ప్రస్తుత కొరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం వరంగల్ రూరల్ జిల్లా డిఎంఅండ్‌హెచ్‌వో పరిధిలోని రాయపర్తి ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొరోనా వైరస్ నేపథ్యంలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్యులు, వైద్య సిబ్బంది కొరోనా కట్టడికి పూర్తిస్థాయిలో సేవలందించాలని అనుమానితులకు పరీక్షలు చేయడంతో పాటు ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు తమ పరిధిలోని గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి అనుమానితులను గుర్తించాలని అన్నారు.
అనంతరం ఫోన్ ద్వారా రూరల్ డిఎంహెచ్వో మధుసూదన్‌తో మాట్లాడి ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వం కొరోనా కట్టడికి లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో ఎవరు కూడా లాక్ డౌన్ అతిక్రమించవద్దని ఇంట్లోనే ఉండి కొరోనా సోకకుండా చూసుకోవాలని తెలిపారు. వైద్యసిబ్బంది, పోలీస్‌శాఖ, శానిటేషన్ సిబ్బంది కొరోనా నియంత్రణకు నిత్యం శ్రమిస్తున్నారని వారి సేవలు ప్రభుత్వం గుర్తించి ప్రోత్సాహకాలు అందించడం జరిగిందని, కొరోనాను రూపుమాపేందుకు ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని కోరారు.