Take a fresh look at your lifestyle.

బిజేపి మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది

  • మోడి కాంగ్రెస్‌ను తిడితే టీఆర్‌ఎస్‌కు ఎందుకు బాధ  
  • మోసం చేసింది కాబట్టే కాంగ్రెస్‌ అ‌డ్రస్‌ ‌లేకుండా పోయింది
  • అమరుల ఆంకాక్షల కోసం పనిచేస్తాం
  • బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్‌
  • అమరు వీరుల స్థూపానికి పూలమాల వేసిన బిజేపి నేతలు

న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9 : బిజేపి మద్దతుతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్‌ అన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థించిన పార్టీ బీజేపీయే అని చెప్పారు. పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ ‌తెలంగాణ బిల్లు పెట్టకపోతే, తర్వాత అధికారంలోకి వొచ్చే బిజేపి తెలంగాణ ఇస్తుందని సుష్మా స్వరాజ్‌ ‌హెచ్చరించారన్నారు. అందుకే కాంగ్రెస్‌ ‌బయపడి తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టిందని చెప్పారు. కాంగ్రెస్‌ ‌బిల్లు పెడితే బిజేపి మద్దతు ఇచ్చిందన్నారు. కానీ, మెజార్టీ ఉన్నా, బిల్లుపై కాంగ్రెస్‌ ‌పార్టీ చర్చ జరగనీయలేదన్నారు. తెలంగాణకు కాంగ్రెస్‌ ‌మోసం చేసింది కాబట్టే, రాష్ట్రంలో ఆ పార్టీని అడ్రస్‌ ‌లేకుండా పోయిందన్నారు. తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంట్‌లో మోడి కామెంట్స్‌పై టీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌నేతల వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎంపీ సోయంబాపు రావు, ఇతర నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్ర విభజన తీరుపై ప్రధాని మోడి కాంగ్రెస్‌ను విమర్శిస్తే, టీఆర్‌ఎస్‌ ‌పార్టీ నేతలకు నొప్పేంది.

ప్రధాని రాష్ట్ర ఏర్పాటును, విభజన బిల్లును వ్యతిరేకించారా?. కాశ్మీర్‌ ‌నుంచి కన్యాకుమారి వరకు కాంగ్రెస్‌ ‌చేసిన అనర్థాలను తన స్పీచ్‌ ‌ద్వారా చెప్పారు.’ అని అన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ మోడీ దిష్టి బొమ్మలను తెలంగాణలో దగ్దం చేయడంపై ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ అన్నట్లు, టీఆర్‌ఎస్‌కు డౌన్‌ ‌ఫాల్‌ ‌స్టార్ట్ అయిందన్నారు. ఏ అంశం తీసుకున్నా…వాళ్లకు బూమ్రాంగ్‌ అవుతుందన్నారు.  సిఎం మాట్లాడితే తెలంగాణ ప్రజలకు ఫుల్‌ ‌టైం పాసని, ఆయనో పెద్ద జోకర్‌ అయ్యాడని విమర్శించారు. మోడిని తిడితే అదే స్థాయిలో అడ్డుకుంటామని హెచ్చరించారు. బిజేపి నేతల్ని అరెస్ట్, ‌గృహ నిర్బంధం చేసి నిరసనలు తెలిపే స్థాయికి టీఆర్‌ఎస్‌ ‌దిగజారిందని విమర్శించారు. అమరుల త్యాగాలను స్మరిస్తూ తెలంగాణ భవన్‌లోని అమర వీరుల స్థూపానికి పూల మాల వేసి నివాళులర్పించారు.

