Take a fresh look at your lifestyle.

భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం

  • హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయం
  • మూసీపరివాహక ప్రాంతాల్లో అప్రమత్తత
  • మూసారాం బాగ్‌ ‌బ్రిడ్జి వద్ద రాకపోకల నిషేధం
  • నిండుకుండల్లా ప్రాజెక్టులు..పొంగుతున్న వాగులు, వంకలు
  • హిమాయత్‌ ‌సాగర్‌ ‌నుంచి నీటి విడుదల
  • భారీ వర్షాలపై ఉమ్మడి వరంగల్‌, ‌నల్లగొండ జిలా కలెక్టర్లతో మంత్రుల సమిక్ష
  • కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి
  • ఉమ్మడి నిజామాబాద్‌లో పొంగుతున్న వాగులు..వాగులో కొట్టుకు పోయిన వ్యక్తి…నీట మునిగిన సరికొండ విద్యుత్‌ ‌సబ్‌స్టేషన్‌
  • ఆదిలాబాద్‌ ‌జిల్లాలో వర్షాలకు ప్రాజెక్టుల్లోకి నీరు

భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతున్నది. హైదరాబాద్‌ ‌సహా పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉండి ఇంకా వరద ప్రవాహం కొనసాగుతుండడంతో గేట్లు ఎత్తి నీటిని వొదులుతుండడంతో పరీవాహక ప్రావతాల్లో కాలనీలలోని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. అనేక ప్రాంతాల్లో చెరువులు పూర్తిగా నిండి ఎప్పుడు తెగి ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాతావరణ శాఖ అధికారులు తుపాను ప్రభావంతో ఇంకా వర్షాలు పడే అవకాశముందని హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇక హిమాయత్‌ ‌సాగర్‌కు భారీగా వరద నీరు వొచ్చి చేరుతుంది. నీటిమట్టం అంతకంతకూ పెరుగుతుండటంతో నాలుగు గేట్లుఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. బండ్లగూడ జాగీర్‌ ‌కార్పొరేషన్‌ ‌పరిధిలో ఉన్న ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలను అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు. మరోవైపు హిమాయత్‌ ‌సాగర్‌, ‌హుస్సేన్‌ ‌సాగర్‌ ‌నీటి విడుదలతో మూసరాం బాగ్‌ ‌బ్రిడ్జి వద్ద అప్రమత్తం చేశారు. మూసీ నదికి భారీగా వరద ఉధృతి పెరిగింది. మూసారంబాగ్‌ ‌వంతెనను తాకుతూ వరద ప్రవహిస్తుంది. దీంతో అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా మూసారాంబాగ్‌ ‌వంతెనపై రాకపోకలు నిలిపివేసి, ట్రాఫిక్‌ను మళ్లించారు. గోల్నాక న్యూ బ్రిడ్జి దారిలో ట్రాఫిక్‌ ‌జామ్‌ అయ్యింది. అలాగే చాదర్‌ఘాట్‌ ‌చిన్న వంతెనపైకి వాహనాలకు రాకుండా చర్యలు చేపట్టారు. మూసీ పరీవాహక ప్రాంతానికి చిన్నారులు రావొద్దని హెచ్చరించారు. ఈ క్రమంలో చాదర్‌ఘాట్‌, ‌శంకర్‌నగర్‌, ‌మూసారాంబాగ్‌, ఓల్డ్ ‌మలక్‌పేటలో హైఅల్టర్‌ ‌ప్రకటించారు. మూసీ వరద ఉధృతి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎం‌సీ సూచించింది. మూసీలో క్రమ క్రమంగా వరద పెరుగుతుండడంతో జీహెచ్‌ఎం‌సీ, ట్రాఫిక్‌ ‌పోలీసులు ఎప్పటికప్పుడు నీటిమట్టాన్ని పరిశీలిస్తున్నారు. ప్రవాహాన్ని అంబర్‌పేట సర్కిల్‌ ‌డీసీ వేణుగోపాల్‌, ‌మలక్‌పేట ట్రాఫిక్‌ ‌సీఐ జ్యోత్స్న పరిశీలించారు. గగన్‌పహాడ్‌ ‌వద్ద అప్ప చెరువుకు వరద పోటెత్తింది. దీంతో అప్ప చెరువు అలుగు పొంగిపొర్లుతున్నది. ఈ క్రమంలో హైదరాబాద్‌-‌బెంగళూరు జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు వచ్చింది. దీంతో ఆ మార్గంలో వెళ్లే వాహనాలను ట్రాఫిక్‌ ‌పోలీసులు దారి మళ్లించారు. శంషాబాద్‌ ‌వైపు వెళ్లే వాహనాలు ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డుమిదుగా వెళ్లాలని సూచించారు. శంషాబాద్‌ ‌నుంచి హైదరాబాద్‌ ‌మార్గంలో రాకపోకలు యథాతథంగా కొనసాగుతున్నాయి. మరోవైపు నగర శివార్లలోని హిమాయత్‌ ‌సాగర్‌కు వరద పోటెత్తింది. ఇప్పటికే రెండు గేట్లను తెరిచి ఉంచగా, మంగళవారం ఉదయం మరో నాలుగు గేట్లను జలమండలి అధికారులు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

