- లాక్డౌన్ కాలంలో విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలి
- నష్టాల్లో కూరుకుపోయిన థియేటర్లను ఆదుకోవాలి
- నిబంధనల మేరకు నడుపుతామన్న థియేటర్లు యాజమాన్యాలు
థియేటర్లు తెరచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా..అనుమతి ఇవ్వాలని థియేటర్ల ఓనర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. తెలంగాణ థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ సమావేశం శనివారం నాడిక్కడ జరిగింది. ఈ సందర్భంగా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. థియేటర్ ఇండస్ట్రీ చావు బ్రతుకుల్లో ఉందని..ప్రభుత్వం ఆదుకోవాలని కోరింది. ప్రతీ థియేటర్‌కి రాష్ట్ర ప్రభుత్వం ఇన్సెంటీవ్స్ ఇవ్వాలని కోరింది. లాక్డౌన్ సమయంలో థియేటర్ల విద్యుత్ బిల్లులు మినహాయించాలని విజ్ఞప్తి చేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం.. థియేటర్లలో పార్కింగ్ ఛార్జీలను ఎత్తివేసిందని థియేటర్ల ఓనర్లు తెలిపారు. తమకు కూడా ఏదో రకంగా ఆదుకుంటే తప్ప థియేటర్లను అందుబాటులోకి తీసుకుని వచ్చే పరిస్థితి లేదన్నారు. మొత్తానికి కొరోనా లాక్డౌన్ వలన దాదాపు ఆరు నెలలుగా మూతపడ్డ థియేటర్స్ త్వరలోనే తెరుచుకునేందుకు రంగం సిద్దం చేస్తున్నారు.
అన్‌లాక్ 5 మార్గదర్శకాల్లో ఈ నెల 15 నుండి థియేటర్లు ప్రారంభించొచ్చు. అయితే 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే థియేటర్లు నడపాలని, ప్రతి షోకు థియటర్ శానిటైజ్ చేయడం తప్పనిసరి అని మార్గదర్శకాల్లో ప్రభుత్వం థియేటర్ యజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. సినిమా థియేటర్స్ పునః ప్రారంభంపై తెలంగాణ థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ సమావేశం అయింది. సుదర్శన్ థియేటర్లో వీరందరు సమావేశం కాగా, థియేటర్స్ ప్రారంభిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై చర్చ చేశారు. టిక్కెట్స్, భౌతిక దూరం, శానిటైజేషన్, నిర్వహణ భారం, పార్కింగ్, కరెంట్ బిల్ తదితర విషయాల గురించి చర్చించారు. సినిమా థియేటర్స్‌కు ఎక్కువ కరెంట్ బిల్లులు వస్తున్నాయని ప్రతినిధులు పేర్కొన్నారు . కొరోనా సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రేక్షకులు ఎవరూ టిక్కెట్స్, నగదు తాకకుండా తగు చర్యలు తీసుకుంటామన్నారు. సినిమా విరామంలో ప్రేక్షకులు గుమిగూడకుండా ఉండేలా ఏర్పాటు చేయడంతో పాటు, శానిటైజర్స్ కూడా అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ నెల 15న థియేటర్స్ తెరిచిన ఒకేసారి ప్రేక్షకులు రారరని థియేటర్ యజమానులకు కొన్నాళ్ళపాటు ఇబ్బందులు తప్పవని, తెలంగాణ ప్రభుత్వం కూడా థియేటర్స్ తెరిచేందుకు అనుమతినిస్తుందని భావిస్తున్నామని తెలంగాణ థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ వి•డియా సమావేశంలో తెలిపారు.