రాష్ట్ర ఏర్పాటు కేసీఆర్‌కు ఇంట్రెస్ట్ ‌లేదు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేసీఆర్‌కు ఇంట్రెస్ట్ ‌లేకుండెనని, కేసీఆర్‌ ఒక్కరు తప్ప, అన్ని పార్టీలు ఒప్పుకుంటేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు బండి సంజయ్‌. ‌కాంగ్రెస్‌ ‌పార్టీ ఎంపీలు పెప్పర్‌ ‌స్ప్రే కొట్టినా…బిజేపి నేత సుష్మా స్వరాజ్‌ ‌బయటకు పోలేదన్నారు. ‘నా ప్రాణాలు పోయినా ఫర్వాలేదు, తెలంగాణ యువకుల ప్రాణాలు పోనివ్వను’ అని బిల్లుకు ఆమోదం తెలిపిన విషయం కాంగ్రెస్‌, ‌టీఆర్‌ఎస్‌లు గుర్తుంచుకోవాలని చెప్పారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్‌ ఎక్కడికి పోయారని బండి సంజయ్‌ ‌ప్రశ్నించారు. విభజన బిల్లు చర్చలో ఎందుకు పాల్గొనలేదో..వోటింగ్‌కు ఎందుకు దూరంగా ఉన్నారో.. కేసీఆర్‌ ‌రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. టీఆర్‌ఎస్‌ ‌నుంచి కేసీఆర్‌, ‌విజయ శాంతి ఉంటే… విజయశాంతి పాల్గొన్నారని చెప్పారు. ఢిల్లీలో 48 దీక్షలు చేపట్టి ఎందుకు విరమించారని నిలదీశారు. కేసీఆర్‌వి అన్నీ  దొంగ దీక్షలే అని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులను చేర్చుకొని రాష్ట్ర క్యాబినేట్‌ అం‌టున్నారని విమర్శించారు.

తెలంగాణ అమరుల ఆత్మ ఘోశ కేసీఆర్‌కు వినిపించడం లేదా? అమరుల కుటుంబాల బాధలు కనిపించడం లేదా? అని బండి సంజయ్‌ ఈ ‌సందర్భంగా నిలదీసారు. కేసీఆర్‌ ‌కుటుంబం, తెలంగాణ ద్రోహులు రాజ్యామేలడానికా? శ్రీకాంత్‌ ‌చారి ప్రాణాలు విడించిందని ప్రశ్నించారు. ఆత్మ హత్య చేసుకునేందుకు కేసీఆర్‌ ‌కుటుంబ సభ్యులకు కనీసం అగ్గిపెట్టె దొరకలేదని ఎద్దేవా చేశారు. కానీ, రాష్ట్రం కోసం బలిదానాలు చేసుకునేందుకు శ్రీకాంతా చారికి అగ్గిపెట్టే, కృష్ణయ్యకు రివాల్వర్‌, ‌సుమన్‌కు ట్రైన్‌ ‌దొరికిందని చెప్పారు. కాకినాడ తీర్మానంలో ‘ఒక వోటు-రెండు రాష్ట్రాలు’ అనే తెలంగాణ రాష్ట్ర నినాదాన్ని ముందుగా ఎత్తుకుంది బిజేపియేనని అన్నారు. పార్లమెంట్‌లో మెజార్టీ లేకపోవడం, చంద్రబాబు అడ్డుకోవడం వల్ల తెలంగాణ ఏర్పాటు చేయలేకపోయినట్లు చెప్పారు. ఈ నినాదంతోనే కేసీఆర్‌ ‌టీడీపీని వీడి, తెలంగాణ పేరు ఎత్తుకున్నారని గుర్తు చేశారు. పెప్పర్‌ ‌స్ప్రే లేకుండా, డోర్లు బంజేయకుండానే ఇచ్చిన మాట ప్రకారం బిజెపి మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కానీ, కేసీఆర్‌, ‌చంద్రబాబుతో పొత్తుపెట్టుకొని నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేశారన్నారు.

ప్రస్తుత ఏపి సర్కార్‌ ‌ప్రాజెక్ట్‌లపై బిజేపి స్పందించే వరకు కేసీఆర్‌ ‌ఫాంహౌజ్‌ను వీడలేదని విమర్శించారు. ప్రజల దఈష్టి మరల్చేందుకు రైతు, విద్యుత్‌ ‌చట్టాలను తెరపైకి తెస్తారని మండిపడ్డారు. కల్వకుంట్ల రాజ్యాంగం ఒప్పుకుంటే…ఉద్యోగాలు రావు, నిరుద్యోగ భృతి రాదు, దళిత బంధు రాదని, రుణ మాఫీ జరగదు, రైతులను ఆదుకోరు, 317 వంటి అనేక జీవోలు వొస్తయి, డబుల్‌ ‌బెడ్‌లు అసలే రావని సంజయ్‌ ‌విమర్శించారు. ధరణి వంటి స్కీమ్‌లతో దోచుకుంటారని, కేంద్రం నిధులు దారి మళ్లిస్తారని, విచ్చల విడిగా కబ్జాలకు పాల్పడుతారని ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం అమరవీరుల ఆత్మలు ఘోశిస్తున్నాయని దేనికోసం అమరులు బలిదానాలు చేసారో, ఆ ఆంక్షాలను బిజేపి తీర్చుతుందని బండి సంజయ్‌ ‌భరోసా ఇచ్చారు.

Leave a Reply