భారీ వర్షాలపై ఉమ్మడి వరంగల్‌, ‌నల్లగొండ జిలా కలెక్టర్లతో మంత్రుల సమిక్ష
భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లతో మంత్రులు సమిక్షించారు. ఎక్కడిక్కడ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరద పరిస్థితులపై ఆరా తీసారు. ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలోని హన్మకొండ, వరంగల్‌, ‌మహబూబాబాద్‌, ‌ములుగు, భూపాలపల్లి, జనగామ కలెక్టర్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు అప్రమత్తం చేశారు. మంగళవారం ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలపై టెలీ కాన్ఫరెన్స్ ‌ద్వారా జిల్లా కలెక్టర్లతో మాట్లాడి పరిస్థితులను సమిక్షించారు. గులాబ్‌ ‌తుఫాన్‌ ‌ప్రభావంతో మంగళవారం, బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని, ఈ పరిస్థితులలో ఏ విధమైన ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో రెవెన్యూ, పోలీస్‌, ‌పంచాయతీరాజ్‌, ‌నీటిపారుదల, రోడ్లు భవనాల శాఖ సమన్వయంతో కృషి చేసి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా సమర్థవంతంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి మండలంలో ప్రత్యేక అధికారులను నియమించి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి జగదీష్‌ ‌రెడ్డి ముమ్మడి నల్లగొండ జిల్లా అధికారులను హెచ్చరించారు. రెస్క్యూ టీంలను అందుబాటులో ఉంచాలని, ప్రమాదాలు సంభవించకుండా విద్యుత్‌ ‌శాఖాధికారులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గులాబ్‌ ‌తుఫాను రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో మంగళవారం నాడు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లా కలెక్టర్లతో మంత్రి జగదీష్‌ ‌రెడ్డి టెలీ కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. గులాబ్‌ ‌తుఫాన్‌ ‌తీవ్రత పెరిగి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్‌ ‌రెడ్డి ఆదేశించారు. ప్రమాదకరంగా ఉండే లోతట్టు ప్రాంతాలను గుర్తించాలని, అలాగే ఆయా ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు.

కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి
భారీగా వర్షాలతో జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా మండలం కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉప్పొంగుతుంది. త్రివేణి సంగమంలో గోదావరి నది ప్రవాహం అంతకంతకు పెరుగుతుంది. ప్రాణహిత, గోదావరి నదులు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో కాళేశ్వరం వద్ద 8 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. ఈ ప్రవాహం 11.5 మిటర్ల ఎత్తులో కొనసాగుతోంది. నదీ ప్రవాహం ఇంత ఎక్కువగా ఉండటంతో మంగళవారం సాయంత్రం నాటికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు ఉన్నాయి.

