అనుమతి అనేదే అవసరం లేదు. కానీ, కొన్ని సందర్భాలలో తమ పరిధిలోకి రాని అంశాల మీద కూడా పోలీసులు జోక్యం చేసుకుంటున్నారు. హాలు యాజమాన్యాలకు హెచ్చరికలు జారీచేయటం ద్వారా సమావేశాల నిర్వహణకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. వ్యాపార నిర్వహణ అనుమతులు రద్దు చేయిస్తామని బెదిరిస్తున్నారు. పోలీసుల ఆదేశాలతో భయపడుతున్న ఆయా యాజమాన్యాలు సమావేశాల నిర్వహణకు అంగీకరించడం లేదు. పోలీసులు అనుమతి ఉంటేనే స్థలాన్ని అద్దెకు ఇవ్వగలుగుతామని నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నాయి. 2020 జనవరిలోనే రెండు తాజా ఉదాహరణలు వున్నాయి. ఒకటి, విప్లవ రచయితల సంఘం 50 సంవత్సరాల మహాసభలకు హాలు నిర్వాహకుల వైపు నుంచీ అడ్డంకులు సృష్టించడంతో, ఆ సంస్థ బాధ్యులు హైకోర్టుకు వెళ్లిన చివరి క్షణంలో పోలీసులు అనుమతిని ఇచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం మీద మాట్లాడటానికి వస్తున్న జవహర్లాల్‌ ‌నెహ్రు యూనివర్సిటీ పూర్వాధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ ‌సమావేశాన్ని కూడా ఈవిధంగానే రద్దు చేయించారు. ఈ అంశంపై పోలీస్‌ ‌కమిషనర్‌ ‌వద్దకు మాట్లాడటానికి వెళితేనే ఇద్దరు మహిళా సామాజికవేత్తలను అదుపులోకి తీసుకున్నారు. ఇంతకు ముందు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఏ గొంతుకలకూ అవకాశం లేకుండా చేయటానికి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. నిరుద్యోగ గర్జన నుంచి ఆర్‌టిసి కార్మికుల సమస్య వరకూ ఇలాంటి ఎన్నో అంశాలు మన గ్రహింపు నుంచి వెళ్ళిపోయే అంశాలు కాకూడదు!!?

k sajaya

Leave a Reply