ఉమ్మడి నిజామాబాద్‌లో పొంగుతున్న వాగులు..వాగులో కొట్టుకు పోయిన వ్యక్తి…నీట మునిగిన సరికొండ విద్యుత్‌ ‌సబ్‌స్టేషన్‌
‌గులాబ్‌ ‌తుపాన్‌ ‌ప్రభావంతో నిజామాబాద్‌ ‌జిల్లాలో అతి భారీ వర్షాలు కురిశాయి. దీనికితోడు ఎగువ మహారాష్ట్ర నుంచి కూడా భారీగా వరదనీరు గోదావరి నదిలో వచ్చి చేరుతుండడంతో మంజీరా నదిలో ప్రవాహం ఉధృతంగా కనిపిస్తుంది. నిజామాబాద్‌ ‌జిల్లా రెంజల్‌ ‌మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉగ్రరూపం చూపిస్తుంది. తెలంగాణ మహారాష్ట్రలను కలిపే అంతర్రాష్ట్ర బ్రిడ్జిని కూడా గోదావరి ప్రవాహం ముంచేయడంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే గోదావరి నదీ పరివాహక ప్రాంతంలోని చాలా పంట పొలాలు వరద నీటిలో మునిగిపోయాయి. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో భీంగల్‌ ‌మండలంలో గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌లోడుతో వెళ్తున్న వాహనం గొనుగొప్పుల గ్రామం వద్ద గల ప్రధాన రహదారి మిద నుంచి వెళ్తున్న నీటి ప్రవాహంలో చిక్కుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొన్నారు. స్థానికుల సహకారంతో వరద ప్రవాహంలో చిక్కుకున్న వాహనం, డ్రైవర్‌ను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. తృటిలో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, భారీ వర్షాలు కురుస్తుంన్నందున ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు. కామారెడ్డి మండలం లింగాపూర్‌ ‌చెరువు అలుగు ప్రవాహంలో వ్యక్తి కొట్టుకుపోయిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పందిరి భగవంత్‌ ‌రెడ్డి అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై కామారెడ్డి నుంచి లింగాపూర్‌కు వెళుతున్నాడు. లింగాపూర్‌ ‌చెరువు అలుగు పారుతున్నప్పటికీ దాటే ప్రయత్నం చేయడంతో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. భగవంత్‌ ‌రెడ్డి కోసం గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. పలు చోట్ల రోడ్లు తొగిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమ్యాయి. జిల్లాలోని సిరికొండ మండలం సబ్‌ ‌స్టేషన్‌ను వరద నీరు చుట్టుముట్టింది. తుఫాన్‌ ‌ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో సబ్‌ ‌స్టేషన్‌ ‌లోకి భారీగా నీళ్లు చేరడంతో కరెంట్‌ ‌సరఫరాను నిలిపివేశారు.రాత్రి నుంచి పలు గ్రామాల్లో కరెంటు నిలిచిపోవడంతో అంధకారం నెలకొంది. సబ్‌ ‌స్టేషన్‌లో చేరిన వరద నీటిని బయటకు పంపేందుకు ఎన్పీడీసీఎల్‌ ‌సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు.

ఆదిలాబాద్‌ ‌జిల్లాలో వర్షాలకు ప్రాజెక్టుల్లోకి నీరు
కొమురంభీం ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం అధికంగా ఉండటంతో అధికారులు ఐదు గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. దాదాపు 14వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్‌ ‌ఫ్లో 6030 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 243.000 మిటర్లు కాగా…ప్రస్తుత నీటి మట్టం 242 మిటర్లకు చేరింది. ఖానాపూర్‌ ‌మండలంలోని మేడంపెల్లి సవి•పంలో గల సదర్‌మాట్‌ ఆనకట్టకు భారీగా వరద రావటంతో ఉదృతిగా ప్రవహించింది. ఎగువన శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టు నుండి గేట్లు ఎత్తటంతో సదర్‌మాట్‌ ‌పొంగి ప్రవహించింది. దీంతో 46935 క్యూసెక్కుల నీరు గోదావరిలోకి వెళ్లుతుందని, లెఫ్ట్ ‌కాలువకు 369, రైట్‌ ‌కాలువకు 25 క్యూసెక్కుల నీరు వదిలినట్లు జేఈ ఉదయ్‌కుమార్‌ ‌తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

గడ్డెన్న వాగు గేట్లు ఎత్తడంతో భైంసాలో వరద
గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ ‌గేట్లు ఎత్తడంతో భైంసాలోని లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. ఆటోనగర్‌లోకి వరద పోటెత్తింది. మహారాష్ట్ర నుంచి వొస్తున్న నీటితో మహాగాం వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. గుండెగాం చుట్టూ వరద చేరింది. గ్డడెన్న వాగు ప్రాజెక్ట్‌కు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ఈరోజు ఉదయం అధికారులు ప్రాజెక్ట్ 3 ‌గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ‌నుంచి 39,726 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్‌ ‌ఫ్లో 31,920 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. గ్డడెన్న వాగు ప్రాజెక్ట్ ‌పూర్తిస్థాయి నీటిమట్టం 358.7 అడుగులు కాగా, ప్రస్తుతం 358.7అడుగులుగా ఉంది.

Leave a Reply